ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని వీక్షిస్తున్న ప్రజలు
గలగల సవ్వడితో.. ఎంతో నిర్మలంగా ప్రవహించే పావన గోదావరి.. వరుణుడు తోడవడంతో.. ప్రళయ స్వరూపిణిగా రూపుదాల్చింది. మార్గం మధ్యలో ఉన్న ఉప నదులను, వాగులను కలుపుకొని, శక్తిని పెంచుకొని.. నడకలే పరుగులై.. పరుగులే ఉరకలై.. వడి పెంచి.. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకూ ఒరుసుకుంటూ పారుతూ.. తీరంలోని పల్లెలను, తనలోని లంకలను చుట్టుముట్టి.. ముంచెత్తుతూ.. సాగర సంగమం దిశగా ఉధృత వేగంతో పరుగులు తీస్తోంది. వారం రోజులుగా గోదావరికి పోటెత్తుతున్న వరద ఆదివారం మరింత ఉధృతమైంది. దీంతో ఎగువన విలీన మండలాలు మొదలు, దేవీపట్నం, కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది.
సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : నాలుగైదు రోజులుగా ఉగ్రరూపమెత్తిన గోదావరి ఆదివారం ప్రళయస్వరూపిణిగా మారింది. ఎగువన స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద దిగువన కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టింది. అక్కడ నిలకడగా ఉండగా ఇక్కడ ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో ఏజెన్సీలో వరద అడుగు మేర తగ్గగా, కోనసీమలో రెండు మూడడుగులు పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.20 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. బ్యారేజి నుంచి 13,50,363 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
తెలంగాణలోని దుమ్ముగుడెం, భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతూండడంతో సోమవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఏజెన్సీలో నిలకడగా ఉంది. అయితే కాఫర్ డ్యామ్ కారణంగా వరద నీరు తీయడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో దేవీపట్నం మండలంలోని గ్రామాలు మరో రెండు మూడు రోజులు ముంపులోనే ఉండే అవకాశముంది. ఈ మండలానికి చెందిన సుమారు 3,800 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఐదు వేల మందికి పైగా భోజనాలు చేస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారు ఇంకా ముంపునీటిలోనే ఉన్నారు.
లంకలను ముంచెత్తుతూ..
ఏజెన్సీలో వరద తగ్గుతూండగా కోనసీమలో దీని ప్రభావం పెరుగుతోంది. గంటగంటకూ గోదావరి నీటిమట్టం పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువస్తోంది. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది మధ్య ఉన్న గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు, ముక్తేశ్వరం, కనకాయలంక, గంటిపెదపూడి కాజ్‌వేలు మునిగిపోవడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్‌వేల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పడవల ద్వారా లంక వాసులను, రైతులను, వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దాటిస్తున్నారు. ముందస్తుగా సహాయ పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
అయితే వరద తగ్గుతున్న సూచనలు ఉండడంతో వీటి అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు ఇప్పటికే నిత్యావసర వస్తువులను చేరవేసిన అధికారులు.. వాటిని స్థానికులకు అందజేస్తున్నారు. వరద తీవ్రతకు గోదావరి నదీ కోత ఉధృతమవుతోంది. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం కమిని, సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కొండుకుదురులంక, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటిచోట్ల నదీ కోత ఎక్కువగా ఉంది.
10,354 ఎకరాల్లో నీట మునిగిన వరి
జిల్లాలోని సుమారు 10,354 ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే అధికంగానే చేలు ముంపులో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం రామరాజులంక వంటి ప్రాంతాల్లో వరిసాగు చేస్తూంటారు. వీటితో పాటు డెల్టాలో చేలు సహితం ముంపు బారిన పడ్డాయి. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ప్రధాన డ్రెయిన్ల నుంచి ముంపు నీరు దిగడం లేదు. పైగా రెండు రోజుల నుంచి నదుల నుంచి వస్తున్న నీరు డ్రెయిన్ల ద్వారా చేలల్లోకి చొచ్చుకువస్తోంది. దీనివల్ల ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని రామచంద్రపురం, కరప, కాకినాడ సబ్ డివిజన్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో వరిచేలు ముంపు బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లోని తుల్యభాగ, బండారులంక కౌశిక, గొరగనమూడి, ఓల్డ్ అయినాపురం, నార్త్ అడ్డాల్.
పెరుమళ్లరాజుకోడు, గొంది నోవా, శంకరగుప్తం, వేపచెట్టు, అంతర్వేది రాళ్ల కాలువల నుంచి కూడా ముంపు నీరు నదుల్లోకి దిగడం లేదు. దీనికితోడు ఆదివారం వరద ఉధృతి పెరగడంతో ముంపు మరింత పెరిగింది. పరిస్థితి చూస్తే మరో రెండు మూడు రోజులు చేలు ముంపులోనే ఉండనున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే చేలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క వరదల వల్ల సుమారు 2,061 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపు బారిన పడ్డాయి. లంక గ్రామాల్లోని అరటి, తమలపాకు, కూరగాయల పంటలకు సహితం ముప్పు వాటిల్లనుంది. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పర్యటించారు. కోనసీమలోని మలికిపురం, అల్లవరం మండలాల్లో ముంపు తీవ్రతను పరిశీలించిన ఆయన స్థానిక అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment