‘స్మార్ట్’ బాటలో ‘గ్రేటర్’ తీరిదీ..! | 'Smart' positive 'Greater' .. almost! | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’ బాటలో ‘గ్రేటర్’ తీరిదీ..!

Published Wed, Oct 8 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

‘స్మార్ట్’ బాటలో ‘గ్రేటర్’ తీరిదీ..!

‘స్మార్ట్’ బాటలో ‘గ్రేటర్’ తీరిదీ..!

నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే క్రమంలో జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది. దానికి అనుగుణంగా వనరులు, వసతులు ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. కల్పించాలన్న ధ్యాస పాలకులు, యంత్రాంగానికీ లేదు. విశాఖ భవిష్యత్తులో స్మార్ట్ సిటీగా అవతరించబోతోంది. అదే జరిగితే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు భారీగా పెరుగుతాయి. సమస్యలూ అదే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం నగరంలో పారిశుద్ధ్యం, భూగర్భ డ్రయినేజీ వ్యవస్థ, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే తలవంపులు తప్పవు.
 
స్మార్ట్ సిటీ... మోదీ ప్రభుత్వ కలల ప్రపంచం... ఆధునిక హంగులతో ఎన్నో సౌకర్యలను అందించే బృహత్ పథకం. ఆ జాబితాలో విశాఖ కూడా ఉంది. అంతేకాదు అమెరికా ప్రభుత్వం అండతో స్మార్ట్ సిటీలుగా వెలుగొందనున్న దేశంలోని మూడు నగరాల్లో మన నగరం కూడా ఒకటి. తీయని మాటల మాటున ఎన్నో చేదు వాస్తవాలున్నాయి. ఆసియాలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఎప్పుడో గుర్తించినా ఇక్కడ నెలకొన్న సమస్యలు కోకొల్లలు. స్మార్ట్ సిటీగా ఎదగనున్న నేపథ్యంలో విశాఖ పరిస్థితిపై విహంగ వీక్షణం...
 
విశాఖపట్నం: నగర జనాభా నానాటికీ పెరుగుతోంది. 2001లో మొత్తం జనాభాలో 39.95 శాతంగా ఉన్న పట్టణీకరణ 2011 నాటికి 47.51 శాతానికి చేరుకుంది. 2005లో ప్రారంభించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో దేశ వ్యాప్తంగా రూ.లక్షా 16 వేల కోట్లు వెచ్చించగా.. అందులో జీవీఎంసీకి సుమారు రూ.2 వేల కోట్లు దక్కాయి. రానున్న 20 ఏళ్లలో పట్టణ/నగరాల్లో మౌలిక వసతుల కోసం సుమారు రూ.40 లక్షల కోట్లు అవసరమని ఓ అంచనా. ఇందులో కూడా దాదాపు రూ.8 వేల కోట్ల వరకు నగరానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో 44 శాతం రోడ్ల నిర్మాణానికి, 20 శాతం తాగునీటి సరఫరా, ఘన వ్యర్థ నిర్వహణ, వరద నీటి కాల్వల నిర్మాణం, వీధి దీపాలకు, 14 శాతం నిధులు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు వీలుగా రవాణా సౌకర్యాల మెరుగుకు, 10.5 శాతం నిధులు మురికివాడల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంది.

పరిధి పెరిగింది: భీమిలి, అనకాపల్లి విలీన ప్రతిపాదనలతో నగర విస్తీర్ణం 630 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. నగర జనాభా 18.65 లక్షలకు చేరుకుంది. ఇందుకు అవసరమైన వనరులు మాత్రం పెరిగిన దాఖలాల్లేవు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పేరిట ఏకంగా రూ.2 వేల కోట్లు వరకు వెచ్చించినట్టు చెప్తున్నా.. అందులో సగం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులు నిరుపయోగంగానే మిగిలాయన్న ఆక్షేపణలున్నాయి. ఇందులో తాగునీటి ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి.
 
తాగునీటి దుస్థితి
 
స్మార్ట్ సిటీ నిబంధనల మేరకు నగరవాసికి సగటున రోజుకు 145 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. రోజంతా నీరివ్వాలి. ప్రస్తుతం తాగునీరు కనీసం గంటపాటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. శుద్ధి చేసిన నీరు రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)కు మించి ఇవ్వలేని దుస్థితి. డిమాండ్‌కు సరఫరాకు మధ్య సుమారు 25 ఎంజీడీల వ్యత్యాసం ఉంది. పోలవరం నీటిపై ఆశలు పెట్టుకుంటున్నా.. జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచే చర్యలు మాత్రం జరగట్లేదు. ఇప్పటికే 20 శాతం జనావాసాలకు నీటి సరఫరానిచ్చే పైపులైన్లు లేవు.
 
పారిశుద్ధ్యం పరేషాన్
 
నగరంలో ప్రస్తుతం రోజూ 880 మెట్రిక్ టన్నుల మేరకు చెత్త బయటికొస్తోంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిబంధనల మేరకు ఘన వ్యర్థ నిర్వహణ(ఎస్‌డబ్ల్యూఎం) శతశాతం జరగాలి. బయటికొచ్చే చెత్తంతా రీ సైకిల్/రీ యూజ్ కావాల్సిందే. అయితే జీవీఎంసీలో మాత్రం ఇప్పటికీ 70-80 శాతం వరకు చెత్త డంపింగ్ యార్డులకే తరలుతోంది. తడి-పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు ప్రవేశపెట్టిన ‘విశ్వం’ పథకం కూడా అమల్లో చతికిలపడింది. ఇంటింటా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగక రోడ్లు, కాల్వలు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. దోమలకు ఆవాసాలుగా మారి రోగాలు పెరుగుతున్నాయి.
 
‘భూగర్భ’ నరకం
 
జీవీఎంసీ సెంట్రల్ సిటీలో రూ.244 కోట్లతో దాదాపు 750 కిలోమీటర్ల మేర యూజీడీ పనులు చేపట్టారు. మధురవాడ, వాంబే కాలనీ, పరదేశిపాలెం, అగనంపూడి, దువ్వాడలో కూడా రూ.90 కోట్ల వ్యయం తో 80 కిలోమీటర్ల మేర యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 19 సీవేజ్ బ్లాకుల్లో 14 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 66 శాతం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. మరోవైపు యూజీడీ వ్యవస్థ పూర్తయిన చోట గృహాలను అనుసంధానించే ప్రక్రియ సగం కూడా జరగలేదు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు 63 మిలియన్ లీటర్ల సామర్థ్య మున్నా.. ప్రస్తుతం కేవలం 5 మిలియన్ లీటర్ల మేరకు మాత్రమే వ్యర్థనీటిని శుద్ధి చేయగలుగుతున్నాం. స్మార్ట్ నిబంధనల్లో ఇది శతశాతానికి చేరుకోవాలి.
 
రహ‘దారు’ణమే
 
నిబంధనల మేరకు రోడ్ల విస్తీర్ణం నగర విస్తీర్ణంలో 11 శాతం ఉండాలి. జీవీఎంసీ పరిధిలో ఇది 5 శాతానికి అటూఇటుగానే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో కూడా యూజీడీ, నీటి సరఫరా పైపులైన్ల కోసం రోడ్ల మధ్య తవ్వకాలు చేపట్టడంతో చాలా చోట్ల రోడ్లు గోతులమయంగానే ఉన్నాయి. తాజాగా రోడ్లు నిర్మిస్తున్నా.. మధ్యలో కుంగిపోతున్నాయి. బీఆర్‌టీఎస్ కారిడార్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎంతో కొంత ట్రాఫిక్ ఇక్కట్లు తీరతాయన్న ఆశ. రూ.5 వేల కోట్లతో ప్రతిపాదించిన మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులోకి వస్తే మరింత మేలు జరగనుంది.
 
కాలుష్య కాసారం
 
స్మార్ట్ సిటీ లక్షణాల్లో ప్రధానమైనది పర్యావరణానుకూల అభివృద్ధి. దేశంలోనే అత్యంత కాలుష్య కారక నగరాల్లో తిరువనంతపురం తర్వాత విశాఖే ముందంజలో ఉంది. ఇక్కడ సుమారు 15 పరిశ్రమలు అత్యంత కాలుష్యకారకమైనవి ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. సీఈపీఐ పాయింట్లు 73 నుంచి 60 తగ్గిందన్న కారణంతో కేంద్ర పర్యావరణ శాఖ పరిశ్రమల ఏర్పాటుపై అప్పటి వరకు ఉన్న మారటోరియాన్ని ఎత్తేసింది. అయితే ఇస్రో మాత్రం శాటిలైట్ చిత్రాల ఆధారంగా నగరంలో 70.82 పాయింట్లు వరకు కాలుష్యం ఉన్నట్టు వెల్లడించింది. గత కొన్నేళ్లలో కాలుష్య కోరల్లో చిక్కి 44 మంది మరణించారు. ఇందులో పది మంది చిన్న పిల్లలు ట్యూబరిక్యులోసిస్ బారిన పడి మరణించినవారే.
 
ఉపాధి అంతంతే
 
జీవీఎంసీలో ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవు. సెజ్‌లలో ఏర్పాటైన పరిశ్రమలు కూడా తాము పేర్కొన్న సంఖ్యలో పదో వంతు మందికి కూడా ఉపాధి కల్పించలేకపోయాయి. తమకు అవసరమైన నైపుణ్యాల్లేవన్న సాకుతో పొరుగు రాష్ట్రాల వారినే నియమించుకుంటున్నాయి. రాజీవ్ యువ కిరణాల్లో భాగంగా రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహణ సంస్థల దోపిడీకి మార్గాలుగా మాత్రమే మిగిలాయన్న ఆక్షేపణలున్నాయి. స్మార్ట్ సిటీలో భాగంగా ఇండస్ట్రియల్, ఐటీ, బీటీ పార్కులు, ఎక్స్‌పోర్టు ప్రాసెసింగ్ జోన్లు, సర్వీస్, లాజిస్టిక్స్ హబ్స్, వేర్ హౌసింగ్ అండ్ నౌకా రవాణా టెర్మినల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటైతే ఈ దుస్థితి తగ్గనుంది.
 
ఇ-పాలనలో ముందడుగు
 
ఇ-గవర్నెన్స్‌లో జీవీఎంసీ మున్ముందుకెళ్తోంది. ఆన్‌లైన్ సేవలందించడంలో చాలా కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఐవీఆర్‌ఎస్ విధానం, ఆన్‌లైన్ ఫిర్యాదుల స్వీకరణ, ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్‌లైనీకరణ తదితర సేవల్లో పలు అవార్డులు కూడా గెల్చుకుంది. స్మార్ట్ సిటీలో సాంకేతికతను అందుకోవడంలో అనుమానాల్లేవు. ఇప్పటికే రిలయన్స్ సంస్థ తమ 4 జి నెట్‌వర్క్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
 
పారిశుద్ధ్యం పరేషాన్
 
నగరంలో లక్షా 30 వేలమంది సొంతింటి కోసం జీవీఎంసీకి దరఖాస్తు పెట్టుకున్నారు. పట్టణ పేదల గృహ నిర్మాణానికి రాజీవ్ ఆవాస యోజన(రే) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఐదారేళ్లుగా దీనిపై ఎప్పుడూ జీవీఎంసీ బడ్జెట్లో ప్రతిపాదనలే మినహా అమలుకు నోచుకున్న దాఖలాల్లేవు. తొలి దశలో 117 మురికివాడల అభివృద్ధికి రూ.260 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఐదేళ్లలో 741 మురికివాడలను రూ.2796 కోట్లతో అభివృద్ధి చేయడానికి లక్ష్య నిర్దేశనం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతిపాదించిన సూర్యతేజ నగర్‌కు కూడా ఈ మధ్యనే పాలనానుమతులిచ్చారు. రే పథకం నిబంధనల మార్పుల కోసం కేంద్రం చేస్తున్న కసరత్తు ఎప్పటికి పూర్తయ్యేనో..!
 
‘గ్రేటర్’ మురికి
 
దేశంలోనే అత్యధిక మురికివాడలున్న నగరంగా విశాఖ అపఖ్యా తి మూటగట్టుకుంది. నగరంలో 741 మురికివాడలున్నాయి. లక్షా 87 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 8.21 లక్షల మంది ఇక్కడ నివాసమున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 2011 లెక్కల ప్రకారం నగర జనాభా సుమారు 18.65 లక్షల మంది. కుటుంబాలు దాదాపు 3.31 లక్షలున్నాయి. దీంతో కుటుంబాల్లో 56.50 శాతం, జనాభాలో సుమారు 45 శాతం మంది మురికివాడల్లోనే నివసిస్తున్నారు. అధికారులు మాత్రం 30 శాతానికి మించి నగర జనాభా మురికివాడల్లో ఉండే అవకాశం లేదంటున్నారు.
 
ఎన్‌యూహెచ్‌ఎంతోనే ఆరోగ్యం
 
మురికివాడల్లోని జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన డిస్పెన్సరీలు కూడా ఆ స్థాయిలో లేవు. 15 మంది వైద్యులు, 18 మంది ఏఎన్‌ఎంలతో 15 డిస్పెన్సరీలున్నాయి. కనీసం మరో పది వరకు డిస్పెన్సరీల అవసరం ఉంది. జాతీయ పట్టణ ఆరోగ్య పథకం(ఎన్‌యూహెచ్‌ఎం)తో ఈ దుస్థితి మారనుంది. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్రం 25 శాతం నిధులు కేటాయించనుంది. ఈ పథకంలో జీవీఎంసీ ఇప్పటికే ఎంపికయింది. మురికివాడలకు అర కిలోమీటర్ దూరంలో అన్ని వసతులతో ఆరోగ్య కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు.
 
ఇ-పాలనలో ముందడుగు
 
ఇ-గవర్నెన్స్‌లో జీవీఎంసీ మున్ముందుకెళ్తోంది. ఆన్‌లైన్ సేవలందించడంలో చాలా కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఐవీఆర్‌ఎస్ విధానం, ఆన్‌లైన్ ఫిర్యాదుల స్వీకరణ, ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్‌లైనీకరణ తదితర సేవల్లో పలు అవార్డులు కూడా గెల్చుకుంది. స్మార్ట్ సిటీలో సాంకేతికతను అందుకోవడంలో అనుమానాల్లేవు. ఇప్పటికే రిలయన్స్ సంస్థ తమ 4 జి నెట్‌వర్క్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement