రాయవరం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధిలో ప్రజ ల భాగస్వామ్యం ఉండాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల పదవీకాలం ముగిసి నెల రోజులపైనే గడిచింది. తిరిగి కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఇప్పట్లో ఈ కమిటీలకు ఎన్నికలు నిర్వహించి బలోపేతం చేస్తారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది.
టీడీపీ హయాంలోనే 14 ఏళ్ల క్రితం విద్యా కమిటీల పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. తదనంతరం విద్యాకమిటీల పేరును పాఠశాల యాజమాన్య కమిటీలుగా మార్పు చేశారు. ఈ కమిటీలు పాఠశాల నిర్వహణకు దోహదపడాలన్నది ప్రభుత్వ ఆశయం. చివరిసారి ఎన్నికైన కమిటీల పదవీ కాలం గత జూన్ 29తో ముగిసింది. అప్పటి నంచి ఎస్‌ఎంసీలకు ఎంఈఓలే చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ కె.సంధ్యారాణి ఆదేశాలు విడుదల చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంత వరకు విద్యాశాఖ అటు వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో పాఠశాలలను గాలికొదిలేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎస్‌ఎంసీలు ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందనే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది.
4,217 పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు..
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 2013 జూన్ 29న ఎస్‌ఎంసీలను ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలలో ఒక్కో తరగతి నుంచి ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేసి తిరిగి వారి నుంచి చైర్మన్‌ను, వైస్ చైర్మన్‌ను చేతులెత్తి ఆమోదించే విధానంలో ఎంపిక చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటయ్యే ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌కు ప్రధానోపాధ్యాయులతో కలసి చెక్ పవర్‌ను కల్పించారు. ఎస్‌ఎంసీల పదవీకాలం ముగిసిన తర్వాత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, పాఠశాల హెచ్‌ఎం సభ్యులుగా, ఎంఈవో చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాఠశాల నిధులను హెచ్‌ఎం, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ కలిసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అజమాయిషీ మాత్రం ఎంఈవో చేస్తారు.
ఎస్‌ఎంసీల బాధ్యతలివీ..
యాజమాన్య కమిటీలకు పాఠశాల నిర్వహణలో కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. పాఠశాలకు మంజూరయ్యే పలు రకాల అభివృద్ధి నిధుల ఖర్చు వీటి పర్యవేక్షణలోనే జరగాలి. నూతన భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను ఇవి నిర్వహిస్తాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల స్థాయిలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యార్థులు శతశాతం హాజరయ్యే విధంగా చూడాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందేలా చూడడం క మిటీల ప్రధాన బాధ్యత.
విద్యార్థులు మధ్యలో బడి మానకుండా చూడడం, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం, పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం, ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం నుంచి అందే నిధులను సక్రమంగా వినియోగించేలా చూడడం కమిటీల బాధ్యతే. పాఠశాలల్లో మౌలిక సదుపాయూల కల్పన, పర్యవేక్షణ, విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్రపై పర్యవేక్షణ కూడా ఈ కమిటీల పరిధిలో ఉంది. మొత్తం మీద పాఠశాల నిర్వహణపై పూర్తి బాధ్యతలు ఎస్‌ఎంసీలకు ఉంటాయి. రెండు నెలలకోసారి పాఠశాల యాజమాన్య కమిటీలు సమావేశమవ్వాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు తమకు చూపమని ఉపాధ్యాయులను అడిగే అధికారం యాజమాన్య కమిటీ సభ్యులకు ఉంటుంది.
ఉత్తర్వులు రాలేదు..
పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం పూర్తయ్యాక ఎంఈవోలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తిరిగి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు.
- పట్నాల ముక్తేశ్వరరావు, ఎంఈవో, రాయవరం
ఎస్‌ఎంసీలకు ఎన్నికలు ఎన్నడు?
Published Thu, Aug 13 2015 2:01 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement