చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ప్రారంభించిన ఆపరేషన్ రెడ్‌లో మరో అంతర్జాతీయ స్మగ్లర్ చిక్కాడు. బెంగళూరుకు చెందిన హజీ నాజర్(48) అలియాస్ నాసీర్ ఉల్లా ఖాస్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, సీఐ చంద్రశేఖర్‌లు వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని ఓల్డ్ పెన్షస్ మొహల్లాకు చెందిన హజీ నాజర్ 2014 నుంచి ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్నాడు.
కొద్ది కాలంలోనే ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్‌లో డాన్‌గా ఎదిగాడు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న అనుభవం ఇతడిని స్మగ్లింగ్‌లో విదేశాల వైపు వెళ్లేలా చేసింది. మూడేళ్ల కాలంలో జిల్లా నుంచి వెయ్యి టన్నుల ఎర్రచందనాన్ని మలేషియా, దుబాయ్‌లకు ఎగుమతి చేశాడు. ఇతను జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. మూడేళ్ల కాలంలో జిల్లాలోని కల్లూరు, కార్వేటినగరం, ఎర్రావారిపాలెం, చిత్తూరు, మదనపల్లె, రొంపిచెర్ల, ఎన్‌ఆర్.పేట, బంగారుపాళ్యం తదితర పోలీస్ స్టేషన్లలో ఇతనిపై 20 వరకు కేసులు నమోదయ్యాయి.
జిల్లాలోని న్యాయస్థానాలు ఇతడిపై అయిదు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేశాయి. నాజర్ బెంగుళూరులో ఉన్నాడనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని చిత్తూరులో పట్టుకున్నారు. నాజర్ నుంచి ఐకాన్ కారు, నాలుగు ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పాకాల సీఐ చల్లనిదొర, తాలూక ఎస్‌ఐ కళా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మోస్ట్ వాంటెడ్ ‘ఎర్ర’ స్మగ్లర్ నాజర్ అరెస్ట్
Published Mon, Jul 3 2017 9:54 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement