స్మగ్లర్లపై ఉక్కుపాదం
రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక ఎర్రచందనం పార్కులో రాజంపేట, తిరుపతి డివిజన ఫారెస్టు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ రాజంపేట డివిజన్ ఫారెస్టు వైఎస్సార్ జిల్లా పరిధిలోకి వస్తుందని, బాలుపల్లె ఫారెస్టు డివిజన్ చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు.
దీంతో కొంత సమన్వయ లోపం ఉందన్నారు. ఇకపై సమన్వయంతో పనిచేసి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద సీసీ కెమెరాలు అమర్చుతామన్నారు. ఇకపై ప్రతి చెక్ పోస్టు పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కోడూరులో తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ప్రవర్తించిన తీరుపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశానికి రాజంపేట డీఎస్పీ జీవీ రమణ, స్క్వాడ్ డీఎఫ్‌ఓ పవన్ కుమార్, తిరుపతి డీఎఫ్‌ఓ నాగరాజు, రాజంపేట డీఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి, ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు.