
మంచు వేసవి
కర్నూలు(అగ్రికల్చర్): విపరీతమైన ఉక్క.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే భయం.. అలాగని ఇది ఎండాకాలం కాదు. మంచు కురిసే మాసంలో మండుతున్న ఎండాకాలమిది. వాతావరణంలో విచిత్ర పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా ముందే వేసవి వచ్చేసినట్లు ఉంది. రోజు రోజూ పెరుగుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు ఎండ వేడిమికి తాళలేక అస్వస్థతకు గురవుతున్నారు.
సాధారణంగా అక్టోబరు నెలకు వాతావరణం పూర్తిగా చల్లబడాలి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల లోపు మాత్రమే ఉండాలి. అయితే ఈ ఏడాది ఇవి 37 డిగ్రీలు దాటి పోతున్నాయి. రాత్రి పూట మంచు కురవాల్సిన సమయం ఇది. ఉదయం 9 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి చలి గాలులు వీచాల్సిన అక్టోబర్ నెలలో ఉదయం 7 గంటలకే సూర్యుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు నామమాత్రంగా కురిశాయి.
నైరుతి రుతుపవనాలు సైతం వెనక్కి పోవడం, గాలిలో తేమ శాతం తగ్గడంతో ఎండల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయంలో చెరువులు, కుంటలు నీటితో నిండి కళకళలాడుతూ ఉండాలి. వాగులు, వంకలు ప్రవహిస్తూ ఉండాలి. అడవులు, బీడు, బంజరు భూములు, కొండలు పచ్చితో పచ్చదనాన్ని సంతరించుకోవాలి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో పచ్చదనం జాడ కరువైంది. ఇదీ కూడా ఎండల తీవ్రత పెరగడానికి కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉక్కపోతతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఫలితంగా అప్రకటిత కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎండల తీవ్రతకు భూముల్లో ఉన్న అంతంత మాత్రం ఉన్న తేమ హరించుకుపోయి పంటలు వేగంగా ఎండిపోతున్నాయి. రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. భవిష్యత్‌లో పశు గ్రాసానికి తీవ్ర సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఎండవేడిమికి తాళలేక కొబ్బరి బోండాలు, శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. మంచి నీటి సమస్య పెరుగుతోంది.
గతేడాది అక్టోబరు నెలతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి..
తేదీ గతేడాది ఈ ఏడాది
01 32.5 35.5
02 32.4 36.3
03 30.1 ----
04 33.4 36.3
05 32.6 36.9
06 30.0 35.8
07 34.1 37.0