ప్రైవేట్ పంచాయతీ చేసుకోమని ఆదేశం
పెనమలూరు సీఐ తీరుపై సీపీ ఆగ్రహం
కేసు నమోదుకు ఆదేశం అదుపులో నిందితులు
విజయవాడ సిటీ: బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ప్రైవేటు వ్యక్తులను కలవమని చెబితే..ఇక బాధితులకు దిక్కెవరు. ఓ భూ వివాదంలో పెనమలూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వైద్యుడికి ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీ చేసుకోమంటూ స్టేషన్ అధికారి పురమాయించారు. ఇది నచ్చని బాధిత వైద్యుడు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను ఆశ్రయించడంతో పోలీసు అధికారి ప్రైవేటు పంచాయితీ వ్యవహారం వెలుగులోకి వచ్చి ంది. సీపీ ఆదేశాల మేరకు ఎట్టకేలకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. ప్రైవేటు వ్యక్తులను మధ్యవర్తులుగా పెట్టుకొని దందా నిర్వహిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై పెనమలూరు ఇన్‌స్పెక్టర్ జగన్మోహన్‌పై సీపీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
ఇదీ జరిగింది
గుంటూరుకు చెందిన డాక్టర్ రావుకు కానూరు గ్రామ పరిధిలో 470 చదరపు గజాల చొప్పున రెండు ప్లాట్లు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు నిర్ణయించిన డాక్టర్ రావు తెలిసిన వ్యక్తులకు చెప్పాడు. ఇది తెలిసిన డాక్యుమెంట్ రైటర్ రమణ, బిల్డర్‌గా చెప్పుకుంటున్న దుర్గాప్రసాద్ గుంటూరు వెళ్లి తాము కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ముందుగా కొంత నగదు అడ్వాన్సుగా ఇస్తామని, మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పారు. దీనికి ససేమిరా అన్న డాక్టర్ రావు రిజిస్ట్రేషన్ సమయంలోనే మొత్తం ఇవ్వాలంటూ చెప్పగా వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత మరో వ్యక్తి ఆ ప్లాట్లు కొనుగోలుకు వెళ్లాడు. ఇదే సమయంలో డాక్యుమెంట్ రైటర్ రమణ తాము ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు పత్రికా ప్రకటన చేయడంతో పాటు కొనుగోలుకు ముందుకు వచ్చిన వ్యక్తికి విషయం చెప్పాడు. ఆపై డాక్టర్ రావు వద్దకు వెళ్లి ఆ ప్లాట్లు తమకే అమ్మాలని, లేని పక్షంలో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు. చివరకు రూ.35వేలు బెదిరించి తీసుకొని వెళ్లాడు. జరిగిన విషయాన్ని తన మిత్రుడైన న్యాయవాది సాయంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు కట్టి నిందితులను అరెస్టు చేయాల్సిన పెనమలూరు ఇన్‌స్పెక్టర్ జగన్మోహన్ వివాదం పరిష్కరించాలంటూ కరణంగా చెప్పుకునే నాగేశ్వరరావు అనే వ్యక్తిని పురమాయించారు. దీంతో నాగేశ్వరరావు వెళ్లి వివాదాన్ని బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయంలో కూర్చొని పరిష్కరించుకుందామంటూ చెప్పాడు. తన ప్లాట్లపై లేని వివాదాలు సృష్టించడంతో పాటు రాజీ కోసం మధ్యవర్తులు రావడంపై మనస్థాపం చెందిన గుంటూరు వైద్యుడు హితుల సలహా మేరకు సీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ విచారణకు ఆయన ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు విషయంపై ఆరా తీసి కేసు నమోదు చేయకపోవడంపై ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించగా పొంతనలేని కారణాలు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు కేసు నమోదుకు ఆదేశించడంతో విధిలేని స్థితిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు వెళ్లిన సీఐ
గుట్టుచప్పుడు కాకుండా సెటిల్మెంట్‌కు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో బాధిత డాక్టర్‌ను మచ్చిక చేసుకునేందుకు సీఐ జగన్మోహన్ సోమవారం ఉదయం గుంటూరు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ డాక్టర్ రావు మాట్లాడేందుకు నిరాకరించడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి తిరిగి నగరానికి చేరుకున్న ఆయన సాయంత్రం కూడా స్టేషన్‌కి రాకుండా ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని దందాలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు కూడా వ్యవహారశైలిని తప్పుపట్టినట్లు తెలిసింది.
సెటిల్‌మెంట్ సో బెటర్ బాస్
Published Tue, Sep 1 2015 1:29 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement