నాలుగేళ్ల చిన్నారి అనూషకు అమ్మే ప్రపంచం.
నాలుగేళ్ల చిన్నారి అనూషకు అమ్మే ప్రపంచం. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం (బధిర)తో బాధపడుతున్న చిన్నారి సైగల ద్వారా వెల్లడించే అభిప్రాయాలు అమ్మ సునీతకు మాత్రమే అర్థమవుతాయి. క్షణం కూడా అమ్మను విడిచి ఉండలేని చిన్నారి ఇప్పుడు ఆమె లేకుండా క్షణమొక యుగంగా రెండు రోజులుగా గడుపుతోంది. సునీత ఎక్కడున్నా రావాలని చిన్నారి బంధువులు కోరుతున్నారు.
నగరంలోని సుజాతమ్మ కాలనీలోని కృష్ణారెసిడెన్సీలో ఈగ అంకయ్య, సునీత దంపతులు కాపురం ఉంటున్నారు. కావలికి చెందిన అంకయ్య నగరానికి చెందిన సునీతను వివాహమాడారు. అతను నగర రిజిస్ట్రార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. అంకయ్య దంపతులకు నాలుగేళ్ల కిందట అనూష పుట్టింది. పుట్టకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతోంది. పలుచోట్ల వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో ఇంట్లోనే అమ్మ సునీత చిన్నారి ఆలనాపాలనా చూస్తోంది. కొంతకాలంగా సునీత మానసిక స్థితి కూడా సరిగా ఉండటం లేదని తెలిసింది. దీంతో బిడ్డతో పాటు తనకు ఎవరో చేతబడి చేసి చంపేందుకు యత్నిస్తున్నారని పలువురి వద్ద తన ఆవేదనను వెల్లడించేది. ఎవరినీ ఇంటి వద్దకు రానిచ్చేది కాదు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చిన్నారితో కలిసి అంకయ్య, సునీత అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లినట్టు అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదు కాని చిన్నారి అనూష ఏడుస్తూ బృందావనంలోని చాణుక్యలాడ్జి ఎదురుగా ఉన్న మురళీకేఫ్‌లో ప్రత్యక్షమైంది. కేఫ్ నిర్వాహకులు తల్లిదండ్రుల కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో మూడో నగర పోలీసులకు సమాచారం అందించారు. మూడో నగర పోలీసులు చిన్నారిని సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత వియానీహోమ్‌కు చిన్నారిని తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న చిన్నారి అమ్మమ్మ, పిన్ని, పెద్దమ్మ పాప వివరాలు తెలియజేసి తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఆ చిన్నారి అమ్మ ఆత్మీయత కోసం అలమటిస్తోంది. తల్లి ఒడిలో ఎప్పుడెప్పుడు ఆట్లాడుకుందామా అని ఎదురు చూస్తోంది. ఆ అమ్మ ఎక్కడుందో?ఎలా ఉందో? మరి.
తండ్రి ఆత్మహత్యాయత్నం
బుధవారం అర్ధరాత్రి అంకయ్య తన సమీప బంధువు జగన్‌కు ఫోన్ చేసి తాను కనుపర్తిపాడు క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. జగన్ వెంటనే స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న అంకయ్యను ప్రైవేట్ ప్రజావైద్యశాలకు తరలించారు. కొంచెం కోలుకున్న తర్వాత సునీత ఎక్కడ అని ప్రశ్నించగా ఇంట్లోనే ఉందని చెప్పడం తప్ప మరే వివరాలు తెలియజేయలేకున్నాడు.
మార్చురీలో మహిళ మృతదేహం ఎవరిది?
కొండాయపాళెం వద్ద మహిళ ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న సునీత బంధువులు వివరాలు ఆరా తీశారు. జీఆర్‌పీఎఫ్ పోలీసులను సంప్రదించి మృతదేహం ఫొటోలను చూశారు. గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో డ్రస్సు, ఇతర ఆనవాళ్లను పరిశీలించారు. మార్చురీకి తరలించిన మృతదేహాన్ని శుక్రవారం వారు పరిశీలించనున్నారు. ఇంతకూ మార్చురీలో మహిళ మృతదేహం ఎవరిదన్న విషయమై ఉత్కంఠ, ఆందోళన నెలకొంది.