ఉద్యోగి లేకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీ
అనంతపురం ఎడ్యుకేషన్ : అది పెన్నార్ భవనంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాలయం. కలెక్టర్ కార్యాలయానికి అడుగుల దూరంలోనే ఉంటుంది. అయినా ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సమయపాలన ఉండదు. ఎవరు ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలీని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీలు నిత్యం వివిధ పనుల మీద ఈ కార్యాలయానికి వస్తుంటారు. సంక్షేమ పథకాలు, కులాంతర వివాహాలు, స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, హాస్టళ్లలో పని చేస్తున్న ఉద్యోగులు ఇలా రోజూ వందలాది మంది వస్తుంటారు. ఇక్కడ ఉప సంచాలకలతో పాటు జిల్లా అధికారి, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఒకరు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు ముగ్గురు, డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ ఒకరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకరు, అండెండర్లు నలుగురు, వాచ్‌మన్ ఒకరు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఒకరు పని చేస్తున్నారు. వీరిలో కొందరు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఓ ఉన్నతాధికారి అండ చూసుకుని అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉన్నా...కొందరు ఉద్యోగులు రోజూ 12 గంటలకు తర్వాత వచ్చిన సందర్భాలూ చాలా ఉన్నాయంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. వచ్చిన తర్వాత కూడా వారి సీట్లలో కూర్చుని పనులు చేసేది తక్కువని, తరచూ బయటకు వెళ్తూ గడిపేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని తోటి ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు తరచూ బయటకు వెళ్లడం, ఆలస్యంగా రావడం వల్ల చాలా ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్ పడుతున్నాయంటూ పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులంతా సమయపాలన పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై వివరణ కోరేందుకు డీడీ రోశన్న, జిల్లా అధికారి లక్ష్మానాయక్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఇద్దరూ అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment