Dalit students
-
దారుణం: ఒక్క పదం తప్పు రాశాడని చితకబాదిన టీచర్...విద్యార్థి మృతి
లక్నో: పరీక్షలో ఒకే ఒక్కపదం తప్పురాసినందుకు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌరియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథన ప్రకారం నిఖిత్ దోహ్రే అనే దళిత బాలుడు స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సెప్టంబర్ 7న సోషల్ ఎగ్జామ్‌లో ఒక పదం తప్పురాశాడని ఉపాధ్యాయుడు అశ్విన్ సింగ్ కర్రలు, రాడ్ తోటి అత్యంత హేయంగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పిపోయాడు. తల్లిదండ్రులు ఇటావా జిల్లాలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ...ఆ విద్యార్థి మృతి చెందాడు. అదీగాక సదరు ఉపాధ్యాయుడు బాధితుడి తండ్రికి చికిత్స నిమిత్తం డబ్బులు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాదు ఆ బాలుడిని కులం పేరుతో దూషిస్తూ.. కొట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి నిగమ్ తెలిపారు. నిందితుడు ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: భర్తను చితకబాది..భార్యపై ఆరుగురు గ్యాంగ్ రేప్) -
విద్యార్థులు బలిపశువులు కారాదు!
సాంకేతిక సమస్య కారణంగా గడువుతేదీ లోపు ఫీజు చెల్లించలేకపోయిన ఒక దళిత విద్యార్థికి తప్పకుండా సీటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దంటూ సుప్రీంకోర్టు అసాధారణ వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యార్థి భవిష్యత్తు విషయంలో శిలాసదృశంగా ఉండొద్దని, కాస్త మానవీయ దృష్టితో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం హితవు చెప్పింది. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం నుంచి కోర్సు ముగింపు వరకు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొం టున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఈ తీర్పు ఒక ఆశా కిరణమై నిలిచింది. ఉన్నత విద్యను ఆశించి, అష్టకష్టాలు పడి సీటు సాధించి, ఉద్యోగ జీవితంలో కూడా వివక్ష పాలవుతున్న వెనుకబడిన వర్గాల పిల్లలకు... ప్రిన్స్, అతడి తండ్రి సాగించిన పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం అవుతుంది. పద్దెనిమిదేళ్ల దళిత కుర్రాడు ప్రిన్స్ జైబీర్ సింగ్‌కి 48 గంటలలోపు బాంబే ఐఐటీలో ప్రవేశం కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిష్ఠా త్మక ఐఐటీలో చేరడానికి ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ విద్యార్థి గడువుతేదీ లోగా ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతడికి ప్రవేశార్హత లేదని అధికారులు ప్రకటించారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సాంకేతిక తప్పిదానికి ఆ కుర్రాడి భవిష్యత్తు పట్ల అమానవీయ దృష్టితో వ్యవహరించడం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ సమస్య మానవీయ కోణానికి సంబంధించింది కాబట్టి నియమనిబంధనలను శిలాసదృశంగా పాటించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించడం చెడు పరిణామాలకు దారి తీస్తుందని బాంబే ఐఐటీ అధికారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని తప్పుకు ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దని, ఒక యువకుడి భావి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో వీలైనంత సహాయం చేసి అతడికి మేలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భారత పీడిత ప్రజానీకంలో మన న్యాయవ్యవస్థ కాస్త ఆశలు నిలిపినట్లయింది. ఐఐటీ బాంబేలో తన స్థానంకోసం ప్రిన్స్ అనే పేరున్న ఈ దళిత కుర్రాడు చేసిన పోరాటం కానీ, ఈ క్రమంలో తాను సాధించిన విజయం కానీ సాధారణమైంది కాదు. ఇది ఇజ్రాయెల్ జానపద గాథల్లో గోలియెత్ని ఓడించిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన డేవిడ్‌ను తలపించింది. ఒక దళిత కుర్రాడు అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రిన్స్ అనే పేరు పెట్టుకోవడం అసాధారణమే అని చెప్పాలి. ప్రిన్స్ అంటే ఇంగ్లిష్‌లో ‘ఎదుగుతున్న పాలకుడు’ అని అర్థం. అన్యాయానికి మూలం ఇదా? బాంబే ఐఐటీకి చెందిన జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీలోని అధికారులు ప్రిన్స్ అనే పేరు కల ఈ కుర్రాడి దళిత మూలాలను అనుమానించి ఉండవచ్చు. కానీ నిర్దేశించిన సమయంలోనే ఈ కుర్రాడి సోదరి ఐఐటీ పోర్టల్‌లో అవసరమైన అన్ని పత్రాలనూ అప్లోడ్ చేసిన తర్వాత పీజు కట్టడానికి ప్రయత్నించింది. కానీ వెబ్సైట్ పనిచేయ లేదు. దాంతో ప్రిన్స్ స్వయంగా మరోసారి ప్రయత్నించగా మళ్లీ అతడి ప్రయత్నం తిరస్కరణకు గురైంది. మన సంస్థాగత పునాదిలో ఆన్లైన్ అడ్మిషన్లను కూడా పక్షపాత దృష్టితో వేధించడానికి ఉపయోగిస్తారన్నది తెలిసిందే. భారతదేశంలో చివరకు ఇంటర్నెట్ కూడా దళిత వ్యతిరేక పాశుపతాస్త్రంగా మారిపోవడం విచారకరం. ఆ కుర్రాడు, ఉమ్మడి సీట్ కేటాయింపు విభాగం పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ లోని ఐఐటీ ఖర్గపూర్కి సాధారణ కానిస్టేబుల్ అయిన తండ్రితో కలిసి వెళ్ళాడు. ఫీజు కడతానని చెప్పినా అతడిని చేర్చుకోవడానికి అధికారులు తిరస్కరించారు. గడువుతేదీ ముగిసిందని కారణం చెప్పారు. దీంతో అతడు బాంబే హైకోర్టు తలుపులు తట్టాడు. అక్కడా అతడి పిటిషన్‌ని కొట్టేశారు. చివరకు అతడు సుప్రీకోర్టుకు వెళ్లాడు. ఆ కుర్రాడిని ఐఐటీలో చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వై.డి. చంద్రచూడ్, ఏఎస్ బోపన్న సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దళిత కానిస్టేబుల్ కుమారుడు అనేక స్థాయిల్లో పోరాటం సల్పి చిట్టచివరకు ఐఐటీ బాంబేలో చేరగలగడం ఆధునిక ఏకలవ్య గాథను తలపిస్తుంది. సమర్థుడైన విలుకాడు అయినందుకు తన బొటనవేలును కోల్పోవలసి వచ్చిన ఏకలవ్యుడు శస్త్రచికిత్స సహా యంతో తిరిగి తన బొటనవేలును పొందగలిగాడు. ఇప్పుడు ఈ దళిత కుర్రాడు ప్రిన్స్, ఐఐటీ సీటు కోసం పడిన తపనకు సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా ఘర్షిస్తూ, అంతిమంగా సీట్లు చేజిక్కించుకుంటున్న, రిజర్వేషన్ హక్కు కలిగిన యువత పడుతున్న తపనలో, ఘర్షణలో ఇది ఒంటరి ఘటన కాదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్‌లో జనరల్ కేట గిరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఓబీసీలకు చెందిన యువకుడు విపిన్ పి. వీటిల్.. మద్రాస్ ఐఐటీ నుంచి వివిధరకాల వివక్షల పాలబడి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్యాకల్టీ అతడి కులనేపథ్యాన్ని కనిపెట్టి, అవమానించడం, వేధించడం మొదలెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని అధికారులకు విపిన్ రాసిన ఉత్తరాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వం ఎంతగా పేరుకుపోయిందో స్పష్టం చేశాయి. ప్రస్తుత సందర్భానికి వస్తే మన దళిత ప్రిన్స్ ప్రవేశం కోసం చేసిన పోరాటంతోనే రిజర్వుడ్ అభ్యర్థుల పోరాటం ముగిసిపోలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో చేరడం ఒకెత్తు కాగా, వీటిలో చదువు కొనసాగించడం మరొక ఎత్తు. వీరు క్యాంపస్‌లలోనే ఉంటున్నందువల్ల వివక్ష ఈ సంస్థల్లో ఒక నిరంతర సమస్యగా ఉంటుంది. ఇలా చెబితే అతిశయోక్తి కావచ్చు. ఆరెస్సెస్ శక్తులు మైనారిటీలను భారతీయేతరులుగా వ్యవహరిస్తున్నట్లుగా... దళితులు, ఓబీసీలు, గిరిజనుల పిల్లలను ఘనత వహించిన మన ఐఐటీలు భారతీయేతరులుగా చూస్తున్నాయి. ఈ విద్యా సంస్థలనుంచి రిజర్వేషన్లను తొలగించాలని వీరు అనేకసార్లు విద్యామంత్రికి పలు ఉత్తరాలు రాశారు. కానీ వారనుకున్నది జరిగితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కంటే మించిన పెద్ద పోరాటాన్ని దేశం ఎదుర్కోవలిసి వస్తుందని వీరు గ్రహించడం లేదు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం విషయంలో నిరాకరణకు గురైన విద్యార్థులకు ప్రిన్స్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన నా వంటి తొలితరం రిజర్వేషన్ విద్యార్థులకు, ఆపై ప్యాకల్టీగా మారినవారికి... గడువు తేదీలు, చివరి క్షణంలో మార్కుల కోతలు, రిజర్వేషన్ సంఖ్యలు వంటివాటిని ఎలా తారుమారు చేయగలరో స్పష్టంగా తెలుసు. ఒక విద్యార్థిగా చేరి, కోర్సు పూర్తి చేసుకునే తరుణంలో, విద్యార్థులకు ఏ గ్రేడ్ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా వీరు తారుమారు చేయగలరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ జీవితం కూడా వెనుకబడిన వర్గాల యువతకు రోజువారీ పోరాటంగా మారిపోతుంది. ఒక వైపు పోటీపడలేకపోవడం, మరోవైపు మోతాదుకు మించి పోటీపడటం అనేవి రిజర్వేషన్ విద్యార్థులను వెంటాడతాయి. మద్రాస్ ఐఐటీకి చెందిన విపిన్ తాను రెండో కారణం వల్ల వివక్షకు గురయ్యానని చెప్పారు. తన విభాగంలోని దళిత్/ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యుడి కంటే ఎక్కువ సమర్థతను ప్రదర్శించడమే తన పట్ల వివక్షకు కారణమైందట. ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఏకలవ్యుల బొటనవేళ్లను నరికేసే ద్రోణాచార్యులూ ఉన్నారు. అలాగే వీటిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువత జీవిత ప్రక్రియనే నరికేసే ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. గ్రామీణ భారత్ నుంచి తొలి తరం విద్యా నేపథ్యం కలిగిన వారిలో చాలామంది విద్యార్థులు ఇలాంటి వివక్షకు గురైనప్పుడు విద్యాసంస్థలనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ చదువు ముగించి తన కానిస్టేబుల్ తండ్రి కంటే ఉన్నతదశకు ఎదిగితే గొప్ప ఆదర్శంగా మారతాడు. విద్యాసంస్థలను టీచర్ల ద్వారా మాత్రమే సంస్కరించవచ్చు. అయితే ఇలాంటి విద్యాసంస్థల్లోని టీచర్లు ద్రోణాచార్యులను తమ ఆదర్శ గురువులుగా చేసుకున్నంతకాలం, వీరు జాతి మొత్తానికి పెను నష్టం కలిగించగలరు. ఈ విద్యా సంస్థలు గురునానక్ని తమకు ఆదర్శంగా తీసుకుంటే, సాంకేతిక అభివృద్ధిలో చైనానే సవాలు చేసే రీతిలో ఇవి దేశాన్ని మార్చివేయగలవు. ఈ సందర్భంగా ప్రిన్స్, ఆయన తండ్రి మనందరి అభినందనలకు అర్హులు. కంచె ఐలయ్య షెపర్డ్, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఖాళీ సీట్లు.. దళితుల అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : అది పెన్నార్ భవనంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాలయం. కలెక్టర్ కార్యాలయానికి అడుగుల దూరంలోనే ఉంటుంది. అయినా ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సమయపాలన ఉండదు. ఎవరు ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలీని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీలు నిత్యం వివిధ పనుల మీద ఈ కార్యాలయానికి వస్తుంటారు. సంక్షేమ పథకాలు, కులాంతర వివాహాలు, స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు, హాస్టళ్లలో పని చేస్తున్న ఉద్యోగులు ఇలా రోజూ వందలాది మంది వస్తుంటారు. ఇక్కడ ఉప సంచాలకలతో పాటు జిల్లా అధికారి, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఒకరు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు ముగ్గురు, డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ ఒకరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకరు, అండెండర్లు నలుగురు, వాచ్‌మన్ ఒకరు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఒకరు పని చేస్తున్నారు. వీరిలో కొందరు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండ చూసుకుని అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉన్నా...కొందరు ఉద్యోగులు రోజూ 12 గంటలకు తర్వాత వచ్చిన సందర్భాలూ చాలా ఉన్నాయంటూ ఓ ఉద్యోగి వాపోయాడు. వచ్చిన తర్వాత కూడా వారి సీట్లలో కూర్చుని పనులు చేసేది తక్కువని, తరచూ బయటకు వెళ్తూ గడిపేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని తోటి ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు తరచూ బయటకు వెళ్లడం, ఆలస్యంగా రావడం వల్ల చాలా ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్ పడుతున్నాయంటూ పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులంతా సమయపాలన పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై వివరణ కోరేందుకు డీడీ రోశన్న, జిల్లా అధికారి లక్ష్మానాయక్‌ను ఫోన్లో సంప్రదించగా ఇద్దరూ అందుబాటులోకి రాలేదు. -
రోహిత్ మరణానికి ఎవరూ కారణం కాదు
- వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య: అశోక్ - రూపన్‌వాలా కమిషన్ - సూసైడ్నోట్లోనూ అలాగే ఉంది సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు వర్సిటీ అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడి కారణం కాదని అశోక్ రూపన్‌వాలా కమిషన్ పేర్కొంది. వర్సిటీ వీసీ అప్పారావు సహా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రోహిత్ దళితుడు కాదని, వడ్డెర (బీసీ) కులానికి చెందినవాడని నివేదికలో పేర్కొంది. 2016 జనవరిలో హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అలహాబాద్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్‌వాలా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది డిసెంబర్లోనే నివేదిక సమర్పించినా.. మంగళవారం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో ఈ 51 పేజీల రిపోర్టును ఉంచింది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వర్సిటీ వీసీ అప్పారావుల ఒత్తిడే కారణమన్న ఆరోపణలను రూపన్‌వాలా కమిషన్ తోసిపుచ్చింది. వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టంచేసింది. ‘‘యూనివర్సిటీ అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడితో ఈ ఆత్మహత్యకు సంబంధం లేదు. వ్యక్తిగత నిర్ణయంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. రోహిత్ సూసైడ్ నోట్ ప్రకారం.. ఆయన వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది’’అని నివేదికలో పేర్కొన్నారు. దళిత విద్యార్థులు యూనివర్సిటీలో చేరే సమయంలోనే ఈ వివక్షను భరించలేక ఉరేసుకునేందుకు ఒక తాడుని, ఇంత విషం ఇవ్వండి అంటూ 2015 డిసెంబర్ 18న వీసీ అప్పారావుకు రోహిత్ రాశారు. అయితే ఈ లేఖ తన మరణానికి నెల ముందు రాసింది కనుక రోహిత్ ఆత్మహత్యకు అది కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది. అలాగే వర్సిటీలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించినట్లుగా తన దృష్టికి రాలేదని వివరించింది. కమిషన్ పని ఏంటి..? రోహిత్ మరణానికి కారణం ఏంటన్న విషయాన్ని కాకుండా అతడు దళితుడు కాదన్న విషయాన్ని రుజువు చేసే పనిని కమిషన్ నెత్తిన వేసుకుందంటూ అంబేడ్కర్ స్డూడెంట్స్ అసోసియేషన్, సామాజిక న్యాయపోరాట ఐక్య కమిటీ మండిపడింది. వర్సిటీలో రోహిత్ సహా హాస్టల్ నుంచి వెలివేతకు గురైన సామాజిక న్యాయపోరాట కమిటీ నాయకుడు దొంత ప్రశాంత్ కమిషన్ రిపోర్టును దుయ్యబట్టారు. రోహిత్ మరణానికి కారకులైన వీసీ, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావులను తప్పించేందుకే న్యాయసమ్మతం కాని ఈ రిపోర్టు ఇచ్చారని అన్నారు. రోహిత్ కులాన్ని ధ్రువీకరించే అధికారం కమిషన్‌కు లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే దళితేతరుడైన, బీజేపీ అనుకూలురైన అశోక్ రూపన్‌వాలా ఇచ్చిన నివేదికను అంగీకరించేదిలేదు. బీజేపీ సర్కారు తనకు అనుకూలమైన వారితో రిపోర్టు ఇప్పించింది. దీన్ని మేం అంగీకరించం. నేషనల్ ఎస్సీ కమిషన్ ఏనాడో రోహిత్ దళితుడని తేల్చి చెప్పింది. – మున్నా, అంబేడ్కర్ çస్టూడెంట్స్ అసోసియేషన్ కన్వీనర్ నాడే వెల్లడించిన ‘సాక్షి’ రిపోర్టు ఆద్యంతం కులం ప్రస్తావనే అంటూ గతంలోనే ‘సాక్షి’ బయటపెట్టింది. ఇప్పుడు కమిషన్ అదే రిపోర్టు వెల్లడించింది. గతంలో సెంథిల్ కుమార్ ఆత్మహత్య సందర్భంగా నియమించిన పావురాల కమిషన్‌కానీ, కృష్ణ కమిషన్‌గానీ యూనివర్సిటీలో పరిస్థితుల మెరుగు కోసం సూచించిన ఎలాంటి చర్యలూ ఇప్పటికీ వర్సిటీ యాజమాన్యం తీసుకోకపోవడం గమనార్హం. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత
వెలివాడ ఉద్యమకారుల టెంట్లు తీసేయడంపై ఆందోళన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ అగ్గి రాజుకుంది. వర్సిటీలో వెలివాడ వద్ద ఏర్పాటు చేసుకున్న ఉద్యమకారుల టెంట్లు రాత్రికి రాత్రి మాయమవడంపై నిరసన పెల్లుబికింది. టెంట్లకున్న అంబేడ్కర్ నినాదాల పోస్టర్లు, రోహిత్ ఫొటోలనూ తొలగించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్సిటీ గేటు వద్ద బైఠాయించారు. దళిత విద్యార్థులను అణచివేసేందుకు వీసీ అప్పారావు పన్నుతున్న కుయుక్తులే ఇవని ఆరోపించారు. సెక్యూరిటీ సిబ్బంది టెంట్లు తొలగిస్తుండగా కొందరు విద్యార్థులు చూశారని విద్యార్థి జేఏసీ తెలిపింది. సెక్యూరిటీని నిలదీసినప్పటికీ తమకేం తెలియదంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించింది. తమకెలాంటి నోటీసూ ఇవ్వకుండానే టెంట్లు, బ్యానర్లు తొలగించిన వీసీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏదిఏమైనా తమ ఉద్యమం ఆగదని, వీసీపై చర్యలు తీసుకునేవరకూ పోరాడతామని ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులంతా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. కండిషన్ బెయిల్ నుంచి విముక్తి హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు సహా మొత్తం 27 మందికి మార్చి 22న నమోదైన కేసులో కండిషన్ బెయిల్ నుంచి విముక్తి లభించింది. మార్చి 22న విద్యార్థులు, అధ్యాపకులు రత్నం, తథాగత్లతో సహా 27 మంది హెచ్‌సీయూ విద్యార్థులకు ఇచ్చిన కండిషన్ బెయిల్ శుక్రవారంతో ముగిసింది. -
హెచ్‌సీయూలో సంస్కరణలు అవసరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సంస్కరణలు అవసరమని... విద్యార్థుల ప్రవేశాలు మొదలుకొని అధ్యాపకుల నియామకాల వరకు అన్నింటిలో రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయాలని వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ మరియప్పన్ పెరియస్వామి చెప్పారు. ప్రతిష్టాత్మకమైన హెచ్‌సీయూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంపెడాశతో వచ్చిన దళిత, వెనుకబడిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం విషాదకరమని పేర్కొన్నారు. వర్సిటీలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. హెచ్‌సీయూలో కెమిస్ట్రీ విభాగం డీన్ అయిన పెరియస్వామి.. ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వేల ఏళ్లుగా అవమానాలకు, వివక్షకు గురవుతున్న దళిత విద్యార్థులకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని పెరియస్వామి చెప్పారు. హెచ్‌సీయూలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వివక్షకు తావులేకుండా చేయడానికి మీ దగ్గరున్న ప్రణాళిక ఏమిటని ప్రశ్నించగా... అంబేడ్కర్ ప్రసాదించిన రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడమే పరిష్కారమన్నారు. హెచ్‌సీయూలో అన్ని రంగాల్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ప్రవేశాలు మొదలుకొని అధ్యాపకుల నియామకాల వరకు అన్నింటిలో రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పారు. ఇప్పటికే వర్సిటీ ఆ పనిచేస్తున్నా.. మరింత సమర్థవంతంగా అమలు చేయడం అవసరమన్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేస్తాం రోహిత్ బతికుంటే గొప్ప ప్రొఫెసర్ కాగలిగేవాడని పెరియస్వామి చెప్పారు. అంత గొప్పవ్యక్తికి మనమెవరమూ నష్టపరిహారం ఇవ్వలేమని, అతడి కుటుంబానికి న్యాయం చేయగలిగితే చాలని పేర్కొన్నారు. అది కూడా చేయకపోతే సమాజం క్షమించదన్నారు. రోహిత్ తమ్ముడు రాజుకు హెచ్‌సీయూలో ఉద్యోగం కల్పించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వర్సిటీల్లో అడ్మిషన్లు, పరీక్షల విధానం, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పెరియస్వామి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకించి మెంటర్ వ్యవస్థ ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలు జరగడం లేదని, దాన్ని పునరుద్ధరిస్తానని చెప్పారు. వర్సిటీకి వచ్చేవారిలో అత్యధికులు అత్యంత వెనుకబడిన, పేద, దళిత, ఆదివాసీ విద్యార్థులేనన్నారు. వారిలో కొందరు పలు కారణాలతో కోర్సు పూర్తి చేసుకోలేక, మధ్యలోనే చదువు మానుకొని వెనుదిరిగి వెళ్లలేక మానసిక వేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా పేద గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని, తనకూ ఆ బాధ తెలుసని పెరియస్వామి చెప్పారు. వివిధ డిపార్ట్మెంట్లలో మొదట దళిత విద్యార్థులకు గైడ్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్నల్ మార్కులు, ఇంట రాక్షన్ విధానంలో పరీక్షల నిర్వహణను వర్సిటీలో అమలుచేయాలన్నది తన కోరిక అన్నారు. అమెరికాలో అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా.. ప్రొఫెసర్లు బోధించే విషయాలు విద్యార్థులకు ఏమేర అర్థం అవుతున్నాయో, ఎక్కడ లోపాలున్నాయో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. -
దళిత విద్యార్థులకు మనుగడే లేదా?
రోహిత్ ఆత్మహత్యపై ఉప్పులేటి కల్పన ఆవేదన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సృ్మతీ ఇరానీ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ వైస్ చాన్స్‌లర్ శర్మపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన చిన్నపాటి ఘటనకు రాజకీయ రంగు పులిమి సైంటిస్ట్ కావాలని కలలు గన్న ఓ దళిత విద్యార్థిని బలిగొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులకు సమాజంలో మనుగడే లేదా? అని ప్రశ్నించారు. -
అంబేద్కర్ జయంతి సభలో ‘సాక్షి’ రెపరెపలు
ప్రత్యేక కథనంలో ప్రస్తావించిన సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించిన నాయకులు కరీంనగర్: కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల్లో సాక్షి పత్రిక రెపరెపలాడింది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లాలో అపరి ష్కృతంగా ఉన్న దళితుల సమస్యలపై సాక్షి మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించిం ది. ఎల్ఎండీలో ముంపునకు గురైన హస్నాపూ ర్ గ్రామ దళితులకు నివేశన స్థలాల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలాలు చూపించలేదని, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ మూతపడడంతో దళిత విద్యార్థులు పోటీ పరీక్షలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరీంనగర్లో అంబేద్కర్ భవనాల కోసం కేటారుుంచిన స్థలాలు అన్యాక్రాంతం కావడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ నియూమకంలో జాప్యం, వివాహ ప్రోత్సాహకాల కోసం ఎదురుచూపులు, స్వయం ఉపాధి పథకాల్లో కోత, దశాబ్దాలుగా తెగని లీడ్‌క్యాప్ భూముల వ్యవహారం తదితర సమస్యలను కథనంలో ప్రస్తావించింది. వీటితో దళితులు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యల పట్ల ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు కనబరుస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది. మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి సభలో సాక్షి కథనమే దళిత నాయకులకు అజెండాగా కనిపించింది. సాక్షి ప్రస్తావించిన పలు సమస్యలపై నాయకులు సభలో ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. ఇళ్ల స్థలాల విషయమై హస్నాపూర్ దళితుడు సభలో ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్లకు తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రాన్ని అందజేస్తూ తమకు న్యాయం చేయాలని సాక్షి పత్రిక ప్రతులను వారికి అందజేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వేదికపై నుంచి ప్రసంగిస్తూ సాక్షి పత్రికలో వచ్చిన దళితుల సమస్యలను ఏకరువు పెడుతూ జయంతి వేడుకల్లో హమీలు ఇవ్వడం, తర్వాత మరిచిపోవడం తగదని, ఇందులో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు కన్నం అంజయ్య, మాదరి శ్రీనివాస్, జన్ను జయరాజ్ మాట్లాడుతూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని సమస్యలైనా పరిష్కరించి దళితులకు అండగా నిలువాలని డిమాండ్ చేశారు. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి : చీఫ్ విప్ కొప్పుల, కలెక్టర్ ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాల కోసం జిల్లా కేంద్రంలో స్టడీసర్కిల్‌ను వీలైనంత త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకోసారి దళిత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి సరిహద్దు వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నిరసనలు, వినతులు కరీంనగర్ మండలం బహదూర్ఖాన్పేటలో దళితులు ఆలయంలోకి ప్రవేశించవద్దని అడ్డుకొని అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్పీని కోరారు. - సీపీఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలోఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్కస్‌గ్రౌండ్ నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించి ఎంపీ, చీఫ్ విప్‌లకు వినతిపత్రం సమర్పించారు. - దళితుడి భూమిని అన్యాక్రాంతం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న కరీంనగర్ మండలం చెర్లభూత్కుర్ గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. - శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సబ్‌ప్లాన్ నిధులను హాస్టళ్ల అభివృద్ధికి ఖర్చు చేయూలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సురేశ్, తిరుపతి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. - ధర్మారం మండల కేంద్రానికి చెందిన జేరిపోతుల శైలజ-బొల్లి సూరజ్ బీజేపీ జిల్లా నాయకుడు కన్నం అంజయ్య ఆధ్వర్యంలో వేదిక వద్ద ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరినిప్రజాప్రతినిధులు, కలెక్టర్, దళిత సంఘాల నాయకులు ఆశీర్వదించారు. - ధర్మారం మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థినికి న్యాయవాది సుంకె దేవకిషన్ కుట్టుమిషన్‌ను ఎంపీ, చీప్ విప్ చేతుల మీదుగా అందజేశారు. - సమావేశం ప్రారంభంలో వేదికపైకి ఎవరెవరూ వెళ్లాలనే విషయంపై దళిత సంఘాల నాయకులు మేడి మహేశ్, ఎర్రోళ్ల రవీందర్, తదితరుల మధ్య తీవ్ర గలాట జరిగింది. దీంతో సమావేశం కాసేపు గందరగోళంగా తయారైంది. చివరి పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. - బాబుజగ్జీవన్‌రాం, అంబేద్కర్ జయంతి వేడుకలను చైర్మన్‌గా విజయవంతంగా నిర్వహించిన చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ను దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. -
బాత్రూమ్లోనే నివాసం
ఇంత దారుణమా ఒంగోలు అర్బన్: స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు, బహిర్భూమి కోసం పొలాల్లోకి వెళ్లాల్సిందే. వర్షం వచ్చిందా వారి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. పదిహేడు గదుల్లో 350 మంది. ఒక్క గదిలో 25 మంది. ఆఖరికి పాడుబడిన బాత్రూమ్ల్లో కూడా ఇద్దరేసి విద్యార్ధులు సర్దుకుపోతున్నారు. వర్షం పడితే ఆ రోజు జాగారమే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతిగృహంలో ఉన్న పరిస్థితి. గత మూడేళ్లుగా వారు ఉంటున్న అద్దె భవనాన్ని ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నుంచి అందరినీ కలిసినా స్పందన లేదు. గత వారంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసి విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం స్థానిక మామిడిపాలెం ఎస్సీ విద్యార్థుల వసతి గృహాన్ని అకస్మికంగా పరిశీలించారు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని చూసి చలించిపోయారు. తొలుత హాస్టల్లోకి ప్రవేశించగానే స్నానపు గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్న విద్యార్థులు కంటపడ్డారు. అక్కడి నుంచి భోజనాల గదిలోకి వెళ్లగానే పరిశుభ్రత, పాడుపడిన గదులుస్వాగతం పలికాయి. వసతి గృహంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను ఎంపీ ప్రశ్నించగా పదిహేడు గదులు మాత్రమే ఉన్నాయని, వాటిలో మొత్తం 350 మంది ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఆ గదులు కూడా చాలా చిన్నవని, చివరికి మరుగుదొడ్లు కూడా వసతి రూములుగా ఉపయోగించుకుంటున్నామని ఎంపీని తీసుకుపోయి చూపించారు. స్నానపు గదులు, మరుగు దొడ్లు లేవని, గదుల కిటీకీలకి కనీసం తలుపులు కూడా లేకపోవడంతో చలికి, వర్షానికి ఇక్కట్లకు గురవుతున్నామని వాపోయారు. పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించిన ఎంపీ నగరంలో నడిబొడ్డున ఉన్న వసతి గృహం ఇంత అధ్వానంగా ఉంటే పట్టించుకునే అధికారే లేకుండా పోవడం సిగ్గుచేటని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను కూడా వసతి గదులుగా ఉపయోగించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి కనీస వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానని, బాడుగ భవనం కాకుండా సొంత భవనం నిర్మాణానికి చర్యలు చేపడతానని విద్యార్థులకు ఎంపీ భరోసా ఇచ్చారు. కళాశాలలో యాజమాన్యం కూడా తమని చిన్నచూపు చూస్తోందని ఎంపీ దృష్టికి విద్యార్థులు తీసుకురావడంతో స్పందించిన ఎంపీ కళాశాలల యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఆర్జేడీతో మాట్లాడి కళాశాలల్లో యాజమాన్యం, సిబ్బందితో వచ్చే ఇబ్బందులను తొలగిస్తానని హామీ ఇచ్చారు. ధర్నాలు చేసినా ఫలితం లేదు గతంలో ఒకసారి కలెక్టర్ కూడా వచ్చి పరిశీలించి వెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.గతంలో కనీస వసతులు కల్పించాలంటూ ధర్నా కూడా చేశామని, అయినా మా గోడు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్‌ని కలిసి పరిస్థితి వివరించి న్యాయం చేస్తానని విద్యార్థులకు ఎంపీ భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్ సీపీకి ఓట్లేశారని..
దళితులపై టీడీపీ నేతల కక్ష కమ్యూనిటీ భవనానికి తాళాలు చిలకపాడు, (సంతనూతలపాడు): టీడీపీకి కాకుండా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే నెపంతో తమపై వివక్ష చూపుతున్నారని..దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..చిలకపాడులో దళిత విద్యార్థులు చదువుకునేందుకు 2011లో పనబాకలక్ష్మి ఎంపీ నిధులతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతానికి చెందిన దళితులు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే కారణంతో టీడీపీ నాయకులు సహించలేకపోయారు. అంబేద్కర్ భవనాన్ని ఖాళీ చేయించాలని పన్నాగం పన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని ఆ భవనం అంగన్వాడీ కేంద్రానికి కావాలంటూ పంచాయతీలో తీర్మానం చేశామని..ఆ భవనంలోని దళిత విద్యార్థులు వెంటనే ఖాళీ చేయాలని పట్టుబట్టారు. స్థానిక టీడీపీ నాయకులు బుధవారం అకస్మాత్తుగా వచ్చి తాళాలు వేసుకునే క్రమంలో కొంతసేపు దళితులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దళితులను బెదిరించి..భవనానికి తాళాలు వేసుకుని ఎవరైనా తాళాలు పగులగొడితే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయిస్తామని హుకుం జారీ చేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి గొడవలు పెంచుకోవద్దని, ఏవైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి వె ళ్లారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో విద్యార్థుల మెటీరియ ల్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని దళిత విద్యార్థులు వాపోయారు. ఈ విషయం చెప్పినా..టీడీపీ నాయకులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత విద్యార్థులు మాట్లాడుతూ మంగళవారం తహసీల్దార్‌కు, ఎంపీడీవోకు టీడీపీ వారు చేస్తున్న దారుణాలపై వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫ్యాక్స్ చేశామని, గురువారం కలెక్టర్‌కు, ఎస్పీకి టీడీపీవారి అక్రమాలపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. కమ్యూనిటీ భవనం ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మద్దిపాడు సీడీపీవో విజయలక్ష్మిని సాక్షి సంప్రదించగా..గ్రామంలో అంగనవాడీ కేంద్రానికి గది ఎక్కడ కేటాయించినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అంబేద్కర్ భవనాన్నే ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పలేదని అన్నారు.