రోహిత్ మరణానికి ఎవరూ కారణం కాదు
- వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య: అశోక్
- రూపన్‌వాలా కమిషన్
- సూసైడ్‌నోట్‌లోనూ అలాగే ఉంది
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు వర్సిటీ అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడి కారణం కాదని అశోక్ రూపన్‌వాలా కమిషన్ పేర్కొంది. వర్సిటీ వీసీ అప్పారావు సహా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రోహిత్ దళితుడు కాదని, వడ్డెర (బీసీ) కులానికి చెందినవాడని నివేదికలో పేర్కొంది. 2016 జనవరిలో హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అలహాబాద్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్‌వాలా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది డిసెంబర్‌లోనే నివేదిక సమర్పించినా.. మంగళవారం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ తన వెబ్‌సైట్‌లో ఈ 51 పేజీల రిపోర్టును ఉంచింది.
రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వర్సిటీ వీసీ అప్పారావుల ఒత్తిడే కారణమన్న ఆరోపణలను రూపన్‌వాలా కమిషన్ తోసిపుచ్చింది. వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టంచేసింది. ‘‘యూనివర్సిటీ అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడితో ఈ ఆత్మహత్యకు సంబంధం లేదు. వ్యక్తిగత నిర్ణయంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. రోహిత్ సూసైడ్ నోట్ ప్రకారం.. ఆయన వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది’’అని నివేదికలో పేర్కొన్నారు. దళిత విద్యార్థులు యూనివర్సిటీలో చేరే సమయంలోనే ఈ వివక్షను భరించలేక ఉరేసుకునేందుకు ఒక తాడుని, ఇంత విషం ఇవ్వండి అంటూ 2015 డిసెంబర్ 18న వీసీ అప్పారావుకు రోహిత్ రాశారు. అయితే ఈ లేఖ తన మరణానికి నెల ముందు రాసింది కనుక రోహిత్ ఆత్మహత్యకు అది కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది. అలాగే వర్సిటీలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించినట్లుగా తన దృష్టికి రాలేదని వివరించింది.
కమిషన్ పని ఏంటి..?
రోహిత్ మరణానికి కారణం ఏంటన్న విషయాన్ని కాకుండా అతడు దళితుడు కాదన్న విషయాన్ని రుజువు చేసే పనిని కమిషన్ నెత్తిన వేసుకుందంటూ అంబేడ్కర్ స్డూడెంట్స్ అసోసియేషన్, సామాజిక న్యాయపోరాట ఐక్య కమిటీ మండిపడింది. వర్సిటీలో రోహిత్ సహా హాస్టల్ నుంచి వెలివేతకు గురైన సామాజిక న్యాయపోరాట కమిటీ నాయకుడు దొంత ప్రశాంత్ కమిషన్ రిపోర్టును దుయ్యబట్టారు. రోహిత్ మరణానికి కారకులైన వీసీ, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావులను తప్పించేందుకే న్యాయసమ్మతం కాని ఈ రిపోర్టు ఇచ్చారని అన్నారు. రోహిత్ కులాన్ని ధ్రువీకరించే అధికారం కమిషన్‌కు లేదన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే
దళితేతరుడైన, బీజేపీ అనుకూలురైన అశోక్ రూపన్‌వాలా ఇచ్చిన నివేదికను అంగీకరించేదిలేదు. బీజేపీ సర్కారు తనకు అనుకూలమైన వారితో రిపోర్టు ఇప్పించింది. దీన్ని మేం అంగీకరించం. నేషనల్ ఎస్సీ కమిషన్ ఏనాడో రోహిత్ దళితుడని తేల్చి చెప్పింది.
– మున్నా, అంబేడ్కర్ çస్టూడెంట్స్ అసోసియేషన్ కన్వీనర్
నాడే వెల్లడించిన ‘సాక్షి’
రిపోర్టు ఆద్యంతం కులం ప్రస్తావనే అంటూ గతంలోనే ‘సాక్షి’ బయటపెట్టింది. ఇప్పుడు కమిషన్ అదే రిపోర్టు వెల్లడించింది. గతంలో సెంథిల్ కుమార్ ఆత్మహత్య సందర్భంగా నియమించిన పావురాల కమిషన్‌కానీ, కృష్ణ కమిషన్‌గానీ యూనివర్సిటీలో పరిస్థితుల మెరుగు కోసం సూచించిన ఎలాంటి చర్యలూ ఇప్పటికీ వర్సిటీ యాజమాన్యం తీసుకోకపోవడం గమనార్హం.