హెచ్‌సీయూలో ఉద్రిక్తత
వెలివాడ ఉద్యమకారుల టెంట్లు తీసేయడంపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ అగ్గి రాజుకుంది. వర్సిటీలో వెలివాడ వద్ద ఏర్పాటు చేసుకున్న ఉద్యమకారుల టెంట్లు రాత్రికి రాత్రి మాయమవడంపై నిరసన పెల్లుబికింది. టెంట్లకున్న అంబేడ్కర్ నినాదాల పోస్టర్లు, రోహిత్ ఫొటోలనూ తొలగించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్సిటీ గేటు వద్ద బైఠాయించారు. దళిత విద్యార్థులను అణచివేసేందుకు వీసీ అప్పారావు పన్నుతున్న కుయుక్తులే ఇవని ఆరోపించారు. సెక్యూరిటీ సిబ్బంది టెంట్లు తొలగిస్తుండగా కొందరు విద్యార్థులు చూశారని విద్యార్థి జేఏసీ తెలిపింది. సెక్యూరిటీని నిలదీసినప్పటికీ తమకేం తెలియదంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించింది. తమకెలాంటి నోటీసూ ఇవ్వకుండానే టెంట్లు, బ్యానర్లు తొలగించిన వీసీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏదిఏమైనా తమ ఉద్యమం ఆగదని, వీసీపై చర్యలు తీసుకునేవరకూ పోరాడతామని ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థులంతా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు.
కండిషన్ బెయిల్ నుంచి విముక్తి
హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు సహా మొత్తం 27 మందికి మార్చి 22న నమోదైన కేసులో కండిషన్ బెయిల్ నుంచి విముక్తి లభించింది. మార్చి 22న విద్యార్థులు, అధ్యాపకులు రత్నం, తథాగత్‌లతో సహా 27 మంది హెచ్‌సీయూ విద్యార్థులకు ఇచ్చిన కండిషన్ బెయిల్ శుక్రవారంతో ముగిసింది.