హెచ్‌సీయూలో సంస్కరణలు అవసరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సంస్కరణలు అవసరమని... విద్యార్థుల ప్రవేశాలు మొదలుకొని అధ్యాపకుల నియామకాల వరకు అన్నింటిలో రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయాలని వర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ మరియప్పన్ పెరియస్వామి చెప్పారు. ప్రతిష్టాత్మకమైన హెచ్‌సీయూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంపెడాశతో వచ్చిన దళిత, వెనుకబడిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం విషాదకరమని పేర్కొన్నారు. వర్సిటీలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
హెచ్‌సీయూలో కెమిస్ట్రీ విభాగం డీన్ అయిన పెరియస్వామి.. ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వేల ఏళ్లుగా అవమానాలకు, వివక్షకు గురవుతున్న దళిత విద్యార్థులకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని పెరియస్వామి చెప్పారు. హెచ్‌సీయూలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
వివక్షకు తావులేకుండా చేయడానికి మీ దగ్గరున్న ప్రణాళిక ఏమిటని ప్రశ్నించగా... అంబేడ్కర్ ప్రసాదించిన రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడమే పరిష్కారమన్నారు. హెచ్‌సీయూలో అన్ని రంగాల్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ప్రవేశాలు మొదలుకొని అధ్యాపకుల నియామకాల వరకు అన్నింటిలో రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పారు. ఇప్పటికే వర్సిటీ ఆ పనిచేస్తున్నా.. మరింత సమర్థవంతంగా అమలు చేయడం అవసరమన్నారు.
రోహిత్ కుటుంబానికి న్యాయం చేస్తాం
రోహిత్ బతికుంటే గొప్ప ప్రొఫెసర్ కాగలిగేవాడని పెరియస్వామి చెప్పారు. అంత గొప్పవ్యక్తికి మనమెవరమూ నష్టపరిహారం ఇవ్వలేమని, అతడి కుటుంబానికి న్యాయం చేయగలిగితే చాలని పేర్కొన్నారు. అది కూడా చేయకపోతే సమాజం క్షమించదన్నారు. రోహిత్ తమ్ముడు రాజుకు హెచ్‌సీయూలో ఉద్యోగం కల్పించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వర్సిటీల్లో అడ్మిషన్లు, పరీక్షల విధానం, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పెరియస్వామి అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకించి మెంటర్ వ్యవస్థ ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలు జరగడం లేదని, దాన్ని పునరుద్ధరిస్తానని చెప్పారు. వర్సిటీకి వచ్చేవారిలో అత్యధికులు అత్యంత వెనుకబడిన, పేద, దళిత, ఆదివాసీ విద్యార్థులేనన్నారు. వారిలో కొందరు పలు కారణాలతో కోర్సు పూర్తి చేసుకోలేక, మధ్యలోనే చదువు మానుకొని వెనుదిరిగి వెళ్లలేక మానసిక వేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా పేద గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని, తనకూ ఆ బాధ తెలుసని పెరియస్వామి చెప్పారు.
వివిధ డిపార్ట్‌మెంట్లలో మొదట దళిత విద్యార్థులకు గైడ్‌లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్నల్ మార్కులు, ఇంట రాక్షన్ విధానంలో పరీక్షల నిర్వహణను వర్సిటీలో అమలుచేయాలన్నది తన కోరిక అన్నారు. అమెరికాలో అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా.. ప్రొఫెసర్లు బోధించే విషయాలు విద్యార్థులకు ఏమేర అర్థం అవుతున్నాయో, ఎక్కడ లోపాలున్నాయో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు.