బాత్‌రూమ్‌లోనే నివాసం
ఇంత దారుణమా
ఒంగోలు అర్బన్: స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు, బహిర్భూమి కోసం పొలాల్లోకి వెళ్లాల్సిందే. వర్షం వచ్చిందా వారి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. పదిహేడు గదుల్లో 350 మంది. ఒక్క గదిలో 25 మంది. ఆఖరికి పాడుబడిన బాత్‌రూమ్‌ల్లో కూడా ఇద్దరేసి విద్యార్ధులు సర్దుకుపోతున్నారు. వర్షం పడితే ఆ రోజు జాగారమే.
ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతిగృహంలో ఉన్న పరిస్థితి. గత మూడేళ్లుగా వారు ఉంటున్న అద్దె భవనాన్ని ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నుంచి అందరినీ కలిసినా స్పందన లేదు. గత వారంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసి విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
దీంతో ఆయన గురువారం సాయంత్రం స్థానిక మామిడిపాలెం ఎస్సీ విద్యార్థుల వసతి గృహాన్ని అకస్మికంగా పరిశీలించారు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని చూసి చలించిపోయారు. తొలుత హాస్టల్లోకి ప్రవేశించగానే స్నానపు గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్న విద్యార్థులు కంటపడ్డారు. అక్కడి నుంచి భోజనాల గదిలోకి వెళ్లగానే పరిశుభ్రత, పాడుపడిన గదులుస్వాగతం పలికాయి. వసతి గృహంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను ఎంపీ ప్రశ్నించగా పదిహేడు గదులు మాత్రమే ఉన్నాయని, వాటిలో మొత్తం 350 మంది ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఆ గదులు కూడా చాలా చిన్నవని, చివరికి మరుగుదొడ్లు కూడా వసతి రూములుగా ఉపయోగించుకుంటున్నామని ఎంపీని తీసుకుపోయి చూపించారు.
స్నానపు గదులు, మరుగు దొడ్లు లేవని, గదుల కిటీకీలకి కనీసం తలుపులు కూడా లేకపోవడంతో చలికి, వర్షానికి ఇక్కట్లకు గురవుతున్నామని వాపోయారు. పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించిన ఎంపీ నగరంలో నడిబొడ్డున ఉన్న వసతి గృహం ఇంత అధ్వానంగా ఉంటే పట్టించుకునే అధికారే లేకుండా పోవడం సిగ్గుచేటని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను కూడా వసతి గదులుగా ఉపయోగించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందని అన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి కనీస వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానని, బాడుగ భవనం కాకుండా సొంత భవనం నిర్మాణానికి చర్యలు చేపడతానని విద్యార్థులకు ఎంపీ భరోసా ఇచ్చారు. కళాశాలలో యాజమాన్యం కూడా తమని చిన్నచూపు చూస్తోందని ఎంపీ దృష్టికి విద్యార్థులు తీసుకురావడంతో స్పందించిన ఎంపీ కళాశాలల యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఆర్‌జేడీతో మాట్లాడి కళాశాలల్లో యాజమాన్యం, సిబ్బందితో వచ్చే ఇబ్బందులను తొలగిస్తానని హామీ ఇచ్చారు.
ధర్నాలు చేసినా ఫలితం లేదు
గతంలో ఒకసారి కలెక్టర్ కూడా వచ్చి పరిశీలించి వెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.గతంలో కనీస వసతులు కల్పించాలంటూ ధర్నా కూడా చేశామని, అయినా మా గోడు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్‌ని కలిసి పరిస్థితి వివరించి న్యాయం చేస్తానని విద్యార్థులకు ఎంపీ భరోసా ఇచ్చారు.