ఫ్లోరోసిస్‌పై దృష్టి పెట్టండి..
కలెక్టర్‌కు సూచించిన ఎంపీ వైవీ
ఒంగోలు టౌన్ : ‘జిల్లాలోని 48 మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. అక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అక్కడి ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని’ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కలెక్టర్ సుజాతశర్మకు సూచించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను ఎంపీ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలపై ఆమెతో చర్చించారు.
ఫ్లోరోసిస్ మహమ్మారి వల్ల ప్రజలు ఏవిధంగా మారిపోయారో కొన్ని ప్రాంతాలకు చెందిన బాధితుల ఫొటోలను కలెక్టర్‌కు చూపించారు. చిన్న వయస్సులోనే వృద్ధాప్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఫ్లోరోసిస్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సుబ్బారెడ్డి సూచించారు. అదేవిధంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకుస్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగులు తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకునేందుకు వీలు కలుగుతుందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఎంపీ వెంట వైపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఉన్నారు.
ఎంపీని కలిసిన పలువురు నాయకులు
ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజలు ఆదివారం ఎంపీని కలిసారు. గిద్దలూరు, వైపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ తదితరులు ఎంపీని కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఇతర నాయకులతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పలు విషయాలపై చర్చించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తప్పక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కఠారి శంకర్, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.వి.ప్రసాద్, విజయవాడ ఇన్‌చార్జ్ వై.వెంకటేశ్వర్లు, సంతనూతలపాడు మండల నాయకుడు దుంపా చెంచిరెడ్డి, మద్దిపాడు మండల నాయకులు మండవ అప్పారావు, నాయకులు మారెళ్ల బంగారుబాబు, చింతా శ్రీనివాసరావు, జాజుల కృష్ణ తదితరులు ఉన్నారు.
కనిగిరిలో నేడు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పర్యటన
సీఎస్‌పురం : కనిగిరి నియోజకవర్గంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పర్యటించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్‌యాదవ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు కనిగిరి, 11 గంటలకు వెలిగండ్ల, మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎస్‌పురం, గం.2.30కు పామూరుల్లో పర్యటిస్తారని చెప్పారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.