అనకర్లపూడి(కొండపి): ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొండపి మండలంలోని అనకర్లపూడిలో ఆయన గురువారం రాత్రి గ్రామ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గుమ్మళ్ళ సురేష్‌బాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో నేటికీ పల్లెల్లో రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి ఉందన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువుగా ఉందని, ముఖ్యంగా కనిగిరి, దర్శి ప్రాంతాల్లో తీవ్రంగా కనిపిస్తుందన్నారు. ఒక్కో గ్రామంలో 20 మందికి పైగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, ఇందులో కొంతమంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు.
జిల్లాకు స్పెషల్ ప్యాకేజీ అడిగానని, కేంద్ర మంత్రి స్పందించి జిల్లాకు వచ్చి స్వయంగా పరిశీలించి సాయం అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం మరచిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దౌర్జాన్యాలకు దిగుతున్నారని, సంక్షేమ పథకాలను పచ్చ చొక్కాల నాయకులకు అర్పిస్తున్నారని విమర్శించారు. ఏ పరిస్ధితుల్లోనైనా కార్యకర్తలకు అండగా ఉంటామని, అధికార పార్టీ నాయకుల ఉడత ఊపులకు భయపడేదిలేదన్నారు. దాడికి పాల్పడిన నేరగాళ్లకు శిక్షపడే వరకూ పోరాడతామని, న్యాయం జరగకపోతేలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పచ్చచొక్కా కమిటీలు ఏకపక్షంగా సంక్షేమ పథకాల నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని, ఇందుకు ఉదాహరణ అనకర్లపూడిలోనే అర్హులైన 18 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు పింఛన్లు తీసేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం త్వరలో ఒంగోల్లో జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొండపి నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యామ్‌లు మూలనపడ్డాయని, వీటి మరమ్మతులకు ప్రభుత్వం వెంటనే రూ.10 కోట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అనకర్లపూడిలో వైఎస్సార్‌సీపీ యువత ముందుకు వచ్చి వాటర్ ఫ్లాంట్‌ను స్వచ్ఛంధంగా ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధి కోసం రూ.5 లక్షలు ఎంపీ నిధులు కేటాయిస్తానని గ్రామస్ధులకు వాగ్ధానం చేశారు. కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కేవీ ప్రసాద్, జిల్లా నాయకులు ఢాకా పిచ్చిరెడ్డి, కట్టా శివయ్య, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు రవీంద్రబాబు, మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, టుబాకో బోర్డు సభ్యుడు రావూరి అయ్యవారయ్య, శింగరాయకొండ యూత్ కన్వీనర్ సామంతుల రవికుమార్ రెడ్డి, జరుగుమల్లి యువజన కన్వీనర్ గాలి శ్రీనివాసులు, గ్రామ ఉపసర్పంచి గుమ్మళ్ళ రవికుమార్, ప్రసాద్, కొండపి సింగిల్‌విండో అధ్యక్షుడు భువనగిరి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లోరైడ్ పరిష్కారానికి కృషిచేస్తా: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
Published Sat, Jan 17 2015 9:16 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM
Advertisement