పార్లమెంటులో ఫ్లోరైడ్ సమస్య
⇒ వై.ఎస్. జీవించి ఉంటే ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారి ఉండేది
⇒ రూపుమాపాలంటే జిల్లాకు వెయ్యికోట్లు కేటాయించాలి
⇒ లోక్‌సభలో ప్రకాశం, నల్గొండ సమస్యలపై ఎంపీ వైవీ ప్రస్తావన
ఒంగోలు: జిల్లాలో వివిధ వర్గాలను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ బాధితుల వెతలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ నేటికీ వెంటాడుతోంది.
ఈ సమస్యను రూపుమాపేందుకే అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వెలిగొండకు తీసుకొని వచ్చి కనిగిరి, హనుమంతునిపాడు మండలాలను ఫ్లోరైడ్ రహిత మండలాలుగా చేయాలని భావించి ప్రారంభించారు. మొత్తం 5,600 కోట్లకుగాను ఇంకా రూ.3,800 కోట్లు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం చిన్న చూపు కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలను, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజానీకాన్ని, ఆ ప్రాంత పశుగణాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని లోక్‌సభలో బుధవారం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దాదాపు శతాబ్ద కాలంగా కనిగిరి సమీప ప్రాంతాల ప్రజలు ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారన్నారు. అక్కడి ప్రజలు కేవలం తాగేందుకు సురక్షితమైన నీటిని అందించాలని వేడుకుంటున్నారు. ఇదే పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండలో కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో 56 మండలాలకుగాను 48 మండలాల్లో ఈ సమస్య ఉందన్నారు. కేవలం తాగునీటిలోనే కాకుండా భూగర్భ జలాల్లోనే ఈ సమస్య ఉందని, తద్వారా తాగునీరే కాకుండా భూగర్భ జలాల ద్వారా పండిన గడ్డిని మేస్తున్న పశువులు కూడా బాధపడుతున్నాయన్నారు.
భూగర్భ జలాల్లోనే మార్పు తీసుకురావాలంటే ఈ ప్రాంతానికి సాగర్ జలాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షితమైన తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. ఒక వేళ అది సాధ్యపడదని భావిస్తే ఫ్లోరోసిస్ ప్రభావానికి తీవ్రంగా గురైన 12 మండలాలకు వంద కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి సాగర్ నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ ప్రాంతాలలో కిడ్నీవ్యాధిగ్రస్తులు పెరిగిపోయారని, వారు డయాలసిస్ సెంటర్‌కు చేరుకోవాలంటే కనీసంగా వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. మానవతా దృక్పథంతో పరిశీలించి కనిగిరి సమీప ప్రాంతాలలోనే డయాలసిస్ సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన మందులు, పౌష్టికాహారం అందించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. 2012 ఏప్రిల్ నాటికి జాతీయ స్థాయిలో ఫ్లోరోసిస్‌ను రూపుమాపాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 470 గ్రామాలలో మాత్రమే సర్వే జరిగిందని, ఇంకా 317 గ్రామాలలో సర్వే జరగలేదన్నారు.
ఇక మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అభియాన్ పథకానికి శ్రీకారం చుట్టడాన్ని అభినందిస్తున్నానన్నారు. 2001 నుంచి 2011 వరకు పరిశీలిస్తే ఏడాదికి ఒక శాతం చొప్పున మాత్రమే మరుగుదొడ్ల పెరుగుదల కనిపించిందన్నారు. ప్రస్తుతం దీనికోసం గతంలో 12,187 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దీనికి అందులో సగం మాత్రమే కేటాయించారని, ఈ లెక్కన వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలంటే 2081వ సంవత్సరానికి సాధ్యం అవుతుందేమో అన్నారు.
కానీ ఏపీలో మాత్రం 65శాతానికిపైగా మరుగుదొడ్లు లేని కుటుంబాలున్నాయన్నారు. 72,176 కుటుంబాలకుగాను 18,674 కుటుంబాలకు మాత్రమే రోజుకు కనీసంగా 55 లీటర్ల తాగునీరు అందుతుందని, మిగిలిన గ్రామాలలోని ప్రజానీకానికి ఇప్పటికీ 55 లీటర్ల తలసరి నీరు అందకపోవడం బాధాకరమన్నారు.