సాక్షి, పామూరు: ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను, ఫ్లోరైడ్ సమస్యను జాతీయస్థాయిలో వినిపించేందుకు ఆ జిల్లాకు చెందిన ఇద్దరు సోమవారం వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సమితి సభ్యుడు, బ్రాహ్మణ అర్చక పురోహిత విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి వెంకట రవికిరణ్‌శర్మ సాయంత్రం 5.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: వారణాసిలో పసుపు రైతుల నామినేషన్లు)
అనంతరం శ్రీనివాసులు, రవికిరణ్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రకాశం జిల్లా నేతలు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని చిన్న చూపు చూసిందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 29 మండలాల్లో 15 లక్షల మందికిపైగా తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీటి ఇబ్బందులు తీరతాయన్నారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవడంతోపాటు సమస్యల పరిష్కారం కోసం తాము మోదీపై వారణాసిలో నామినేషన్ వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment