సాక్షి, విజయవాడ : గొప్ప కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేశానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన ‘వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లో ప్రజాగర్జన’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో తమ వాణిని బలంగా వినిపించామన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించడంలో తనతో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు.
పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, ఉపాధీ హామీ పథకం నిధులు దుర్వినియోగంపై పార్లమెంట్‌ను ప్రశ్నించామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదనే వాస్తవాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టామన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకే ఎంపీ పదవికి రాజీనామా చేశాననిని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ 7నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశారని ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, కన్నబాబు, వెల్లంపల్లి, విశ్వరూప్, శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి, ఎమ్మెల్యేలు ఉదయభాను, మెరుగు నాగార్జున, జోగి రమేష్, పుష్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment