వైఎస్సార్ సీపీకి ఓట్లేశారని.. | Community building locks | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకి ఓట్లేశారని..

Published Thu, Jul 24 2014 4:57 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

Community building locks

  • దళితులపై టీడీపీ నేతల కక్ష
  • కమ్యూనిటీ భవనానికి తాళాలు
  • చిలకపాడు, (సంతనూతలపాడు): టీడీపీకి  కాకుండా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే నెపంతో తమపై వివక్ష చూపుతున్నారని..దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..చిలకపాడులో దళిత విద్యార్థులు చదువుకునేందుకు 2011లో పనబాకలక్ష్మి ఎంపీ నిధులతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతానికి చెందిన దళితులు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే కారణంతో టీడీపీ నాయకులు సహించలేకపోయారు. అంబేద్కర్ భవనాన్ని ఖాళీ చేయించాలని పన్నాగం పన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని ఆ భవనం అంగన్‌వాడీ కేంద్రానికి కావాలంటూ పంచాయతీలో తీర్మానం చేశామని..ఆ భవనంలోని దళిత విద్యార్థులు వెంటనే ఖాళీ చేయాలని పట్టుబట్టారు. స్థానిక టీడీపీ నాయకులు బుధవారం అకస్మాత్తుగా వచ్చి తాళాలు వేసుకునే క్రమంలో కొంతసేపు దళితులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

    దళితులను బెదిరించి..భవనానికి తాళాలు వేసుకుని ఎవరైనా తాళాలు పగులగొడితే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయిస్తామని హుకుం జారీ చేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి గొడవలు పెంచుకోవద్దని, ఏవైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి వె ళ్లారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో విద్యార్థుల మెటీరియ ల్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని దళిత విద్యార్థులు వాపోయారు. ఈ విషయం చెప్పినా..టీడీపీ నాయకులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా దళిత విద్యార్థులు మాట్లాడుతూ మంగళవారం తహసీల్దార్‌కు, ఎంపీడీవోకు టీడీపీ వారు చేస్తున్న దారుణాలపై వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫ్యాక్స్ చేశామని, గురువారం కలెక్టర్‌కు, ఎస్పీకి టీడీపీవారి అక్రమాలపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. కమ్యూనిటీ భవనం ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.  దీనిపై మద్దిపాడు సీడీపీవో విజయలక్ష్మిని సాక్షి సంప్రదించగా..గ్రామంలో అంగనవాడీ కేంద్రానికి గది ఎక్కడ కేటాయించినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అంబేద్కర్ భవనాన్నే ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement