కార్యాలయంలో రూ.2,16,500, లజపతిరావు ఇంట్లో రూ.5,20,500 నగదు స్వాధీనం
రూ.6.21 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు సీజ్
ప్రతి హాస్టల్ విద్యార్థి నుంచి రూ.15 చొప్పున వసూలు
చివరి విడత డైట్ చార్జీల చెల్లింపులో చేతివాటం
ఏలూరు (వన్ టౌన్) : హాస్టల్ విద్యార్థుల నుంచి లంచాలు వసూలు చేస్తూ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.లాలాలజపతిరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అతడిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంతోపాటు లజపతిరావు ఇంట్లో తనిఖీలను కొనసాగిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు చివరి మూడు నెలల భోజన చార్జీలకు సంబంధించిన సొమ్ము చెల్లింపుల సందర్భంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.15 చొప్పున వసూలు చేసినట్టు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఏసీబీ డీఎస్పీ కె.రాజేం ద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్స్ ఉంటున్న ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల భోజన ఖర్చుల కోసం చివరి మూడు నెలలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాలను చెల్లించేందుకు వారినుంచి లంచాలు వసూలు చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది.
దీంతో ఏసీబీ బృందం ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం మెరుపు దాడిచేసింది. ఆ సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.లాలాలజపతిరావు జేబులోంచి రూ.14,500, అదే కార్యాలయంలో ఉన్న భీమవరం హాస్టల్ వార్డెన్ ఎం.తిరుపతిరావు, పాల కొల్లు హాస్టల్ వార్డెన్ ఎల్.కరుణాకరరావు నుంచి రూ.43 వేలు, 24 హాస్టళ్ల నుంచి వసూలు చేసి లజపతిరావు టేబుల్‌పై ఉంచిన రూ.1,09,000లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ జి.సతీష్‌కుమార్ ఉపయోగిస్తున్న బీరువాలో ఉన్న రూ.50 వేలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంలో 24 హాస్టళ్లలో ఏ హాస్టల్ నుంచి ఎంత సొమ్ము వసూలు చేశారనే వివరాలతో కూడిన చిట్టా లజపతిరావు వద్ద లభించింది. లజపతిరావు ఇంట్లో సోదాలు చేయగా రూ.5,20, 500 నగదు, రూ.6,21,000 విలువైన 11 ప్రాంసరీ నోట్లు లభ్యమయ్యాయి. రాత్రి 11.30 గంటల వరకూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 చొప్పున..
జిల్లాలో 89 హాస్టళ్లు ఉండగా, సుమారు 7వేల మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ డైట్ చార్జీల చివరి క్వార్టర్ బడ్జెట్ విడుదలైంది. ఆ మొత్తాలను మంజూరు చేసేందుకు ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.15 చొప్పున హాస్టల్ వార్డెన్లు వసూలు చేశారు. మొదటి విడతగా 24 హాస్టళ్లలోని విద్యార్థుల నుంచి రూ.1,09,000 వసూలు చేశారు. భీమవరం హాస్టల్ వార్డెన్ ఎం.తిరుపతిరావు, పాలకొల్లు హాస్టల్ వార్డెన్ ఎల్.కరుణాకరరావు వసూలు చేసిన రూ.43 వేలను లజపతిరావుకు ఇచ్చేందుకు తీసుకువచ్చారు. పెద్దమొత్తంలో సొమ్ములు చేతులు మారుతున్నాయన్న సమాచారం అధికారులకు అందటంతో ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్రరావు, సీఐ యూజే విల్సన్, సిబ్బంది రంగంలోకి దిగటంతో వ్యవహారం వెలుగుచూసింది. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లజపతిరావు, సూపరింటెండెంట్ సతీష్‌కుమార్‌లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు.
ఏసీబీకి చిక్కిన వసూల్ రాజా
Published Thu, Mar 19 2015 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement