సున్నంగూడలో వెలగని సోలార్‌లైట్
సీతంపేట: గిరిజన బతుకులు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నాయి. వీరికి వెలుగు అందించడానికి సర్కారు చెప్పిన సోలార్ కథ కంచికి చేరేలా కనిపిస్తోంది. గిరిజన గ్రామాల్లో గతంలో వేసిన సోలార్ లైట్లు దాదాపుగా పాడైపోయాయి. వీటిని పట్టించుకునే వారే లేకపోవడంతో గిరిజన గూడల్లో చీకట్లు అలముకుం టున్నాయి. కొండలపై ఉన్న గ్రామాలతో పాటు కొండ దిగువన ఉన్న గ్రామాల్లో సైతం చాలా లైట్లు వెలగడం లేదు. ఈ దీపాలు వేసిన కొద్ది రోజుల వరకు మాత్రమే వెలిగాయి. దీంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సదుపాయం ఉన్నా వీధి లైట్లు లేని గ్రామాలకు, కొండలపై ఉన్న గ్రామాలకు సౌర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల కిందట నెడ్‌క్యాప్ సంస్థ ద్వారా 325, ప్రైవేట్‌గా మరో 250 సోలార్ దీపాలు దాదాపు వంద గ్రామాల వరకు ఇచ్చారు.
ఒక్కో గ్రామంలో రెండు, మూడు లైట్ల వరకు వేశారు. రాత్రి వేళ అడవి జంతువుల భయం ఉండకుండా ఈ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా ఇవి వెలుగుతాయి కాబట్టి వీటిని కొండలపై ఏర్పాటు చేశారు. అలాగే ఏనుగుల ప్రభావిత గ్రామాలకు కూడా పంపిణీ చేశారు. ఈ గ్రామాల్లో ఎక్కువగానే దీపాలు ఇచ్చారు. ఒక్కో దీపం ఖరీదు రూ.18,400 వరకు ఉంటుంది. ఇలా కోటి రూపాయల వరకు వెచ్చించారు. అయితే ఈ దీపాల్లో 50 శాతం వెలగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడవి జంతువులతో కష్టాలే
ఆడవి జంతువులతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్‌లో అడవి పందులు వంటివి ఎక్కువగా తిరుగుతుంటాయి. దీంతో గిరిజనులు భయాం దోళనలు చెందుతున్నారు.
ఏనుగుల ప్రభావిత గ్రామాల్లో కూడా వేసిన లైట్లు సైతం వెలగడం లేదు. వాస్తవానికి ఏనుగులు లైటింగ్ ఎక్కువగా ఉంటే గ్రామాలకు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే చాలా గ్రామాల్లో లైట్లు వెలగకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి ఉంది.
పర్యవేక్షణ లేకనే..
సోలార్ లైట్లు వినియోగించాలంటే ప్రతి రెండునెలలకొక మారు ఈ సోలార్ లైట్లకు ఉండే బ్యాటరీల్లో డిస్టల్ వాటర్ వేయాలి. అలాగే బ్యాటరీ పోకుండా జెల్లీ పది గ్రాముల వరకు బ్యాటరీకి రాయాలి. అలాంటి మెయింటెనెన్స్‌లు ఏవీ చేయకపోవడంతో సోలార్ లైట్లు కొన్ని మొరాయించగా మరికొన్ని చోట్ల మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్నాయని గిరిజ నులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఎలాంటి డిస్టల్ వాటర్, జెల్లి వంటివి పెట్టకపోవడంతో కొన్ని సోలార్ లైట్లకు అయితే బ్యాటరీలు కూడా పోయి ఉంటాయని పలువురు మెకానిక్‌లు తెలియజేస్తున్నారు. అయితే వీటి మెయింటెనెన్స్‌కు గతంలో ఇద్దరిని కూడా నియమించారు. వారికి అవసరమైన టూల్‌కిట్‌లు వంటివి లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. నెడ్‌క్యాప్ అధికారులు బ్యాటరీలు ఎత్తుకుపోయారని, తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment