సమగ్ర సోమశిల.. తీరిన రైతు కల | Somasila Project Completed By Y S Rajashekar Reddy | Sakshi
Sakshi News home page

సమగ్ర సోమశిల.. తీరిన రైతు కల

Published Thu, Mar 21 2019 2:47 PM | Last Updated on Thu, Mar 21 2019 2:47 PM

Somasila Project Completed By Y S Rajashekar Reddy - Sakshi

సాక్షి, సోమశిల (నెల్లూరు): మూడు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన జిల్లా జల వరప్రదాయని సోమశిల ప్రాజెక్ట్‌కు సమగ్రతను తీసుకువచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోమశిల జలాశయంలో ప్రతిష్టాత్మకంగా 72 టీఎంసీలు నీరు నిల్వ చేశారు. గత  ప్రభుత్వంలో ముంపు పరిహారంలో జాప్యం, అటవీ అనుమతి లభించక 38 టీఎంసీలకు నీటి నిల్వకు అధిగమించలేదు. 2004లో అధికారంలోకి రాగానే  నిర్వాసితులతో వైఎస్సార్‌ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పాత ప్రభుత్వాల కంటే రెట్టింపు నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం సైతం ఆయన ప్రకటించారు. రూ.260 నుంచి సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు కేటాయించటంతో నెల్లూరు జిల్లా ఎప్పిరాళ్ల, వైఎస్సార్‌ జిల్లా అట్లూరు, ఎగువరాచపల్లి, కొత్త, పాత మాధవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారు సంతోషంగా ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించారు.

జలాశయంలో 38 టీఎంసీల సామర్థ్యం నుంచి 51 టీఎంసీలకు పెంచారు. వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన బాధితులకు నష్టపరిహారం చెల్లింపులాంటి చర్యలు చేపట్టడంతో 2007 నాటికి సమగ్ర సోమశిల లక్ష్యం మేరకు 72 టీఎంసీల నీటిని సోమశిల ప్రాజెక్టు చరిత్రలో తొలి సారిగా నీటిని నిలిపారు. ప్రతిష్టాత్మకంగా 2008లో మొదటి సారిగా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఇచ్చిన మాట మేరకు పలువురికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే అప్పట్లోనే ఆయన సోమశిల జలాలు మెట్ట ప్రాంతమైన కొండాపురం, వింజమూరు, కలిగిరి మండలాలతో పాటు రాళ్లపాడు ప్రాజెక్టర్‌ వరకు పారుదలయ్యేందుకు రూపొందించిన ఉత్తర కాలువ పొడిగింపు పనులతో పాటు కలువాయి, చేజర్ల, పొదలకూరు మండలాలకు సాగు–తాగు నీరు అందించేందుకు దక్షిణకాలువ నిర్మాణ పనులకు ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించినా ఆయన మరణాంతరం నత్త నడకన సాగుతున్నాయి.

ప్రాజెక్ట్‌కు శ్రీకారం - 4 జూన్‌ 1975 
తొలుత ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం - రూ.553 కోట్లు
ప్రాజెక్ట్‌ నీటి సామర్థ్యం లక్ష్యం - 72 టీఎంసీలు
2004 నాటికి నిల్వ సామర్థ్యం - 38 టీఎంసీలు
2007 నాటికి నిల్వ సామర్థ్యం - 72 టీఎంసీలు (సమగ్ర సోమశిల) 

నాలుగు దశల్లో ఉత్తర కాలువ 
మూడు ప్రత్యేక ప్యాకేజీలు, నాలుగో చివరి దశ పనుల కోసం రూ.260 కోట్లు అప్పట్లో వైఎస్సార్‌ కేటాయించారు. మూడు ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా ప్యాకేజీ–11 నిర్మాణం మేరకు 0 కి.మీ నుంచి 13 కి.మీ చిలకలమర్రి వరకు రూ.34.23 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–96లో 13 కి.మీ నుంచి 73.92 కి.మీ ఏఎస్‌పేట మండలం గుడిపాడు వరకు రూ.104.72 కోట్లు మంజూరు కాగా అందులో 80 శాతం మాత్రమే పనులయ్యాయి. మిగిలిన పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ చేతులెత్తేయటంతో నిలిచి పోయాయి. ప్యాకేజీ–32లో భాగంగా 73.92 కి.మీ నుంచి 100వ కి.మీ కొండాపురం మండలం ఉప్పుటేరు వరకు రూ.73 కోట్లతో జరగాల్సిన పనులు 66 శాతం మాత్రమే అయ్యాయి. ఈ రెండు ప్యాకేజీల్లో పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులపై దృష్టి సారించకపోవటం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది.  సోమశిల దక్షిణ కాలువ ద్వారా నీరు కలువాయి,చేజర్ల మెట్ట మండలాలకు సరఫరా అయ్యేందుకు నిర్దేశించిన దక్షిణ కాలువ పనులు ప్యాకేజీ 95 కింద రూ.28.81 కోట్ల మంజూరు కాగా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కాలువ లైనింగ్‌ పనులు నాసిరకంగా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ కాలువ కింద నిర్దేశించిన 41 వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించగా కాలువ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే 61.53 వేల ఎకరాలు ఆయకట్టు అభివృద్ధిలోకి రానుంది. 

మెట్ట ప్రాంతాల దాహార్తికి హైలెవల్‌ కాలువ
జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో మర్రిపాడు, దుత్తలూరు, వింజమూరు మండలాల్లోని మెట్ట ప్రాంత ప్రజానీకానికి తాగు, సాగునీరు అందించేందుకు ఐదు టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రణాళికలు రూపొందించారు. అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌ను కలిసి మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు జలాశయం నుంచి ఈ మూడు మండలాలతో పాటు అనంతసాగరం మండలంలోని ఉత్తర కాలువ సాగునీరు అందని ఎగువ ప్రాంతాలైన బొమ్మవరం, అగ్రహారం, చాపురాళ్లపల్లి గ్రామాల్లోని సాగునీరు సరఫరా చేసేందుకు రూపొందించిన ఈ హైలెవల్‌ కెనాల్‌ పనులకు రూ. 880 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండు దశల్లో చేయాల్సి ఉండగా నత్తనడకన సాగుతూ ఇప్పటికీ తొలి దశ నిర్మాణం పూర్తి కాకుండానే రెండో ఫేజ్‌ పనుల కోసం టెండర్లు పిలవడం చంద్రబాబు కమీషన్ల కోసమేనని స్థానికులు విమర్శిస్తున్నారు.

నష్టపరిహారం ఆయన చలవే
సోమశిల ప్రాజెక్ట్‌ కోసం వైఎస్సార్‌ జిల్లాలోని మాధవరం మండలంలో ఇళ్లు, భూములు కోల్పోయాం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అరకొరగా నష్టరిహారం ఇవ్వడంతో కోర్టుకు వెళ్లాం. వైఎస్సార్‌ మాతో ప్రత్యేకంగా సమావేశమై నష్ట పరిహారం విషయంలో పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు చెల్లించారు. ఆయన చొరవతోనే మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఆత్మకూరులో స్థిర పడ్డాం. కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు.
– కొప్పోలు చిన్నపు రెడ్డి, రైతు, ఆత్మకూరు, వైఎస్సార్‌ జిల్లా మాధవరం మండలం 

నీటి కోసం ఎదురు చూపులు
సోమశిల ప్రాజెక్టు నీరు ఉత్తర కాలువ ద్వారా సాగి మా గ్రామంలోని చెరువుకు వస్తాయని అప్పట్లో వైఎస్సార్‌ హయాంలో చెప్పారు. ఆ ప్రకారం కాలువ పనులు జరిగాయి. అయితే నాలుగు ఏళ్లుగా ఉత్తర కాలువ పొడిగింపు పనులు హసనాపురం వద్ద నిలిపి వేయటంతో మా గ్రామ చెరువుకు నీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. తీవ్ర కరువు తాండవిస్తుంది. కాలువ పనులు పూర్తి చేసి చెరువుకు సాగు నీరు ఇవ్వాలి.
– చెంచులరెడ్డి, శ్రీ కొలను, ఏఎస్‌ పేట మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement