షుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వవైభవం!  | Kovvuru Sugar Factory Re Open Soon | Sakshi
Sakshi News home page

షుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వవైభవం! 

Published Sat, Jul 6 2019 10:02 AM | Last Updated on Sat, Jul 6 2019 10:03 AM

Kovvuru Sugar Factory Re Open Soon - Sakshi

సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు చక్కెర కర్మాగారంతోపాటు రాష్ట్రంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట, కడప ప్రాంతాల్లో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీల్ని పరిశీలించి నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు చీఫ్‌ ఇంజినీర్‌ ప్రసాద్‌రావు, చీఫ్‌ కెమిస్ట్‌ రవికుమార్, ప్రధాన వ్యవసాయాధికారి కె.వి.రమణ, ఇన్‌చార్జి షుగర్స్‌ ఏడీ తిరుపాలురెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరు చక్కెర కర్మాగారంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాక్టరీలో ఏయే పరికరాలు పనికివస్తాయి.. ఎంత నిధులు అవసరమో పరిశీలించామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు ఏమాత్రం చేస్తున్నారు.. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే వారంతా కోవూరు షుగర్స్‌కు చెరకు సరఫరా చేస్తారా లేదా అనే అంశాలపై చర్చించారు.

చక్కెర కర్మాగార కమిషనర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 6 చక్కెర కర్మాగారాల పరిస్థితి తదితర అంశాలను 6వ తేదీ లోపు పరిశీలించి నివేదిక అందజేస్తామన్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు రైతు నాయకులు, కర్మాగార ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించిన కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీకి మరలా పూర్వవైభవం కల్పించేలా చూడాలని పరిశీలనకు వచ్చిన కమిటీని కోరారు. కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించిన వాటాదారులైన తమతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. ప్రధానంగా ఫ్యాక్టరీ పట్ల రైతులకు నమ్మకం పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని కోరారు. ఇప్పటివరకు కోవూరు చక్కెర కర్మాగారాన్ని నాలుగు సర్వే బృందాలు పరిశీలించి పోయాయన్నారు.

సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలాలు అయ్యాయే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. కర్మాగారాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు ఎంతో మంది అప్పులపాలై విగతజీవులుగా మృతిచెందిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 21 చక్కెర కర్మాగారాలు ఉన్నాయన్నారు. కర్మాగారానికి సంబంధించి వందల కోట్ల రూపాయలు ఉన్నా వాటిని విడుదల చేసి బకాయిలు చెల్లించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. గతంలో రోడ్డు నిర్మాణ సమయంలో కర్మాగారానికి సంబంధించిన స్థలాన్ని బేరం పెట్టుకొని వాటిని అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. రైతులను సంప్రదించకుండా అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. ఫ్యాక్టరీ స్థితిగతుల్ని పరిష్కరించడానికి వచ్చిన సభ్యులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రస్తుతం వరిసాగు రైతులకు ఇబ్బందిగా ఉన్న విధి లేని పక్షంలో వరిసాగు చేయాల్సి వస్తుందన్నారు. 

చెరకు సాగుపై దృష్టి సారించే అవకాశం
కోవూరు చక్కెర కర్మాగారం అందుబాటులోకి వస్తే ఆరుతడి పంట అయిన చెరకు సాగుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. దీనిపై ఆధారపడి 4600 మంది రైతులు ఉన్నారని, 2020 నాటికి అయినా ఫ్యాక్టరీని ప్రారంభించేలా కమిటీ ప్రభుత్వానికి సూచించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9.5 శాతం క్రషింగ్‌ ఉందన్న విషయాన్ని సర్వే బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. రాష్ట్రంలోనే ఈ కర్మాగారానికి ఎంతో ఘన చర్రిత ఉందన్న విషయం కూడా మరచిపోవద్దన్నారు. అనంతరం సర్వే బృందం కర్మాగారం మొత్తాన్ని పరిశీలించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వెంకమరాజు, శ్రీనివాసరావు, నిరంజన్‌రెడ్డి, శ్రీరాములు, డానియల్, ఎంవీ రమణయ్య, శ్రీనివాసులురెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement