మళ్లీ అలిగిన సుందరపు
- సయోధ్య సమావేశంలో విజయ్‌కుమార్‌కు పరాభవం
- వర్గపోరుకు అద్దం పట్టిన నాయకుల పోకడ
అచ్యుతాపురం,న్యూస్‌లైన్ : సుందరపు విజయ్‌కుమార్‌కు సొంతపార్టీలోనే ఘోర పరాభవం ఎదురయింది. తీవ్ర మనస్థాపానికి గురయిన ఆయన సమావేశం మధ్యలోనే అలిగి బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాన్ని అతని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం ఇక్కడి పార్టీకార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ నాయకులు గొంతెన నాగేశ్వరరావు,లాలం భాస్కరరావు, సుందరపు విజయకుమార్, పప్పల చలపతిరావు, ఆడారి తులసీరావులు ఎవరికి వారు తమ వర్గీయులతో గ్రూపులుగా విడిపోయి చర్చించుకోవడం పార్టీలో వర్గపోరుకు అద్దం పట్టింది. విభేదాలను, వెన్నుపోట్లను పక్కనపెట్టి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పంచకర్ల గెలుపు కోసం చర్చించడానికి ఏర్పాటు చేసిన సయోధ్య సమావేశంలో తులసీరావు మాట్లాడుతూ యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను ఒక్కడ్నే రాజకీయం చేశానని చెప్పుకున్నారు.
ఇది సుందరపు విజయ్‌కుమార్‌కు నచ్చలేదు. సమావేశానికి ముందు విజయ్‌కుమార్‌ను పిలవాలని కొందరు కార్యకర్తలు కోరగా, ఆ యువరాజుని ప్రత్యేకంగా పిలవాలేమిటంటూ తులసీరావు ఎగతాళి చే సిమాట్లాడారు. దీనిని మనసులో పెట్టుకుని గుర్రుగా ఉన్న విజయ్‌కుమార్ ఒక్కసారిగా ఆగ్రహం చెంది అంతా మీరే చేసుకుంటే తానెందుకంటూ అలిగి బయటకు వచ్చి కారు ఎక్కారు. ఇంతలో గొంతెన నాగేశ్వరరావు, ఇతర నాయకులు వచ్చి బతిమాలడంతో ఆయన శాంతించారు.
పంచాయతీ,ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకుడ్ని గడ్డిపూచ కంటే హీనంగా చేసి మాట్లాడడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడుకొని వెన్నుపోటుపొడిచిన పార్టీలో సుందరపు ఏ ముఖం పెట్టుకొని ఎందుకు కొనసాగుతున్నారో అంటూ మరికొందరు వాపోయారు. తాను పార్టీలో లేకుంటే ఏమవుతుందో తెలిసొచ్చేలా విజయకుమార్ సత్తాచూపాలని ఆయన అభిమానులు మాట్లాడుకున్నారు. సయోధ్య సమావేశం కాస్తా బల ప్రదర్శనకు వేదిక కావడంతో ఇదేమి పోకడంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.