కాగితాలకే పరిమితం!
⇒ 90 లక్షల మొక్కల పెంపకానికి ప్రతిపాదనలు
⇒ 65,73,305 మొక్కలు పంపిణీ చేసినట్లు లెక్కలు
⇒ ఎక్కడా కనిపించని సామాజిక వనాలు
⇒రూ.కోటికి పైగా వ్యయం
లక్షల్లో మొక్కలు.. కోట్లలో వ్యయం.. ఆర్భాటంగా ప్రచారం. ఆచరణలో మాత్రం అంతా ఎండిన మొక్కలు.. మచ్చుకైనా కనిపించని పచ్చదనం.. లెక్కల్లో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న వనమహోత్సవం కార్యక్రమం తీరిది. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమం అమలు తీరుపై ‘సాక్షి’ ఫోకస్...
విజయవాడ : పచ్చదనాన్ని పెంపొందించాలి.. పర్యావరణాన్ని పరిరక్షించాలి.. మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలి.. మొక్కలను పెంచటమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప ఆచరణలో సఫలం కావడం లేదు. గ్రామ పంచాయతీల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఇటీవల పలు పంచాయతీ కార్యాలయాల గోడల వద్ద ఎండిపోయిన మొక్కలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఎండి పోయిన మొక్కలు దర్శనమిచ్చాయి. పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఫొటోలతో ‘సాక్షి’ ప్రచురిస్తే వెంటనే మేలుకొన్న పంచాయతీ వారు ఎండిన మొక్కలను తీసిపారేశారు. జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మొక్కలు పంచాయతీలకు ఇస్తే అందులో కనీసం రెండు శాతం మొక్కలు కూడా పెరగలేదు. పాఠశాలలకు ఇచ్చిన మొక్కల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
మొక్కలన్నీ కాగితాల్లోనే...
సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరు నెలల క్రితం విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి వద్ద సామాజిక వన విభాగాన్ని నూతనంగా ప్రారంభించారు. నగరాల్లో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ కోటి మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. కనీసం విజయవాడ నగరంలో లక్ష మొక్కలు కూడా పెంచలేని పరిస్థితి నెలకొంది. పోలవరం కుడికాలువకు ఇటీవలి వరకు నీరు వచ్చింది. ప్రస్తుతం నీరు లేకపోవడంతో మొక్కలకు నీరు కూడా అందటం లేదు. అడవుల్లో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకొని మొక్కలు పెంచే కార్యక్రమాన్ని సామాజిక వన విభాగం వారు అటవీ శాఖ సహకారంతో చేపట్టాలి. అయితే మొక్కలు అడవుల్లో నాటుతున్నట్లు కాగితాల్లో తప్ప భూమిపై కనిపించడం లేదు. అడవులను విచక్షణారహితంగా నరికివేస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలను పెంచాల్సిన అటవీ శాఖ, సామాజిక వనవిభాగం ఆ దిశగా పనిచేయటం లేదు. మొక్కల పెంపకాన్ని కాగితాల పైనే చూపుతూ చేతులు దులుపుకుంటున్నాయి తప్ప వాస్తవంగా ఆశించిన మేర ఎక్కడా మొక్కల పెంపకం సాగని పరిస్థితి. క్షేత్రస్థాయిలో మొక్కల పెంపకం, వాటి సంరక్షణ బాధ్యతలను సామాజిక అటవీ శాఖ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
లెక్కల్లో ఇలా...
అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంయుక్తంగా జిల్లాలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. 2014లో పండ్ల తోటల పెంపకం పథకం ద్వారా 500 ఎకరాల్లో మామిడి, నిమ్మ, జామ తోటలు పెంచుతున్నట్లు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వన నర్సరీ పథకం కింద టేకు మొక్కలను పొలాల గట్లపై నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పటమే తప్ప అమలుకు నోచుకోలేదు. పండ్ల తోటల పెంపకానికి ఇప్పటివరకు రూ.50.82 లక్షలు, మహాత్మాగాంధీ వన నర్సరీ కింద రూ.1.87 లక్షలు, టేకు మొక్కలు నాటేందుకు రూ.39.91 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలు, గృహాల ఆవరణల్లో 15,278 మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ప్రణాళిక ఇలా...
2015-16 ఆర్థిక సంవత్సరంలో 180 కిలోమీటర్ల మేర రహదారుల వెంబడి వనాలు, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెరువు భూముల్లో 150 ఎకరాల తుమ్మ వనాలు, వివిధ సంస్థలకు చెందిన 100 ఎకరాల ఖాళీ భూముల్లో వివిధ రకాల మొక్కలు, మరో 169 కిలోమీటర్ల మేర రహదారులపై 50 ఎకరాల్లో సరుగుడు వనాలు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు గాను రూ.3.38 కోట్లు అవసరమని ప్రతిపాదనలు తయారుచేసి కలెక్టర్‌కు పంపగా రూ.1.07 కోట్లకు ఆమోదం లభించింది. 90 లక్షల మొక్కల పెంపకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 65 లక్షల 73 వేల 305 మొక్కలు పంపిణీ చేసినట్లు లెక్కల్లో పేర్కొన్నారు. ఆచరణలో సామాజిక వనాలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. నాటిన మొక్కలకు సంరక్షణ లేకపోవటంతో దాదాపు అన్నీ ఎండిపోయాయి.
లక్ష్యం ఇలా...
⇒అటవీ శాఖ సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో 1983 నుంచి మొక్కల పెంపక కార్యక్రమం జరుగుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా వెదురు, పశుగ్రాసం, పండ్ల తోటలు, వంట చెరకు, చిన్నతరహా కలప మొదలైన వాటిని పెంచి అటవీ భూములపై ఒత్తిడిని తగ్గించాలి.
⇒అటవీ భూమి వెలుపల కూడా హరిత వనాలు పెంచి అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. సుందర వనాల పెంపకంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా పచ్చని వాతావరణాన్ని నెలకొల్పాలి.
⇒ఫలసాయం ఇచ్చే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించి నిరుపేదలకు ఆదాయాన్ని సమకూర్చాలి. పెరిగిన వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి.
⇒పర్యావరణాన్ని పచ్చదనంతో నింపి భూతాపాన్ని తగ్గించాలి. భూమి కోతను అరికట్టాలి. తుపాను గాలులను, వరదలను తట్టుకునేలా సముద్రతీర ప్రాంతంలో రక్షణ కవచాలు (సరుగుడు వనాలు) అభివృద్ధి చేయాలి.