సేవల రంగంలో వెనుకబడ్డాం: చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో సేవల రంగంలో వెనుకబడ్డామని సీఎం చంద్రబాబు చెప్పారు. విభజన కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని సముపార్జించే విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీకి సంబంధించి కేంద్ర నిధులను దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఎక్కువగా వినియోగించుకున్నామని చెప్పారు. అటవీశాఖ ఆదాయ ఆర్జనలో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉందన్నారు. ఎర్రచందనం నిల్వల్ని వేలంలో విక్రయించలేకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. కేంద్రం నుంచి రెవెన్యూలోటు భర్తీ, రాజధాని నిర్మాణం, పోలవరానికి సంబంధించి ఇంకా రూ.3,358.96 కోట్లు రావాల్సివుందని సీఎం తెలిపారు.