
తండ్రిపై దాడి చేస్తున్న కొడుకు
సాక్షి, త్రిపురాంతకం: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి.. వాడు గిట్టనేమి అని ఏనాడో చెప్పాడు వేమన. ప్రకాశం జిల్లాలో మంగళవారం జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. దయలేని పుత్రుడొకడు రెచ్చిపోయాడు. కన్నతండ్రి మీదే కర్ర దూశాడు. పింఛను డబ్బులు ఇస్తావా.. ఛస్తావా అంటూ వెంట పడ్డాడు. వృద్ధుడనే కనికరం లేకుండా విచక్షణా రహితంగా చితక్కొట్టాడు. అడ్డొచ్చిన స్థానికులపైనా వీరంగం సృష్టించాడు.
త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి చెందిన సూదుల సుబ్బయ్య వయసు 75 ఏళ్లు. అతనికి నెలనెలా రూ.2,250 వృద్ధాప్య పింఛను అందుతుంది. మంగళవారం గ్రామంలో పంపిణీ చేసిన పింఛను సొమ్ము తీసుకుని ఇంటి వచ్చాడు. మద్యానికి బానిసైన అతని రెండో కుమారుడు ఈ విషయం గమనించాడు. పింఛను డబ్బులు తనకు ఇవ్వాలంటూ నడి వీధిలో కర్ర తీసుకుని దాడి చేశాడు. ఆర్తనాదాలు చేస్తూ కింద పడిపోయిన సుబ్బయ్యను చూసి చలించిపోయిన స్థానికులు కొడుకును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కర్కోటకుడు వారించబోయిన వారిపైనా మాటల దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక చేష్టలుడిగి చూస్తున్న వృద్ధుడి నుంచి డబ్బు లాగేసుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment