
అమ్మను చూడాలని .. వడి వడిగా వచ్చి..!
► గొడవలతో విడిపోయిన భార్యభర్తలు
► ఇద్దరు పిల్లలను చేరొకరు పంచుకున్న వైనం
► నాన్న వద్ద ఉంటున్నదీపక్‌కు అమ్మను చూడాలని కోరిక
ఇది అభం శుభం తెలియని చిన్నారి ఆవేదన.. కన్నవాళ్లు ఎవరికివారు విడిపోగా తండ్రి పంచన ఉంటూ అమ్మప్రేమను, తమ్ముడి సాంగత్యాన్ని మరొక్కసారి చవిచూడాలని బయలుదేరిన బాలుడి దీన గాథ..
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): తల్లితండ్రుల మధ్య గొడవలు పిల్లల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఈ బుడతడే చక్కటి ఉదాహరణ. ఈ ఫోటోలో బాబు పేరు దీపక్. 10 ఏళ్ల వయస్సు. తండ్రి సాంబ లారీ డ్రైవర్. అమ్మ కృష్ణవేణి. ఇతనికో తమ్ముడున్నాడు. పేరు చైతన్య. తన వయస్స ఏడేళ్లు. వీళ్ల అమ్మానాన్న గొడవ పడేవారు. తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వారు. కేసులు పెట్టుకునే వారు. చివరికి పెద్దల సాక్షిగా విడిపోయారు. అదే పెద్దలు పిల్లలనూ చెరొకరికి పంచారు. దీపక్ నాన్న దగ్గర, అతని తమ్ముడు తల్లి దగ్గర ఉండాలని తీర్మానించారు. ప్రస్తుతం భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు. అయితే.. అన్నదమ్ములు మాత్రం ఒకరిని విడిచి ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా దీపక్‌కు అమ్మను చూడాలనే కోరిక పుట్టి మంగళవారం ఉదయం స్కూలుకు వెళుతున్నానని చెప్పి మంగళగిరిలో ఉంటున్న అమ్మ వద్దకు బయల్దేరాడు.
సగం దూరం వచ్చాక..
సగం దూరం వచ్చాక అమ్మ దగ్గరకు వెళితే నాన్న తిరిగి ఇంటికి రానివ్వడనే భయంతో సందిగ్ధంలో పడి ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరాడు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఆ దారి వెంట వెళ్తున్న ఓలేటి అశోక్ అనే యువకుడు దీపక్‌ను ఆరా తీశాడు. బాలుడు ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడంతో స్థానికంగా నివాసం ఉంటున్న బుజ్జగించి అసలు విషయాన్ని రాబట్టారు. తనకు అమ్మ దగ్గరకు వెళ్లాలని ఉందనీ, తమ్ముడిని చూడాలని ఉందని చెప్పాడు. అయితే నాన్నంటే భయంతో ఇలా బ్యారేజ్ వద్దకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఉపాధ్యాయులు అతని కోరిక ప్రకారం అమ్మ దగ్గరకు చేర్చారు. ఈ కథ ఏ దరికి చేరుతుందో మరి..!