
నాగేంద్రప్రసాద్ అలియాస్ చందు నాటి, నేటి ఫోటో
ప్రకాశం,మార్కాపురం: మా తల్లిదండ్రుల ఆచూకి తెలపాలని ఓ యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని మహిళ తనకు మత్తు మందు ఇచ్చి అపహరించి వరంగల్ రైల్వే స్టేషన్‌లో వదిలి పెట్టి వెళ్లిందని నాగేంద్ర ప్రసాద్ అలియాస్ చందు అనే యువకుడు మంగళవారం మార్కాపురం పోలీసులకు తెలిపాడు. ఈ సంఘటన 2001 డిసెంబరులో జరిగిందని అప్పట్లో రైల్వే స్టేషన్‌లో ఉండే స్థానికులు చేరదీసి వరంగల్‌లోని సాయి అనాథ ఆశ్రమంలో చేర్పించారన్నారు. ప్రస్తుతం తాను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నానని తన గ్రామం గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రుల పేర్లు లక్ష్మిదేవి, కొండయ్య అని తనకు కొంచెం జ్ఞాపకం ఉన్నట్లు తెలిపాడు. తాను అపహరణకు గురైన కొద్ది రోజుల ముందు అప్పట్లో హీరో శ్రీహరి నటించిన భద్రాచలం సినిమా చూశానని చెప్పాడు. తన ఇంటి దగ్గర్లో ఒక వైపు సాయిబాబా గుడి, మరోవైపు సినిమా హాలు ఉన్నట్లు గుర్తుందని చెప్పాడు. తనను గుర్తించి తల్లిదండ్రులు దగ్గరకు తీసుకోవాలని నాగేంద్రప్రసాద్ కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment