కందుకూరు: వ్యసనాలకు బానిసై డబ్బు కోసం కన్నబిడ్డనే ఎత్తుకెళ్లి బెదిరింపులకు దిగాడు ఓ తండ్రి. డబ్బు ఇవ్వకపోతే బిడ్డను చంపి తాను చస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. వారు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రి బారి నుంచి బాలుడిని కాపాడి తల్లికి అప్పగించారు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండె శ్రీనివాసులు ఆ వివరాలు వెల్లడించారు.
చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి, ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న బాలుడు శర్వాన్‌రెడ్డి ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో చెరువుకొమ్ముపాలెం వచ్చి ఇంటి వద్దే ఉండి విధులు (వర్క్ ఫ్రమ్ హోం) నిర్వర్తిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు రామకృష్ణారెడ్డి బానిసయ్యాడు. దాదాపు రూ.20 లక్షలకుపైగా అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేకపోవడంతో డబ్బు కోసం గత నెల 28వ తేదీ తన మూడేళ్ల బాలుడు శర్వాన్‌రెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు.
డబ్బు ఇవ్వకపోతే బాలుడికి మందు పోసి చంపుతానని, తాను కూడా అదే మందు తాగి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు రామకృష్ణారెడ్డి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత నెల 30వ తేదీ పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌లో భార్య ఉమ ఫిర్యాదు చేసింది. ఈ విషయం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కందుకూరు పట్టణంలోనే స్వర్ణ ప్యాలెస్ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. కందుకూరు డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్, పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబు లాడ్జికి చేరుకుని మద్యం తాగి మత్తుగా పడుకుని ఉన్న రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పక్కనే ఉన్న శర్వాన్‌రెడ్డిని తల్లి ఉమకు అప్పగించారు. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment