బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సీఐ రాఘవేంద్ర
గిద్దలూరు: కంభం మండల కేంద్రంలోని కోనేటి వీధిలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం గురువారం కలకలం రేపింది. అంగన్‌వాడీ స్కూల్‌కు వెళ్లిన ఆరేళ్ల తన కుమారుడు కనిపించకుండా పోయాడని తండ్రి కేతు వెంకటరామ్ గిరిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆరు గంటల్లోనే బాలుడిని రక్షించారు. వివరాలు.. కోనేటి వీధికి చెందిన కేతు వెంకటరామ్ గిరిధర్, శ్రావణిలకు ముగ్గురు కుమారులు. దంపతులు పొలం పనులకు వెళ్తూ వారి రెండో కుమారుడు గిరిధర్‌ను స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి పంపించారు. దంపతులు తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి గిరిధర్ ఇంటికి రాకపోవడంతో అక్కడక్కడా వెతికారు. గిరిధర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రులు ఇచ్చిన ఫొటో ఆధారంగా పోలీసులు కంభంలోని అన్ని వీధులను కలియదిరిగారు. ప్రజలను విచారించగా బాలుడు మరో వ్యక్తితో కలిసి బస్టాండ్ సమీపంలో తిరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలుడితో ఉన్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు ఎక్కడకు వెళ్లారనేది తెలుసుకునేందుకు బృందాలుగా ఏర్పడి విచారించారు. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు నుంచి బురుజుపల్లెకు వెళ్లే రోడ్డులో బాలుడిని గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలుడిని సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్‌ఐ మాధవరావు తెలిపారు. తక్కువ సమయంలో కిడ్నాప్ కేసును ఛేదించిన ఎస్‌ఐను సీఐ రాఘవేంద్ర, మండల ప్రజలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment