కందుకూరులోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు
ప్రకాశం ,కందుకూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ప్రకటించ లేదు. ఆరేళ్ల పైబడిన వారు పాఠశాలలకు వెళ్తుంటారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రం ఆరేళ్లలోపు చిన్నారులు మాత్రమే ఉంటారు. వీరికి ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి. పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నాయి గానీ అంగన్‌వాడీ చిన్నారులకు మాత్రం సెలవులు లేవు. దీనిపై ఐసీడీఎస్ అధికారుల వద్ద క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం కాస్తున్న తీవ్ర ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. అయినా కేంద్రాల్లో తప్పకుండా పిల్లలు ఉండాలని ఐసీడీఎస్ అధికారులు కార్యకర్తలపై ఒత్తిడి చేస్తుండటంతో ఇటు తల్లిదండ్రులను ఒప్పించలేక అటు అధికారులకు చెప్పుకోలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల్లో ఇళ్ల చుట్టూ తిరిగి పిల్లలను తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
అంతా గందరగోళం
జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి కింద 2951 ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పని చేసే కార్యకర్త, ఆయాలకు మాత్రం మే నెలలో సెలవులు ప్రకటించారు. అవి కూడా మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆయాకు సెలవులు, 16 నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలకు సెలవులు ప్రకటించారు. కార్యకర్తల డ్యూటీలో ఉన్నప్పుడు చిన్నారులను కార్యకర్తలే ఇళ్లకు వెళ్లి కేంద్రాలకు తీసుకురావాలి. ఆయాలు డ్యూటీలో ఉన్నప్పుడు ఆయాలే పిల్లలను తీసురావాలి. పిల్లలను కేంద్రాలకు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం తయారు చేసి చిన్నారులకు పెట్టాలి. తీవ్ర వడగాడ్పులు, మండుటెండల్లో చిన్నారులను తీసుకొచ్చి భోజనం తయారు చేసి పెట్టాల్సి ఉండగా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలు ఎక్కువ శాతం ఇరుకు గదులు కావడంతో ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు మే నెలలో చేరి పదిహేను రోజులు చొప్పున సెలవులు ప్రకటించారు. కానీ చిన్నారులకు మాత్రం సెలవులు ప్రకటించలేదు. ఎండలకు చిన్నారులను బయటకు పంపించొద్దని ఒక పక్క ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 9 గంటలకు అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులను తీసుకొచ్చి 11 గంటల సమయంలో తిరిగి పిల్లలను ఇళ్లకు పంపించాలంటే ఇబ్బందిగా ఉంది. కార్యకర్తలు, ఆయాలు కొందరు పెద్ద వారు కూడా ఉన్నారు. వారూ ఎండలకు బయటకు రావాలంటే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు సెలవులు ప్రకటించక పోవడంపై తల్లిదండ్రుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఐసీడీఎస్ అధికారులు మాత్రం తప్పకుండా కేంద్రాలను నడిపించాలని తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో చేసేది ఏమీ లేక కార్యకర్తలు తల్లిదండ్రులను బతిమాలి.. బామాలి పిల్లలను కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కార్యకర్తలు, ఆయాలతో పాటు చిన్నారులకు పూర్తిగా వేసవి సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment