గ్రీవెన్స్‌సెల్‌కు పోటెత్తిన అర్జీదారులు | SP Grievance in Vizianagaram | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌సెల్‌కు పోటెత్తిన అర్జీదారులు

Published Tue, Feb 5 2019 8:29 AM | Last Updated on Tue, Feb 5 2019 8:29 AM

SP Grievance in Vizianagaram - Sakshi

వినతులు స్వీకరిస్తున్న అధికారులు

విజయనగరం గంటస్తంభం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు పోటెత్తారు.  జిల్లాలో వివిధ పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు 390 వినతులు సమర్పించారు. దాదాపుగా మూడు నెలలు తర్వాత అధిక సంఖ్యలో అర్జీలు ఈ వారమే వచ్చాయి. కలెక్టర్‌ హరి జవహర్‌లాల్, సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, జేసీ–2 సీతారామారావు, డీఆర్వో జె.వెంకటరావు, ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం అర్జీల్లో 135 వరకు పెన్షన్‌లు మంజూరు, సంబంధిత ధ్రువపత్రాలు జారీ కోసం వచ్చినవి కావడం విశేషం. మిగతా వాటిలో కొన్ని ఇళ్ల స్థలాల కోసం, భూసమస్యలు పరిష్కారం కోసం, రేషన్‌ కార్డులు కోసం, రుణాలు, చేతివృత్తి పరికరాలు మంజూరు తదితర వాటి కోసం వచ్చాయి. అర్జీదారులు సమస్య విన్న అధికారులు వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలిస్తే...
ధాన్యం అమ్మినా బిల్లులు రాక, ధాన్యం కొనే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నామని తెర్లాం మండలం  ఉద్దవోలు గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో కొంతసేపు నినాదాలు చేసి తర్వాత అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కొందరు ధాన్యం అమ్మే పరిస్థితి లేదన్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.
తోటపల్లి ప్రాజెక్టులో తమ గ్రామం పోయిందని, పునరావాసం కింద ఇళ్ల పట్టా ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని బంటువానివలస గ్రామానికి చెందిన మర్రాపు పోలినాయుడు వాపోయారు. అధికారులు ఇమ్మన్నా తహసీల్దారు లంచం అడుతున్నాడని వాపోయారు.
బీసీ కార్పోరేషన్‌ ద్వారా తమకు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ ద్విచక్ర వాహనం ఇవ్వాలని రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన కూరగాయలు రైతులు కోరారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఇచ్చినా తమను ఇవ్వలేదని వాపోయారు.
మధ్యాహ్న భోజనం నాణ్యత లేనిది పెడుతున్నారని విజయనగరం మండలం గొల్లలపేట గ్రామానికి చెందిన గొలగాన వెంకటలక్ష్మి, ఇతరులు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ సరఫరా చేసిన నుంచి తమ పిల్లలకు బడిలో సాంబారు బాగుండడం లేదని, కుళ్లిన గుడ్లు పెడుతున్నారని వాపోయారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
రామవరం గ్రామ రెవెన్యూలో సర్వే నెంబరు 26లో 3.30ఎకరాలు బచ్చెన్న చెరువును బైపాస్‌ రోడ్డు కాంట్రాక్టరు కప్పేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ జైహింద్‌కుమార్‌ ఆధ్వర్యంలో వచ్చిన రైతులు కలెక్టర్‌కు తెలిపారు. అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని వాపోయారు. దీనివల్ల 50 ఎకరాలు సాగు ప్రశ్నార్ధకమవుతుందన్నారు.
గ్రామానికి సమీపంలో ఉన్న సింహాద్రి పవర్‌ప్లాంట్‌ నుంచి వెలువడుతున్న విష కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, రోగాలు వస్తున్నాయని లక్కవరపుకోట మండలం శ్రీరామపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పరిశ్రమ పెట్టేటప్పుడు గ్రామంలో గ్రామసభ పెట్టి తమకు పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని, వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు.

వినతుల పరిష్కారానికి ఆదేశాలు
విజయనగరం, పార్వతీపురం: గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వినతులపై  అధికారులు  సత్వరమే  స్పందించి పరిష్కార ఆమోదయోగ్యమైన సమస్యలను  పరిష్కరించాలని  సంబంధిత  అధికారులను ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ   వ్యయ, ప్రయాసలకోర్చి దూర,  ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలు వినతుల రూపంలో  అందజేస్తారని వాటిని పరిష్కరించాలని తెలిపారు. గ్రీవెన్స్‌లో  పాచిపెంట మండం  మలవలస గ్రామానికి చెందిన  గ్రామస్తుడు  పింఛన్లు, మంచినీటి సౌకర్యం కావాలని వినతులు అందజేశారు. 

కురుపాం  మండలం పి.సందిగూడ గ్రామస్తులు తమ గ్రామంలో పిల్లలు చదువు నిమిత్తం సుమారు 2 కి.మీటర్లు వెళ్లవలసి వస్తుందని, పాఠశాల  మంజూరు చేయాలని కోరారు. కురుపాం మండలం నల్ల మెట్టగూడకు చెందిన గ్రామస్తులు తాగునీటి సోలార్‌ బోరుకు బదులుగా కరెంట్‌తో నీరు అందించవలసినదిగా విన్నవించారు. పాచిపెంట మండలం కెసలి గ్రామానికి సంబంధించిన మహిళా మండలి సభ్యులు పసుపు కుంకుమకు సంబంధించి చెక్కులు రాలేదని చెక్కులు ఇప్పించవలసినదిగా కోరారు. గుమ్మలక్ష్మీపురం మండలం డోకులగూడ  గ్రామస్తులు గ్రామానికి  తారు రోడ్డు మంజూరు చేయాలని విన్నవించారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరికి పంచాయతీ జల్లుగూడ గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని పరిష్కరించాలని కోరారు.    వివిధ శాఖలలో పెండింగ్‌లో వున్న దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని  సంబంధిత శాఖ అధికారులకు ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ సురేష్‌కుమార్, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కిరణ్‌Šకుమార్, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు కుమార్, జీసీసీ  మేనేజర్, సీడీపీఓలు, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, ఉద్యానవన, గృహ నిర్మాణ, వెలుగు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, మత్య్స తదితర శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 12 ఫిర్యాదులు
విజయనగరం టౌన్‌: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ‘ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక’ను జిల్లా పోలీసు కార్యాయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.నర్సింహరావు సోమవారం నిర్వహించారు. గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 12 ఫిర్యాదులను స్వీకరించారు.  ఫిర్యాదులను  ఆయన  స్వయంగా స్వీకరించి, ఫిర్యాదుదారుతో మాట్లాడి, ఫిర్యాదు అంశంను పరిశీంచి, వాటిని పరిష్కరించేందుకు, వాటిపై చర్యలు చేపట్టేందుకు  సంబంధిత పోలీసు అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్‌  బ్రాంచ్‌ సీఐ జి.రామకృష్ణ, వై.వి.శేషు పాల్గొన్నారు.  
తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన రెడ్డి సన్యాసినాయుడు తాను ఎటువంటి రుణం తీసుకోకున్నా గలావల్లి గ్రామానికి చెందిన ఏపీజీవీబీ శాఖ అధికారులు తాను రుణం తీసుకున్నట్టు చెల్లించని కారణంగా తన భూమిని వేలం వేసేందుకు చూస్తున్నారని న్యాయం చేయాలని కోరాడు.
కురుపాం మండలం మొండెంఖల్‌కు చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు ఒడిశాకు చెందిన వ్యక్తితో వివాహం జరగ్గా  ఒక కుమార్తె ఉన్నట్టు తెలిపింది. తన భర్త,  కుటుంబ సభ్యులు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement