SP Grievance
-
గ్రీవెన్స్‌సెల్‌కు పోటెత్తిన అర్జీదారులు
విజయనగరం గంటస్తంభం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలో వివిధ పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు 390 వినతులు సమర్పించారు. దాదాపుగా మూడు నెలలు తర్వాత అధిక సంఖ్యలో అర్జీలు ఈ వారమే వచ్చాయి. కలెక్టర్ హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, జేసీ–2 సీతారామారావు, డీఆర్వో జె.వెంకటరావు, ఐసీడీఎస్ పీడీ పద్మావతి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం అర్జీల్లో 135 వరకు పెన్షన్లు మంజూరు, సంబంధిత ధ్రువపత్రాలు జారీ కోసం వచ్చినవి కావడం విశేషం. మిగతా వాటిలో కొన్ని ఇళ్ల స్థలాల కోసం, భూసమస్యలు పరిష్కారం కోసం, రేషన్ కార్డులు కోసం, రుణాలు, చేతివృత్తి పరికరాలు మంజూరు తదితర వాటి కోసం వచ్చాయి. అర్జీదారులు సమస్య విన్న అధికారులు వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలిస్తే... ♦ ధాన్యం అమ్మినా బిల్లులు రాక, ధాన్యం కొనే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నామని తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో కొంతసేపు నినాదాలు చేసి తర్వాత అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కొందరు ధాన్యం అమ్మే పరిస్థితి లేదన్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ♦ తోటపల్లి ప్రాజెక్టులో తమ గ్రామం పోయిందని, పునరావాసం కింద ఇళ్ల పట్టా ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని బంటువానివలస గ్రామానికి చెందిన మర్రాపు పోలినాయుడు వాపోయారు. అధికారులు ఇమ్మన్నా తహసీల్దారు లంచం అడుతున్నాడని వాపోయారు. ♦ బీసీ కార్పోరేషన్ ద్వారా తమకు టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనం ఇవ్వాలని రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన కూరగాయలు రైతులు కోరారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఇచ్చినా తమను ఇవ్వలేదని వాపోయారు. ♦ మధ్యాహ్న భోజనం నాణ్యత లేనిది పెడుతున్నారని విజయనగరం మండలం గొల్లలపేట గ్రామానికి చెందిన గొలగాన వెంకటలక్ష్మి, ఇతరులు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ సరఫరా చేసిన నుంచి తమ పిల్లలకు బడిలో సాంబారు బాగుండడం లేదని, కుళ్లిన గుడ్లు పెడుతున్నారని వాపోయారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ♦ రామవరం గ్రామ రెవెన్యూలో సర్వే నెంబరు 26లో 3.30ఎకరాలు బచ్చెన్న చెరువును బైపాస్ రోడ్డు కాంట్రాక్టరు కప్పేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ జైహింద్‌కుమార్ ఆధ్వర్యంలో వచ్చిన రైతులు కలెక్టర్‌కు తెలిపారు. అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని వాపోయారు. దీనివల్ల 50 ఎకరాలు సాగు ప్రశ్నార్ధకమవుతుందన్నారు. ♦ గ్రామానికి సమీపంలో ఉన్న సింహాద్రి పవర్‌ప్లాంట్ నుంచి వెలువడుతున్న విష కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, రోగాలు వస్తున్నాయని లక్కవరపుకోట మండలం శ్రీరామపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పరిశ్రమ పెట్టేటప్పుడు గ్రామంలో గ్రామసభ పెట్టి తమకు పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని, వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. వినతుల పరిష్కారానికి ఆదేశాలు విజయనగరం, పార్వతీపురం: గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వినతులపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కార ఆమోదయోగ్యమైన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వ్యయ, ప్రయాసలకోర్చి దూర, ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలు వినతుల రూపంలో అందజేస్తారని వాటిని పరిష్కరించాలని తెలిపారు. గ్రీవెన్స్‌లో పాచిపెంట మండం మలవలస గ్రామానికి చెందిన గ్రామస్తుడు పింఛన్లు, మంచినీటి సౌకర్యం కావాలని వినతులు అందజేశారు. కురుపాం మండలం పి.సందిగూడ గ్రామస్తులు తమ గ్రామంలో పిల్లలు చదువు నిమిత్తం సుమారు 2 కి.మీటర్లు వెళ్లవలసి వస్తుందని, పాఠశాల మంజూరు చేయాలని కోరారు. కురుపాం మండలం నల్ల మెట్టగూడకు చెందిన గ్రామస్తులు తాగునీటి సోలార్ బోరుకు బదులుగా కరెంట్‌తో నీరు అందించవలసినదిగా విన్నవించారు. పాచిపెంట మండలం కెసలి గ్రామానికి సంబంధించిన మహిళా మండలి సభ్యులు పసుపు కుంకుమకు సంబంధించి చెక్కులు రాలేదని చెక్కులు ఇప్పించవలసినదిగా కోరారు. గుమ్మలక్ష్మీపురం మండలం డోకులగూడ గ్రామస్తులు గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయాలని విన్నవించారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరికి పంచాయతీ జల్లుగూడ గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని పరిష్కరించాలని కోరారు. వివిధ శాఖలలో పెండింగ్‌లో వున్న దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ సురేష్‌కుమార్, ట్రైబుల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్Šకుమార్, ట్రైబుల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కుమార్, జీసీసీ మేనేజర్, సీడీపీఓలు, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, ఉద్యానవన, గృహ నిర్మాణ, వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మత్య్స తదితర శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్‌కు 12 ఫిర్యాదులు విజయనగరం టౌన్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ‘ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక’ను జిల్లా పోలీసు కార్యాయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.నర్సింహరావు సోమవారం నిర్వహించారు. గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 12 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించి, ఫిర్యాదుదారుతో మాట్లాడి, ఫిర్యాదు అంశంను పరిశీంచి, వాటిని పరిష్కరించేందుకు, వాటిపై చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, వై.వి.శేషు పాల్గొన్నారు. ♦ తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన రెడ్డి సన్యాసినాయుడు తాను ఎటువంటి రుణం తీసుకోకున్నా గలావల్లి గ్రామానికి చెందిన ఏపీజీవీబీ శాఖ అధికారులు తాను రుణం తీసుకున్నట్టు చెల్లించని కారణంగా తన భూమిని వేలం వేసేందుకు చూస్తున్నారని న్యాయం చేయాలని కోరాడు. ♦ కురుపాం మండలం మొండెంఖల్‌కు చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు ఒడిశాకు చెందిన వ్యక్తితో వివాహం జరగ్గా ఒక కుమార్తె ఉన్నట్టు తెలిపింది. తన భర్త, కుటుంబ సభ్యులు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు, న్యాయం చేయాల్సిందిగా కోరారు. -
వ్యసనాలకు బానిసై వేధిస్తున్నారు
గుంటూరు: జిల్లా నలుమూలల నుంచి పలువురు బాధితులు సోమవారం తమతమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని సన్నిహితం కేంద్రంలో జరిగిన రూరల్ ఎస్పీ గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి క్రైమ్స్ ఏఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదులు స్వీకరించారు. 30కు పైగా అందిన ఫిర్యాదుల వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ వివాదాల్లో పోలీసుల ప్రమేయం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బాధితులకు చెప్పారు. అలాంటి సమస్యలను గ్రామ పెద్దలు, కోర్టును ఆశ్రయించి మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. సమస్యల్లో కొన్ని వారి మాటల్లోనే... వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడు పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన పోసాని కళ్యాణ చక్రవర్తితో గతేడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో కులాంతర వివాహం జరిగింది. కొద్ది రోజుల పాటు మా కాపురం సజావుగా సాగింది. నా భర్తకు వ్యసనాలు ఉన్న విషయం ఒక్కొక్కటీ బయటపడుతుండటంతో నిలదీశాను. దీంతో మద్యం తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. విషయాన్ని మా అత్తకు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. నన్ను బలవంతంగా నవంబరు 10న నా పుట్టింట్లో దించేసి వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. నాభర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి మా కాపురం చక్కదిద్దాలి. –ఎం.లక్ష్మి శ్రీదేవి, నాజర్‌పేట, తెనాలి వివాహేతర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడు 2004లో సంకూరి రాజశేఖర్ అలియాస్ స్లీవరాజుతో వివాహం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొన్నేళ్లపాటు సజావుగానే కాపురం చేశాడు. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, నిత్యం మద్యం తాగుతున్నాడు. విషయం తెలిసి నిలదీస్తే నన్ను పుట్టింటికి పంపించాడు.నా భర్తలో మార్పు వస్తుందనే ఆశతో కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాను. రెండు రోజుల క్రితం మా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మను కొట్టాడు. విచారించి న్యాయం చేయాలి. –ఎస్.నాగమల్లేశ్వరి, మన్నవ, పొన్నూరు మండలం గ్యాస్ లీక్ చేసి చంపేస్తానంటున్నాడు నా భర్త పిచ్చియ్య వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడు. తరచూ డబ్బు కావాలని, పుట్టింటికి వెళ్ళి తీసుకురావాలని హింసిస్తున్నాడు. లేకుంటే గ్యాస్ లీక్ చేసి హతమార్చుతానని బెదిరిస్తున్నాడు. నా భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి నాకు, నా పిల్లలకు రక్షణ కల్పించాలి.–టి.దుర్గ, మాచర్ల ఏడాది దాటినా నా కుమారుడి ఆచూకీ గుర్తించలేదు నా కుమారుడు నూర్ అహమ్మద్ తెనాలిలో బంగారం పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత ఏడాది అక్టోబర్‌లో తెనాలి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. నా కోడలు మున్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నా కుమారుడి అదృశ్యానికి మున్నా, నా కోడలు కారణమని తెలిసింది. విచారించి నాకుమారుడిని నాకు అప్పగించి న్యాయం చేయాలి. –షేక్ అల్లాభక్షు, షరాఫ్బజారు, పొన్నూరు మొక్కజొన్న డబ్బు ఇవ్వడం లేదు నేను 2013 నుంచి సాయిలక్ష్మి ట్రేడర్స్ ద్వారా వ్యాపారం చేస్తున్నా. చెన్నైకు చెందిన శక్తి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ కంపెనీ వారికి రూ.2.50 కోట్ల విలువైన మొక్కజొన్న విత్తనాలను విక్రయించాను. ఇప్పటివరకు వారు డబ్బు ఇవ్వ లేదు. వారు ఇచ్చిన చెక్కులు కూడా చెల్లలేదు. విచారించి న్యాయం చేయాలి. –కె.శేషగిరిరావు, తెనాలి నా భర్త మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలి పొలం పనుల నిమిత్తం నా భర్త స్వామిని ఈనెల 16న బలవంతంగా ఎర్రబాబు పొలం పనులకు తీసుకువెళ్లాడు. రెండు రోజుల వరకు తిరిగి రాలేదు. తీరా చూస్తే నా భర్త పొలంలో శవమై కనిపించాడు. ఎర్రబాబును నిలదీస్తే చేతనైంది చేస్కోమని బెదిరించాడు. నా భర్త మృతి మిస్టరీని ఛేదించేందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేసి దోషులను శిక్షించాలి.–బి.వజ్రమ్మ, మునగోడు, అమరావతి మండలం నిఘా నేత్రాల ప్రాముఖ్యత గుర్తించాలి: అర్బన్ ఎస్పీ గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో నిఘా నేత్రాలుగా పిలుస్తున్న సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సోమవారం విలేకరులకు తెలిపారు. సమాజ రక్షణ, మహిళల భద్రత, నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలు పోలీస్‌శాఖకు సహకరించాలని చెప్పారు. ప్రజా భద్రత చట్టం–2013 ప్రకారం వందమంది, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలు, వ్యాపార కూడళ్లు, కాలనీలు, అపార్టుమెంట్లు, కళాశాలలు, స్కూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు లాంటి ప్రాంతాల్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సీసీ కెమెరాలు ఉంటే దర్యాప్తునకు కీలకంగా ఉపకరిస్తాయని చెప్పారు. -
వృద్ధులను వేధిస్తే చర్యలు
లక్ష్మీపురం(గుంటూరు): తల్లిదండ్రులను వేధిం చడం, ఆస్తి ఇవ్వాలని దాడులకు పాల్పడితే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావు హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వాటిలో కొన్ని ఫిర్యాదులను పరిశీలిస్తే.. డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నారు బ్రిక్స్ వ్యాపారం చేసుకుంటూ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటా. కొరిటిపాడుకు చెందిన పిల్లి నాగేశ్వరరావు నాతో ఏడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆరు నెలల కిందట ఓ చిన్నపాటి వివాదంలో నాపై తప్పుడు నింద వేయడంతో పెద్దల సమక్షంలో మాట రాకుండా ఉండేందుకు వేరే వర్గీయులకు నగదు చెల్లించాను. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని నాగేశ్వరరావుకు కూడా తాను రూ.20లక్షలు వరకు అప్పుగా ఉన్నానని చెప్పి నిత్యం వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి నాగేశ్వరరావు తమ్ముడు మరి కొంత మందిని ఇంటికి తీసుకు వచ్చి రూ.20లక్షలు ఇవ్వాలని లేని పక్షంలోహతమార్చుతామని బెదిరింపులకు దిగాడు. నేను నాగేశ్వరరావుకు డబ్బు ఇవ్వాల్సిన పని లేక పోయినప్పటికి నా నుంచి నగదు బలవంతంగా తీసుకునే యత్నం చేస్తున్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశా. కలిశెటి మోహన్‌రావు, ఆర్టీసీ కాలనీఉద్యోగం పేరుతో టోకరా నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసి గుంటూరులో ముఠా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. గత నెల ఓ పత్రికలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రకటన చూసి ఆ వ్యక్తికి ఫోన్ చేశాను. విజయవాడ ఎనికేపాడులో హెచ్‌పీఎల్‌లో ఉద్యోగం ఉందని కార్యాలయానికి రమ్మన్నారు. అక్కడ కాదని ఏలూరు తంగెళమూడి వద్ద ఉన్న కార్యాలయానికి రమ్మని చెప్పారు. వెళితే దరఖాస్తుకు రూ.6వేలు, ఉద్యోగం వచ్చిన తర్వాత రూమ్‌లో ఉండేందుకు రూ.14వేలు చెల్లించాల్సిందిగా చెప్పారు. దీంతో నగదు కట్టిన తర్వాత అక్టోబర్ ఒకటిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అనుమానం వచ్చి హెచ్పీఎల్ కంపెనీలో విచారణ జరిపితే ఎలాంటి ఉద్యోగాలు లేవని చెప్పారు. దిక్కుతోచక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాను.–నాగేంద్రరెడ్డి, సంగడిగుంట తమ్ముడు.. ఇంటినికాజేయాలని చూస్తున్నాడు పట్టాభిపురంలోని జార్జీ పేటలో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. తాము ఉన్న రేకుల ఇల్లు కారడంతో రేకులను తొలిగించి నూతన ఇంటి నిర్మాణానికి సిద్ధం అయ్యాం. అయితే సొంత తమ్ముడు వీరాస్వామి స్థలం తనదంటూ తమ్ముడు, అతని భార్య, కుమారుడు నిత్యం వేధింపులకు దిగుతూ బెదిరిస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చాను. –ఎం.నాగేంద్రం, తిరుపతి, తల్లి, కూతూరు -
పెన్షన్ కోసం వెళితే కారుందని ఇవ్వడం లేదు
నెల్లూరు : పెన్షన్ కోసం వెళితే తన పేరుతో కారుందని.. పెన్షన్ రాదని చెప్పారని, కారులేదని సర్టిఫికెట్ తెచ్చుకుంటే పెన్షన్ ఇస్తామని చెప్పడంతో ఏడాదిన్నరగా బాధితుడు తనకు కారు లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వివరాలు.. కొడవలూరు మండలం కొత్తవంగల్లు పంచాయతీ బ్రహ్మారెడ్డిపాలేనికి చెందిన జాన శ్రీనివాసులు కల్లుగీత కార్మికుడు. గీత పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెకు వివాహం చేశాడు. కుమారుడిని చదివించుకుంటున్నాడు. వయస్సు పైబడడంతో కల్లు గీసేందుకు ఆరోగ్యం సహకరించక వృత్తిని మానేశాడు. ఏడాదిన్నర క్రితం కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని దరఖాస్తును పరిశీలించిన అధికారులు కారు యజమానివి నీకు పెన్షన్ రాదని అతనికి చెప్పారు. కారు ఏంటి సారూ నాకు కనీసం ద్విచక్రవాహనం కూడా లేదని చెప్పినా పట్టించుకోకుండా కారు లేనట్లుగా సర్టిఫికెట్ తీసుకువస్తే పెన్షన్ విషయం పరిశీలిస్తామని చెప్పారు. దీంతో బాధితుడు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ విచారించగా అతని పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయి ఉందని, అందుకు సంబంధించిన జెరాక్స్ కాపీని అతనికి ఇచ్చారు. దీంతో శ్రీనివాసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఇది ఎలా జరిగిందని అతను ఆర్టీఓ కార్యాలయం అధికారులను అడగగా వారం రోజుల్లో పరిశీలించి తగిన న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతనిని పట్టించుకోవడం మానేరు. గ్రీవెన్స్ చుట్టూ.. కారు విషయం నుంచి ఎలాగైనా బయటపడి పెన్షన్ సాధించుకోవాలని ఏడాదిన్నరగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తొలుత శ్రీనివాసులు కలెక్టర్ గ్రీవెన్స్‌లో అధికారులకు అర్జీలు ఇచ్చాడు. వారు ఆర్టీఓ కార్యాలయం అధికారులకే సిఫార్సు చేయడంతో అక్కడకు వెళ్లినా అతనికి పని జరగలేదు. పోలీసు గ్రీవెన్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సైతం అతనిని ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాలని సమాధానం చెప్పారు. అయితే ఆర్టీఓ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగదని భావించిన శ్రీనివాసులు చివరకు సోమవారం ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదు చేసేందుకు పోలీసు కార్యాలయానికి వచ్చాడు. అక్కడున్న సిబ్బంది అతనిని ఇది తమ పరిధిలోది కాదని ఆర్టీఓ కార్యాలయంలోనే తేల్చుకోవాలని చెప్పడంతో చెమ్మగిల్లిన కళ్లతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగాడు. అసలు కారు ఎక్కడుంది? శ్రీనివాసులుకు కారుందని సర్టిఫికెట్లలో ఉంది. అయితే శ్రీనివాసులు వద్ద కారు లేదు. మరి 2015 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీనివాసులు పేరుతో కారు రిజిస్ట్రేషన్ చేసినట్లు సర్టిఫికెట్లో ఉంది. మరీ ఆ కారు ఏమైంది. అసలు శ్రీనివాసులు పేరుపై ఎవరు కారు రిజిస్ట్రేషన్ చేశారు? శ్రీనివాసులు లేకుండానే అతని కారుపై ఆర్టీఓ కార్యాలయం అధికారులు ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు? అన్న వాటిపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
హవ్వ..ఇది విన్నారా?
ఒంగోలు అర్బన్: జిల్లా అధికారులు ఆశ్చర్యపోయే లెక్కలు చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్ సమస్యలు ఇప్పటి వరకూ 98 శాతం పరిష్కరించామని అధికారిక లెక్కలు చెబుతుండటంపై విస్మయం కలిగిస్తోంది. ప్రజల సమస్యలు, అవసరాల కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో జిల్లా ప్రజలు ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు హాజరవుతున్నారు. సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించి మీకోసం కార్యక్రమానికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. అన్నీ శాఖల జిల్లా అధికారులు అక్కడే ఉంటారని, సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇలా అన్నీ వర్గాల ప్రజలు జిల్లా నలుమూలల నుంచి వస్తుంటారు. మీకోసంలో ప్రజలు ఇచ్చే అర్జీలకు సంబంధించి ఫిర్యాదులన్నీ క్షేత్రస్థాయిలో పరిష్కారం అవుతున్నాయా..అనేది అనుమానామే. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం లో రెండో సారి, మూడో సారి అర్జీలు ఇస్తున్నామని బాధితులు ప్రత్యక్షంగానే తెలుపుతున్నారు. దీని ఆధారంగా ప్రజా ఫిర్యాదులు ఏ స్థాయిలో పరిష్కారం అవుతున్నాయో అర్థమవుతోంది. ఇవీ.. అధికారుల లెక్కలు 2014 నుంచి గ్రీవెన్స్‌కు అందిన 47008 ప్రజా ఫిర్యాదుల్లో 46498 సమస్యలు పరిష్కరించి 98.92 శాతం పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ నాలుగేళ్లలో పరిష్కరించాల్సినవి కేవలం 510 మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కల వరకు బాగానే ఉన్నా ఫిర్యాదుల పరిష్కారం మాత్రం కాగితాలకే పరిమితమవుతోంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదనేది గ్రీవెన్స్‌లో పదేపదే ఒకే సమస్యపై వచ్చే బాధితులను చూస్తే అర్థమవుతోంది. మీకోసంలో వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలు, ఆన్లైన్ తప్పిదాలు, అక్రమాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇళ్లు, ఫించన్ల కోసం జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు మీకోసంలో అర్జీలు సమర్పిస్తుంటారు. పలు సందర్భాల్లో తమ సమస్యలు తీరలేదని ఆత్మహత్యాయత్నాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. మీకోసంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ ఇలా ముఖ్య అధికారులకు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖ జిల్లా అధికారి లేక ఇతర అధికారులకు సమస్యను తెలిపి పరిష్కరించాలంటున్నారే తప్ప ఆ సమస్యలు ఆయా మండలాల వారీగా, గ్రామాల వారీగా నిజంగానే పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అలసిపోయిన ప్రజలు మిన్నకుండిపోతున్నారు. కేవలం సంబంధిత అధికారులకు సమస్యలను చేరవేసి పరిష్కారం అవుతున్నాయని లెక్కలు చూపడంపై విమర్శలున్నాయి. ఇప్పటికైనా మీకోసంకు వచ్చే సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపి క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యల పరిష్కారాలపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ పారదర్శకంగా చిత్తశుద్ధితో చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
ఆస్తి కోసం కొడుతున్నాడు..
నెల్లూరు(క్రైమ్): ‘నా భర్త నుంచి నాకు, నా బిడ్డ ప్రాణాలకు రక్షణ కల్పించండి. భర్త, అత్తింటి వారు వేధిస్తున్నారు. కుమార్తెను మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఆస్తి కోసం కుమారుడు హింసిస్తున్నాడు’.. ఇలా ఒక్కొకక్కరిది ఒక్కో కన్నీటి గా ద. తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు కన్నీటి పర్యంతంగా పోలీసు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తమ కన్నీటి కష్టాలను చెప్పుకున్నారు. వారు వాటిని పరిశీలించి బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా, సీసీఎస్, ట్రాఫిక్ డీఎస్పీలు పి. శ్రీధర్, ఎం.బాలసుందరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అత్తింటివారిపై చర్యలు తీసుకోండి నా తల్లిదండ్రులు చేనేత పనులు చేసి నన్ను కష్టపడి చదివించారు. నా కుటుంబ సభ్యులు మా పక్కింట్లో నివాసముంటున్న సుజాత తమ్ముడు సాయికుమార్‌తో 2014లో వివాహం చేశారు. ఆ సమయంలో సాయికుమార్, అతని అక్కలు నన్ను చదివిస్తానని నమ్మబలికారు. వివాహమైన రెండు నెలలు బాగా చూసుకున్నారు. అనంతరం నా భర్త, అత్త ఇద్దరు కలిసి నన్ను అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇతరులతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి వే«ధించి.. ఇంట్లో నుంచి తరిమేశారు. విచారించి న్యాయం చేయండి. – బి.మాధవిఅలియాస్ సుప్రజ, వెంకటగిరి ఆస్తి కోసం కొడుతున్నాడు నా కుమారుడు ప్రసాద్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్తిలో అధిక శాతం నా కుమారుడికి ఇచ్చాము. నేను, నా భర్త ఉండేందుకు ఇంటిని, కొంత పొలాని ఉంచుకున్నాం. అయితే ఆస్తిని తన పేరుపై రాసివ్వాలని కుమారుడు చిత్రహింసలు పెడుతున్నాడు. ఇటీవల కొట్టడంతో కాళ్లు వి రిగాయి. కుమారుడి చేష్టలపై దగదర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు పట్టించుకోలేదు. కుమారుడి బారి నుంచి నాకు రక్షణ కల్పించండి.– చల్లా సుబ్బమ్మ, ఉప్పలపాడు,దగదర్తి మండలం కుమార్తె ఆచూకీ తెలియచేయండి నా కుమార్తె జయలక్ష్మిని మా ప్రాంతానికి చెందిన జీవన్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అతనికి ఇది వరకే వివాహమై పిల్లలు ఉన్నారు. గత నెలలో నా కుమార్తెను తీసుకెళ్లిపోయాడు. నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని మందలించి నా కుమార్తెను మే 21న నా ఇంటికి పంపారు. ఆ మరుసటి రోజే జీవన్ మళ్లీ నా కుమార్తెను తీసుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేశా పట్టించుకోవడం లేదు. విచారించి నా కుమార్తె ఆచూకీ తెలియచేయండి. – ఎం. చంద్రిక,మైపాడుగేటు, నెల్లూరు మా ప్రాణాలకు రక్షణ కల్పించండి నాకు నా భర్త అహ్మద్‌బాషాకు విభేదాలు రావడంతో నన్ను తీవ్రంగా కొట్టాడు. అతని వేధింపులు తాళలేక చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నా భర్తపై కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా నా భర్తతో విడిపోయి కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గత కొంతకాలంగా నా భర్త అర్ధరాత్రి వేళల్లో ఇంటికి వచ్చి నన్ను, నా కుమార్తెను తీవ్రంగా కొడుతున్నాడు.. నన్ను, నా కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతని బారి నుంచి మా ప్రాణాలకు రక్షణ కల్పించండి. – ఎస్కే యాస్మిన్, మన్సూర్‌నగర్, నెల్లూరు -
ఇంటి నుంచి గెంటేశాడు
కర్నూలు: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను భర్త ఇంటి నుంచి గెంటేశాడని డోన్ పట్టణం చిగురుమానుపేటకు చెందిన సరోజమ్మ ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. వదిలించుకోవాలనే ఉద్దేశంతో చాలాకాలంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆధారం లేదని, విచారణ జరిపించి న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 91211 01200 నంబర్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను నోట్ చేసుకున్నారు. తర్వాత నేరుగా వచ్చి కలసిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 56 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ♦ తాను వరి ధాన్యం కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని, కొత్తపల్లి, నంద్యాలకు చెందిన 63 మంది రైతుల నుంచి 12,500 బస్తాల వరి ధాన్యం కోటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అనే దళారులు కొనుగోలు చేసి చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని కొత్తపల్లె గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. 9 నెలల నుంచి డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, విచారణ జరిపించి ధాన్యం డబ్బులు ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. ♦ తన నలుగురు కుమార్తెలకు పెళ్లి చేయడానికి ఇంటిని అమ్మకానికి పెడుతుంటే ఇంటి పక్కనున్న వ్యక్తి అడ్డు పడుతున్నాడని కల్లూరు మండలం షరీఫ్‌నగర్‌కు చెందిన జగదీష్ ఫిర్యాదు చేశారు. అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఇంటి అమ్మకాన్ని అడ్డుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ♦ నిర్మల గ్యాస్ ఏజెన్సీ వారు రూ.2 లక్షలకు చెక్కు ఇచ్చారని, బ్యాంకుకు వెళ్తే అది చెల్లడం లేదని ఖండేరి వీధికి చెందిన శ్యామలమ్మ ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఆమె కోరారు. ♦ వృద్ధాప్యంలో ఉన్న తమ పోషణ గురించి కుమారుడు పట్టించుకోవడం లేదని కర్నూలు శ్రీకృష్ణ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు వినాయకరావు, పద్మావతి ఫిర్యాదు చేశారు. కుమారుడు టైలరింగ్ పనిచేస్తున్నప్పటికీ ఇంటి ఖర్చులకు ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వృద్ధురాలైన తన భార్య పద్మావతి మూర్చ వ్యాధితో బాధ పడుతోందని, చిన్నచిన్న విషయాలకు ఇంట్లో గొడవ పడి కూతురితో పాటు తనను కుమారుడు కొట్టి గాయపరుస్తున్నాడని వినాయకరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ♦ బేతంచర్ల మండలం ముద్దవరం, సి.బెళగల్ మండలం బురాన్‌దొడ్డి గ్రామాల పరిధిలో కొంతమంది వ్యక్తులు నాటుసారా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారని, విచారణ జరిపించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. ♦ డయల్ యువర్ ఎస్పీ ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గోపీనాథ్ జట్టి హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలి, ఓఎస్డీ రవిప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు పవన్‌కిషోర్, దివాకర్‌రెడ్డి తదితరులు ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు. -
పోలీసులే వేధిస్తున్నారు.. రక్షించండి
గుంటూరు : జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. డీసీఆర్బీ డీఎస్పీ డి.ప్రసాద్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సివిల్ వివాదాల్లో పోలీసుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సివిల్ వివాదాలు న్యాయస్థానాల్లో మాత్రమే తేల్చుకోవాలని సూచించారు. సమస్యలు కొన్ని బాధితుల మాటల్లోనే... ఎస్సై నుంచి రక్షణ కల్పించండి.. మా ప్రాంతానికి చెందిన వెంగమ్మ వద్ద అప్పుగా రూ.1.80 లక్షలు తీసుకున్నాను. చెల్లించడంలో కొంత జాప్యం జరిగింది. పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తాను రూ.6 లక్షలు అప్పు ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదు చేసింది. గుండె జబ్బుతో బాధపడుతున్న నేను సమస్యను పోలీసులకు తెలియజేసినా, కొంత సమయం కావాలని కోరినా వినిపించుకోలేదు. పైగా ఎస్సై నన్ను దుర్భాషలాడి కొట్టి పంపించాడు. నా కుమారుడిని కూడా తరచూ స్టేషన్‌కు పిలిపించి డబ్బు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎస్సై నుంచి నాకు, నా కుమారుడికి రక్షణ కల్పించాలి. – బాదినేడు వెంకటేశ్వరరావు, రాజేష్, తండ్రి కొడుకులు, లక్ష్మీనగర్, గుంటూరు నా కొడుకు ఆచూకీ తెలపండి.. రెండేళ్ళ క్రితం నా కుమారుడు ఆంజనేయులు కుటుంబంతో కలిసి గోవాలో పనులు చేసుకునేందుకు వెళ్ళాడు. తరచూ ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుపుతూ ఉండేవాడు. కొద్దికాలంగా ఫోన్ చేసినా వేరే వ్యక్తులు మాట్లాడుతున్నారు. నాకు పలు అనుమానాలు వస్తున్నాయి. నా కుమారుడి ఆచూకీ గుర్తించి న్యాయం చేయాలి. – ఎ.పద్మ, అశోక్‌నగర్, గుంటూరు ఉద్యోగం పేరుతో మోసగించారు.. గుంటూరు : ఉద్యోగం పేరుతో మోసపోయమంటూ బాధితులు రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలను విన్నవించారు. బాధితులకు న్యాయం జరిగేల చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..
భర్త పేచీ.. పోలీసుల కౌన్సెలింగ్‌తో రాజీ బుచ్చిరెడ్డిపాళెం : ఆడపిల్ల పుట్టిందని భార్యతో పేచీ పెట్టుకుని వేధిస్తున్న భర్తకు పోలీసులు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలు.. మినగల్లుకు చెంది న పెంచలయ్య కుమార్తె సునీతకు సంగం మండలం పడమటిపాళేనికి చెందిన మస్తాన్‌బాబుతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల క్రితం ఈశ్వర్‌తేజ అనే కుమార్తె పుట్టింది. మళ్లీ రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. 6 నెలలు గడిచిన మస్తాన్‌బాబు కుమార్తెను చూసేందుకు వెళ్లలేదు. పెద్ద కుమార్తె తన వద్ద ఉంటుందని, రెండో పాపతో రావద్దని భర్త చెబుతున్నాడని సునీత ఎస్పీ గ్రీవెన్స్‌లో సోమవారం పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి సునీత దంపతులకు సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో దంపతులిద్దరూ రాజీపడ్డారు.