బాధితుల సమస్యలు వింటున్న ఏఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు
గుంటూరు: జిల్లా నలుమూలల నుంచి పలువురు బాధితులు సోమవారం తమతమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని సన్నిహితం కేంద్రంలో జరిగిన రూరల్ ఎస్పీ గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి క్రైమ్స్ ఏఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదులు స్వీకరించారు. 30కు పైగా అందిన ఫిర్యాదుల వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ వివాదాల్లో పోలీసుల ప్రమేయం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బాధితులకు చెప్పారు. అలాంటి సమస్యలను గ్రామ పెద్దలు, కోర్టును ఆశ్రయించి మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. సమస్యల్లో కొన్ని వారి మాటల్లోనే...
వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడు
పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన పోసాని కళ్యాణ చక్రవర్తితో గతేడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో కులాంతర వివాహం జరిగింది. కొద్ది రోజుల పాటు మా కాపురం సజావుగా సాగింది. నా భర్తకు వ్యసనాలు ఉన్న విషయం ఒక్కొక్కటీ బయటపడుతుండటంతో నిలదీశాను. దీంతో మద్యం తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. విషయాన్ని మా అత్తకు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. నన్ను బలవంతంగా నవంబరు 10న నా పుట్టింట్లో దించేసి వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. నాభర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి మా కాపురం చక్కదిద్దాలి. –ఎం.లక్ష్మి శ్రీదేవి, నాజర్‌పేట, తెనాలి
వివాహేతర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడు
2004లో సంకూరి రాజశేఖర్ అలియాస్ స్లీవరాజుతో వివాహం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొన్నేళ్లపాటు సజావుగానే కాపురం చేశాడు. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, నిత్యం మద్యం తాగుతున్నాడు. విషయం తెలిసి నిలదీస్తే నన్ను పుట్టింటికి పంపించాడు.నా భర్తలో మార్పు వస్తుందనే ఆశతో కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాను. రెండు రోజుల క్రితం మా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మను కొట్టాడు. విచారించి న్యాయం చేయాలి. –ఎస్.నాగమల్లేశ్వరి, మన్నవ, పొన్నూరు మండలం
గ్యాస్ లీక్ చేసి చంపేస్తానంటున్నాడు
నా భర్త పిచ్చియ్య వ్యసనాలకు బానిసగా మారి వేధిస్తున్నాడు. తరచూ డబ్బు కావాలని, పుట్టింటికి వెళ్ళి తీసుకురావాలని హింసిస్తున్నాడు. లేకుంటే గ్యాస్ లీక్ చేసి హతమార్చుతానని బెదిరిస్తున్నాడు. నా భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి నాకు, నా పిల్లలకు రక్షణ కల్పించాలి.–టి.దుర్గ, మాచర్ల
ఏడాది దాటినా నా కుమారుడి ఆచూకీ గుర్తించలేదు
నా కుమారుడు నూర్ అహమ్మద్ తెనాలిలో బంగారం పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత ఏడాది అక్టోబర్‌లో తెనాలి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. నా కోడలు మున్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నా కుమారుడి అదృశ్యానికి మున్నా, నా కోడలు కారణమని తెలిసింది. విచారించి నాకుమారుడిని నాకు అప్పగించి న్యాయం చేయాలి.
–షేక్ అల్లాభక్షు, షరాఫ్‌బజారు, పొన్నూరు
మొక్కజొన్న డబ్బు ఇవ్వడం లేదు
నేను 2013 నుంచి సాయిలక్ష్మి ట్రేడర్స్ ద్వారా వ్యాపారం చేస్తున్నా. చెన్నైకు చెందిన శక్తి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ కంపెనీ వారికి రూ.2.50 కోట్ల విలువైన మొక్కజొన్న విత్తనాలను విక్రయించాను. ఇప్పటివరకు వారు డబ్బు ఇవ్వ లేదు. వారు ఇచ్చిన చెక్కులు కూడా చెల్లలేదు. విచారించి న్యాయం చేయాలి. –కె.శేషగిరిరావు, తెనాలి
నా భర్త మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలి
పొలం పనుల నిమిత్తం నా భర్త స్వామిని ఈనెల 16న బలవంతంగా ఎర్రబాబు పొలం పనులకు తీసుకువెళ్లాడు. రెండు రోజుల వరకు తిరిగి రాలేదు. తీరా చూస్తే నా భర్త పొలంలో శవమై కనిపించాడు. ఎర్రబాబును నిలదీస్తే చేతనైంది చేస్కోమని బెదిరించాడు. నా భర్త మృతి మిస్టరీని ఛేదించేందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేసి దోషులను శిక్షించాలి.–బి.వజ్రమ్మ, మునగోడు, అమరావతి మండలం
నిఘా నేత్రాల ప్రాముఖ్యత గుర్తించాలి: అర్బన్ ఎస్పీ
గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో నిఘా నేత్రాలుగా పిలుస్తున్న సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సోమవారం విలేకరులకు తెలిపారు. సమాజ రక్షణ, మహిళల భద్రత, నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలు పోలీస్‌శాఖకు సహకరించాలని చెప్పారు. ప్రజా భద్రత చట్టం–2013 ప్రకారం వందమంది, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలు, వ్యాపార కూడళ్లు, కాలనీలు, అపార్టుమెంట్లు, కళాశాలలు, స్కూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు లాంటి ప్రాంతాల్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సీసీ కెమెరాలు ఉంటే దర్యాప్తునకు కీలకంగా ఉపకరిస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment