సాక్షి, తెనాలి : సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండే పోలింగ్ సిబ్బంది, అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ఇచ్చే నియామకపత్రం (నకలు సహా), ఎలెక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌తో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న నియోజకవర్గంలోనే ఓటరు అయితే ఎలెక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ కోసం ఫారం–12ఏ, మరో నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తుంటే ఫారం–12లో రిటర్నింగ్ ఆఫీసర్‌కి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న తర్వాత ఎన్నికల విధులకు హాజరుకాలేకపోయినా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితా నకలు ప్రతి జిల్లా ఎన్నికల అధికారి వద్ద లభిస్తుంది. వాటిలో మీ వివరాలను సేకరించి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో రాసుకోవాలి.
పోలింగ్ ఏజెంట్లే కీలకం
ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌లో అభ్యర్థుల తరఫున పరిశీలన కోసం కూర్చునే ఏజెంట్ల పాత్ర చాలా కీలకమైంది. ఆయా కేంద్రాల్లో బోగస్ ఓట్లు పడుకుండా, ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లపై ఉంటుంది. ఒక్క ఓటు తేడా వచ్చినా గెలపు సీన్ మారిపోతుంది. ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని మార్పులు చేసింది.
పోలింగ్ స్టేషన్‌లో గుర్తింపు పోందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తుంపు పొందిన ఇతర రాష్ట్రాల పార్టీలు తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పోందిన వారు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్‌లకు కుర్చీలు వేస్తారు. ఏజెంట్ తప్పనిసరిగా అదే గ్రామానికి చెందిన వారై ఉండి, ఓటరుగా ఉండాలి. ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్ , ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్, వైర్‌లెస్, కార్డ్‌లెస్ ఫోన్లు తీసుకెళ్లకూడాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించరాదు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి చీటీలను పంపడం నిషేధం.
Comments
Please login to add a commentAdd a comment