6న ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌ | Gopal krishna Dwivedi Says VV Pads Counting at the End of Votes Counting | Sakshi
Sakshi News home page

6న ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌

Published Thu, May 2 2019 5:14 AM | Last Updated on Thu, May 2 2019 8:47 AM

Gopal krishna Dwivedi  Says VV Pads Counting at the End of Votes Counting  - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్‌ నంబర్‌ 94, గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం  బూత్‌ నంబర్‌ 197లో రీ పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు.

చివరిలోనే వీవీ ప్యాట్ల లెక్కింపు..
ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్‌లో నమోదైన ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీవీప్యాట్ల లెక్కింపుపై వివిధ వర్గాల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి వివరణ ఇచ్చింది. కౌంటింగ్‌ అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత చివరలో నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్‌లను లాటరీ విధానంలో ఎంపిక చేసి లెక్కిస్తారని, ఈవీఎంలో ఉన్న ఓట్లకు, వీవీప్యాట్‌లో ఉన్న ఓట్లకు తేడా వస్తే.. మరోసారి రీకౌంటింగ్‌ చేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

బుధవారం సచివాలయంలో ఆయన  విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎం, వీవీప్యాట్ల ఓట్లను లెక్కింపు చేస్తారని, ఒకవేళ తేడా వస్తే వీవీప్యాట్‌లో నమోదైన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా అప్పటికే ఈవీఎంలో లెక్కించిన ఓట్లను సవరణ చేసి తుది ఫలితాన్ని ప్రకటిస్తారని చెప్పారు. వీవీప్యాట్లను ఎలా లెక్కించాలో ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను రూపొందించిందని, దీని ప్రకారం బ్యాంకులో క్యాషియర్‌ కౌంటర్‌కు ఏర్పాటు చేసిన విధంగా మెష్‌ ఏర్పాటు చేసి ఆర్వో, అబ్జర్వర్ల సమక్షంలో లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఒక వీవీప్యాట్‌ లెక్కించిన తర్వాతే∙మరో వీవీప్యాట్‌ లెక్కిస్తారని  తర్వాత అధికారికంగా తుది ఫలితం ప్రకటిస్తారని  వివరించారు.

ఆంక్షల సడలింపునకు ప్రతిపాదన రాలేదు..
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనావళిని సడలించాలంటూ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని ద్వివేది స్పష్టం చేశారు. ఆంక్షల సడలింపు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, ప్రభుత్వం నుంచి అటువంటి ప్రతిపాదన రాగానే తక్షణం పంపిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలన్న విషయం ఎన్నికల నిబంధనావళిలో స్పష్టంగా ఉందని చెప్పారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరచిన ఈవీంఎలు తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌ల కిటికీలు, గుమ్మాలు, పైకప్పులను మూడు వరుసల్లో ప్లాస్టిక్‌ కవర్లతో కప్పినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, వర్షాలు వచ్చినా దెబ్బతినకుండా ఉండే భవనాలనే స్ట్రాంగ్‌ రూమ్‌లుగా ఎంపిక చేశామని, అభ్యర్థులు ఈవీఎంల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ద్వివేది స్పష్టం చేశారు. 

మెజార్టీ తగ్గితే పోస్టల్‌ బ్యాలెట్‌ రీకౌంటింగ్‌ తప్పనిసరి..
ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని సవరణలు చేసిందని ద్వివేది తెలిపారు. గతంలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల లెక్కింపు మొదలయ్యేది కాదని, ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టడానికి అనుమతిచ్చారని తెలిపారు. అలాగే పోలైన మొత్తం పోస్టల్‌ బ్యాలెట్ల కంటే అభ్యర్థి మెజార్టీ తక్కువగా ఉంటే రెండోసారి పోస్టల్‌ బ్యాలెట్లను రీకౌంటింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు మొత్తం పోలైన పోస్టల్‌ బ్యాలెట్లు 3,000 ఉంటే అభ్యర్థికి మెజారిటీ 2000 మాత్రమే వస్తే ఎవరి అభ్యర్థనలతో సంబంధం లేకుండానే కచ్చితంగా పోస్టల్‌ బ్యాలెట్లు రీకౌంటింగ్‌ చేస్తారన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement