
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రీ–పోలింగ్ జరిగే ఐదు బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి, వాటివద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల ఈనెల 6న రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో ఒకచోట శాంతిభద్రతల సమస్య, మరోచోట ఈవీఎం మొరాయించడంతో రీ–పోలింగ్‌కు ఈసీఐ అనుమతి కోరినట్లు ద్వివేది గురువారం ఇక్కడ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు బూత్ నంబరు 244లో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, అలాగే నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి గ్రామంలో 94వ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయిందని చెప్పారు.
అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలోని 247వ బూత్‌లో ఈవీఎం స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో ఇంకా 50 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ పోలింగ్‌ను అర్ధంతరంగా ఆపివేయాల్సి వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల తిరుపతి పార్లమెంటు పరిధిలో మాత్రమే రెండు బూత్‌లలో రీ–పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌పరిధిలో ఇసుకపల్లిపాలెంలోని బూత్ నంబర్ 41, సూళ్లూరుపేట సెగ్మెంట్ పరిధిలో అటకానితిప్ప బూత్ నంబరు 197లో కేవలం పార్లమెంటు స్థానానికి మాత్రమే రీ–పోలింగ్ నిర్వహించనున్నారు. రీ–పోలింగ్‌కు కావాల్సిన అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్, బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ బూత్‌లలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు ద్వివేది వివరించారు. ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment