ఇంటెలిజెన్స్‌..పోలీస్‌ వ్యవస్థలో భాగమే | Intelligence department is part of the police system | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెన్స్‌..పోలీస్‌ వ్యవస్థలో భాగమే

Published Thu, Mar 28 2019 5:36 AM | Last Updated on Thu, Mar 28 2019 5:36 AM

Intelligence department is part of the police system - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం పరిధి నుంచి ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హడావిడిగా జారీ చేసిన జీవోపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ లేకుండా పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తుందా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకున్న నిర్ణయాలను సవాల్‌ చేస్తూ కొత్త జీవోల ద్వారా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధి నుంచి తప్పించడమే కాకుండా,  ఆ విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేయడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ దివ్వేది తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా గమనిస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే చీఫ్‌ సెక్రటరీ, హోం మంత్రిత్వ శాఖ, డీజీపీ నుంచి వివరణ కోరామని, ఈ సమాచారాన్ని అంతా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు తెలిపారు. కేవలం అధికారులు ఇచ్చే సమాచారమే కాకుండా సొంత మార్గాల ద్వారా  వాస్తవ సమాచారాన్ని సేకరించి నివేదించనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర సంస్థ అని, ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చని ద్వివేది స్పష్టం చేశారు.

ఇంటెలిజెన్స్‌ లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా?
ఎన్నికల సంఘం విధులకు ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధం లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై దివ్వేది తీవ్రంగా స్పందించారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ నుంచి ముందస్తు సమాచారం లేకుండా మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంత్రాల్లో శాంతి భద్రతల పరంగా ఏ విధంగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తామంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసు విధి నిర్వహణలో ఇంటెలిజెన్స్‌ ఒక భాగమని, శాంతిభద్రతలతో ముడి పడి ఉన్న ఏ అంశమైనా ఇంటెలిజెన్స్‌తోనే ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య పరిణామంతో ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధం ఉండదా? ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యతో సంబంధం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌ నుంచి ముందస్తు సమాచారం లేకుండా సరైన అంచనా, నిఘా ఏర్పాట్లు ఎలా సాధ్యమవుతాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement