సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించేలా ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరుగుతుందని చెప్పారు. రీ పోలింగ్ ఏర్పాట్లపై ఆదివారం ఆయన మీడియాకు వివరాలను విడుదల చేశారు. మాక్ పోలింగ్ కోసం ఆయా పార్టీ ఏజెంట్లు ఉదయం 5.30కే ఎన్నికల కేంద్రాలకు చేరుకోవాలని ద్వివేది సూచించారు. రీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేలా రిటర్నింగ్ అధికారి, సహాయ ఆర్‌ఓ, అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేసినట్టు వివరించారు. ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పులు అందచేశామన్నారు. రీ పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజనీర్లును సిద్ధంగా ఉంచడంతోపాటు రిజర్వ్ ఈవీఎంలు కూడా సిద్ధం చేసినట్టు వివరించారు.
పోలింగ్ విధుల్లో 1,200 మంది పోలీస్ సిబ్బంది
రీ పోలింగ్ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో కానిస్టేబుల్ మాత్రమే బందోబస్తు విధుల్లో ఉండటం గమనార్హం. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసారి రీ పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. డీజీపీ ఠాకూర్, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి ఎస్పీలకు పలు సూచనలు చేశారు. అవసరాన్ని బట్టి ఒక్కోచోట 250 నుంచి 300 మంది సిబ్బందిని మోహరించనున్నారు. రీ పోలింగ్ నిర్వహించే ఐదు కేంద్రాల్లో 5,064 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా 1,200 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. దాదాపుగా ప్రతి నలుగురు ఓటర్లకు ఒక పోలీసు చొప్పున నియమించారు.
మూడంచెల భద్రతా వ్యవస్థలో భాగంగా మొదటి అంచెలో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఉంటుంది. రెండో అంచెలో పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు ఉండే ప్రాంతాన్ని ఇన్నర్ కార్డన్‌గా వ్యవహరిస్తారు. మూడో అంచెలో తనిఖీ పాయింట్లు, పికెట్లు ఉంటాయి. అవుటర్ కార్డన్‌గా వ్యవహరించే వాహనాలు నిలిపే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. రీ పోలింగ్ బందోబస్తు కోసం ఆరుగురు అదనపు ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 29 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, 85 మంది ఏఎస్సైలు, 402 మంది కానిస్టేబుళ్లు, 28 మంది హోంగార్డులు, 25 మంది మహిళా పోలీసులు, నలుగురు ఆర్‌ఎస్సైలు, 34 మంది ఏఆర్ హెచ్‌సీలతోపాటు 8 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బందిని కేటాయించారు. రీ పోలింగ్ సందర్భంగా తనిఖీల కోసం 14 చెక్‌పోస్టులు, 26 పికెట్లు, 7 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 3 ఏరియా డామినేషన్ పార్టీలు, 22 షాడో పార్టీలు. 16 నిఘా కెమెరాలు, 88 బాడీవార్న్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రీ పోలింగ్ కేంద్రాలు ఇవే...
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 94వ పోలింగ్ స్టేషన్ (కేశానుపల్లి – 956 మంది ఓటర్లు), గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ (నల్లచెరువు – 1,376 మంది ఓటర్లు), ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ (కలనూతల 1,070 మంది ఓటర్లు), ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 41 పోలింగ్ స్టేషన్ (ఇసుకపాలెం 1,084 మంది ఓటర్లు), సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ (అటకానితిప్ప 578 మంది ఓటర్లు) పరిధిలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment