సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పోస్టల్ బ్యాలెట్స్‌లో అవకతవకలపై సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారంటూ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై ఆర్వో సమాధానం చెప్పలేదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది... దీనిపై నివేదిక పంపాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కాగా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే తమ ప్రభుత్వ పనితీరుపట్ల విముఖంగా ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు టీడీపీ పెద్దలు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ అవకతవకలపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య న్యాయపోరాటానికి దిగింది. 40 వేల మంది ఉద్యోగుల ఓటుహక్కును అధికారులు హరించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై విచారణకు హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి ఓటుహక్కు సాదిస్తామంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment