సాక్షి, అమరావతి : ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు ఫిర్యాదు చేసిందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా వేదికలో చంద్రబాబు సమావేశాల నిర్వహణపై వైఎస్సార్ సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక కోరతామని వెల్లడించారు. గురువారమిక్కడ ద్వివేది విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై జిల్లా కలెక్టర్ల నివేదికలు కోరామని తెలిపారు. ఎన్నికల విధుల్లో తప్పుచేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ. 600 కోట్లు..
ఎన్నికల నిర్వహణలో జిల్లాల అధికారులు కష్టపడి పనిచేశారని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని.. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఇందులో పోలీసు సిబ్బంది కోసం రూ. 180 కోట్లు వ్యయమైందని వెల్లడించారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్ వివాదాలు పరిష్కరించమని జిల్లా కలెక్టర్లకు ద్వివేది సూచించారు. ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం సిబ్బందికి చెల్లింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు.
చదవండి : సీఎం చంద్రబాబు సమీక్షలకు సీఎస్ దూరం
కాగా పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చునని, మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ నిన్న (బుధవారం) పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్‌డీఏ పనులపై సమీక్ష నిర్వహించి అందరినీ విస్మయపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment