సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్ 8వ తేదీ వరకు తానే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2014లో అదే తేదీన తాను ప్రమాణ స్వీకారం చేశానని, అందువల్ల ఈ ఏడాది అప్పటి వరకు తనకు సమయం ఉందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఈ ప్రభుత్వం ఉంటుందని, అమెరికాలో అయితే ఎన్నికలు పూర్తయిన ఎనిమిది వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుందని తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను సమీక్షలు చేయవద్దంటే ఎలాగని, విధాన నిర్ణయాలు కాకుండా మిగిలిన పనులు నిర్వహించుకోవచ్చునని తెలిపారు. ఎన్నికలకూ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ ఎన్నికలు మాత్రమే నిర్వహించాలని, పరిపాలన కూడా తామే చేస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మేం వచ్చేస్తున్నాం.. గెలిచేస్తున్నామని అంటున్నారని ఎక్కడికి వస్తారని, ఎందుకు అంత ఆయాసం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై దేశం మొత్తాన్ని తాను ఎడ్యుకేట్ చేస్తున్నానని, తన వల్లే దీనిపై అంతటా చర్చ జరుగుతోందని తెలిపారు. ఈవీఎంలు పనిచేయలేదని ఎన్నికల కమిషన్ ఒప్పుకుందని, ఇందులో పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. తొమ్మిది వేల కోట్లతో వీవీ ప్యాట్‌లు పెట్టి వాటిని లెక్కించడం కుదరదంటున్నారని, ఎందుకు కుదరదని ప్రశ్నించారు. మేధావులు, విద్యార్థులు, మీడియా దీనిపై స్పందించాలన్నారు. ఈవీఎంలను వీవీప్యాట్‌లతో సరిపోల్చమంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. వాళ్ల చిన్నాన్నను చంపేసి గుండె ఆగిపోయిందని చెప్పారని, విచారణ జరుగుతుంటే ఎస్‌పీని బదిలీ చేయించారని వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు.
నేను వెళ్లిన చోటల్లా కేంద్రం దాడులు చేయిస్తోంది
దేశంలో తాను ఎక్కడికి వెళితే అక్కడ కేంద్రం దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తాను కర్నాటకలో మాండ్య వెళితే కుమారస్వామి సోదరుడు రేవణ్ణ ఇంటిపైనా, చెన్నై వెళ్లి ప్రెస్‌మీట్ పెడితే కనిమొళి ఇంటిపైనా ఐటీ దాడులు చేశారని చెప్పారు. కుమారస్వామి, నవీన్ పట్నాయక్‌ల హెలీకాఫ్టర్లను సోదాలు చేశారని, బీజేపీ ముఖ్యమంత్రుల హెలీకాఫ్టర్లను, ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో మాత్రం తనిఖీలు చేయడంలేదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తనకు వ్యతిరేకంగా గవర్నర్‌ను కలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే ఎందుకు గవర్నర్‌ని కలవలేదని, ప్రధాన కార్యదర్శి పునేఠ, ముగ్గురు ఎస్పీలను బదిలీ చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎస్‌ను కోవర్టు అన్నానని, అందులో తప్పేమిటని ప్రశ్నించారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు తనను తప్పుపట్టడం ఏమిటన్నారు. పోలింగ్ రోజు ఐదు గంటలకు సీఎస్ డీజీపీ దగ్గరకు ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్నారు.
ఎన్నికల నిర్వహణలో ఈసీ పెద్దలు పూర్తిగా విఫలమయ్యారని, ఢిల్లీలో కూర్చుని ఫొటోలకు ఫోజులు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈవీఎంలను తీసుకెళ్లి రెండు, మూడు రోజులు ఇంట్లో పెట్టుకున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి రెండు నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందరికీ జీతాలు చెల్లించామని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాత్రం ఇంకా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 69 శాతం పూర్తయ్యాయని, ఈ పనులకు సంబంధించి కేంద్రం ఇంకా రూ.4,508.35 కోట్లు ఇవ్వాల్సివుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షపాతం లోటులో ఉండడం వల్ల తాగునీటి సమస్యలు వచ్చాయని, 3,494 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. జలవాణి పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు.
జూన్ 8 వరకూ నేనే ముఖ్యమంత్రి
Published Thu, Apr 18 2019 3:45 AM | Last Updated on Thu, Apr 18 2019 3:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment