ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు యధావిధిగా తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించారు. బుధవారం అమరావతి లోని సచివాలయంలో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పోయి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఎన్నికల ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసిపోయింది. ఆ తర్వాత ఏ నాయకుడూ ప్రచారానికి దిగకూడదు. ఎన్నికల నియమావళి ఇందుకు అంగీకరించదు.
కానీ చంద్రబాబు తాను అన్నిటికీ అతీతుడనని భావిస్తారు. అందుకే పదవీభ్రష్టత్వం ఖాయమని ఖరారైన చివరి నిమిషంలో కూడా దింపుడు కళ్లం ఆశతో ఏదో హడావుడి చేసి మీడియాకెక్కాలని తెగ తాపత్రయపడ్డారు. అందుకు ఏకంగా ఎన్నికల కమిషన్ కార్యాలయాన్నే ఆయన ఎంచుకున్నారు. ద్వివేదీతో అమర్యాద కరంగా ప్రవర్తించి అడ్డగోలుగా మాట్లాడారు. బెదిరింపులకు దిగారు. వేలు చూపిస్తూ స్వరం పెంచి ఆయన మాట్లాడిన తీరు అధికార యంత్రాంగాన్ని మాత్రమే కాదు... రాజకీయవర్గాలనూ, ప్రజ లనూ కూడా ఆశ్చర్యపరిచింది.
‘మీరు పోస్ట్‌మాన్ డ్యూటీ చేస్తారా... కేంద్ర ఎన్నికల సంఘం చెప్పి నట్టు ఎలా చేస్తారు?’ అంటూ బాబు ప్రశ్నించడం హాస్యాస్పదం. రాష్ట్ర ఎన్నికల సంఘం తన చెప్పు చేతల్లో నడవాలన్నది ఆయన ఉద్దేశం కాబోలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం ఊహకందనిది. ఈ మాటల్లో కొత్తేమీ లేదు. గత కొన్నిరోజులుగా రోడ్ షోల్లో ఏకరువు పెడుతున్న ఆరోపణలే అవన్నీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీని, ముగ్గురు ఎస్‌పీలను బదిలీ చేయడం ఆయనకు పరమ అభ్యంతరకరం. తాను ఏం చేసినా అన్ని వ్యవస్థలూ అచేతనంగా ఉండిపోవాలని ఆయన భావిస్తున్నారు.
ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) బదిలీ చేసింది? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, మరికొందరు పోలీస్ అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వారిలో ముగ్గురిపై చర్య తీసుకుంది. కానీ ఆ చర్యను వమ్ము చేసి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకటేశ్వరరావు బదిలీని ఆపాలని చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం వరస బెట్టి జారీచేసిన మూడు జీవోలు బాబు మానసిక స్థితికి, ఆయన మార్క్ పాలనకూ అద్దం పడ తాయి. ఆ ముగ్గురు అధికారులనూ బదిలీ చేస్తూ ఒక జీవో, వారిలో కేవలం ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తూ మరో జీవో, ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మినహాయిస్తూ ఇంకొక జీవో విడుదల చేశారు. ఈ మూడు జీవోల మధ్యా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్నదని, పైగా ఇందులో ఆఖరుగా విడుదలచేసిన జీవోను ఎన్నికల సంఘం చర్యను వమ్ము చేసేందుకు వీలుగా వెనకటి తేదీ నుంచి అమలయ్యేలా జారీ చేశారని గమనిం చుకుంటే బాబు సర్కారు అనైతికత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.
చెప్పాలంటే ఈ జీవోల జారీలో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ వాస్తవానికి పోస్ట్‌మాన్‌లా ప్రవర్తిం చారు. ఇష్టంగానో, అయిష్టంగానో బాబు అభీష్టాన్ని నెరవేర్చారు తప్ప నిబంధనలేం చెబుతు న్నాయో, తన కర్తవ్యమేమిటో గమనించుకోలేకపోయారు. అందువల్లే సీఈసీ ఆయనపై కూడా చర్య తీసుకోవాల్సి వచ్చింది. తనపై విరుచుకుపడుతున్న బాబును ఈ జీవోల సంగతేమిటని కెమెరాల సాక్షిగా ద్వివేదీ నిలదీసి ఉంటే ఏమయ్యేది? వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించాలా అని ప్రశ్నిస్తే బాబు పరువు ఏమయ్యేది? ఇక్కడ మరో ముఖ్య విషయం గమనించాలి. ఈ బదిలీలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో తాము జోక్యం చేసు కోలేమని హైకోర్టు తోసిపుచ్చింది.
ఎన్నికల సంఘం పనితీరుపై ఏ పార్టీకైనా అసంతృప్తి ఉండటం తప్పేమీ కాదు. నియమావళిని సక్రమంగా అందరితో పాటించేలా చేయడంలో అది విఫలమవుతున్నదనో, ఉల్లంఘనలు జరుగు తున్నా పట్టించుకోవడంలేదనో ఆరోపించదల్చుకుంటే అందుకు తగిన ఆధారాలను అందించాలి. తగిన వేదికల వద్ద ఫిర్యాదు చేయాలి. దేశంలో అందరికన్నా తానే సీనియర్ రాజకీయవేత్తనని, తనకు అపార అనుభవమున్నదని తరచు చెప్పుకునే బాబుకు ఇలాంటి అంశాలు ఇంకా తెలియ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు తెలియక కాదు. ఏ పనైనా ఆయన తెలిసే చేస్తారు. తెలుసుకునే చేస్తారు. ఎవరూ తనని గమనించరని, గమనించినా నిలదీయరని అపార విశ్వాసం. ఏ వ్యవస్థా తనను ప్రశ్నించదన్న ధీమా. అంతక్రితం తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడైనా, మూడేళ్లక్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను నోట్ల కట్టలు పంపి ప్రలోభపరచాలని ప్రయత్నించినప్పుడైనా ఆయన ఈ ధీమాతోనే బరితెగించారు. ఇప్పుడు యావత్తు అధికార యంత్రాంగాన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నది ఈ ధీమాతోనే!
నిజానికి షెడ్యూల్ ప్రకటించిననాటినుంచి బాబు య«థేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తాను ఆపద్ధర్మ సీఎంనన్న సంగతి మరిచి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని మొబిలైజేషన్ అడ్వాన్సులకింద, నీరు–చెట్టు పథకం కింద నిధుల సంతర్పణ చేశారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన జాబితాలనూ, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి సొంత పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల ద్వారా, తమ పార్టీ వారి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలనూ, కార్యకర్తలనూ బెదరగొట్టాలని చూస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో ఎన్నికల సంఘం కఠినంగా ఉండటం లేదన్న అసంతృప్తి అందరిలో ఉంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ తమకేదో తీరని అన్యాయం జరిగిందని బాబు శోకాలు పెడుతున్నారు. ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చిన ప్రజానీకాన్ని ఇలాంటి కపట నాటకాలు ఏమార్చలేవు. బాబు తన అప్రజాస్వామిక వైఖరికి స్వస్తి చెప్పి వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment