బిల్లు క్లాజులపై సవరణలివ్వండి
-
ఎమ్మెల్యేలకు స్పీకర్ స్పష్టీకరణ
-
10వ తేదీ మధ్యాహ్నం దాకా గడువు
-
మూడో రోజూ సభ వాయిదానే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013లోని క్లాజులపై ఏవైనా సవరణ నోటీసులు ఇవ్వాలనుకునే ఎమ్మెల్యేలు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు తన కార్యాలయంలో అందించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇందుకోసం స్పీకర్ కార్యాలయం రూపొందించిన ఫార్మాట్‌లోనే సవరణలను పొందుపరచాలని సోమవారం శాసనసభలో ఆయన స్పష్టం చేశారు. సోమవారం శాసనసభ వ్యవహారాల కమిటీ సుదీర్ఘ సమావేశం అనంతరం సభ ప్రారంభమైన తరువాత సభ్యులు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల మధ్యలోనే ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ‘నేను ప్రకటన చేయాల్సి ఉంది. మీరంతా సహకరించండి.
విభజన బిల్లుపై చర్చించండి. మీ అభిప్రాయాలు చెప్పండి. సభా సమయాన్ని ఇలా వృథా చేయడం సరి కాదు. శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 10వ తేదీ లోపు సవరణ నోటీసులివ్వండి’ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం తొమ్మిదింటికి సభ ప్రారంభం కాగానే పలు పార్టీల సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
అంతకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్ర నినాదాలతో పోడియంలోకి వెళ్లారు. టీడీపీ సభ్యులు కూడా అలాగే చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ కూడా వెల్‌లోకి వెళ్లడానికి ముందుకొచ్చారు. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు కూడా సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దాంతో సభ వాయిదా పడింది. బీఏసీ అనంతరం మధ్యాహ్నం 1.46కు తిరిగి ప్రారంభమైనా అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి.
మండలిదీ అదే తీరు
శాసనమండలి సోమవారం పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. ఉదయం 10.02కు సభ ఆరంభం కాగానే వైఎస్సార్‌సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలువురు తెలంగాణ సభ్యులు తమ స్థానాల్లోంచే తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో సభను చైర్మన్ చక్రపాణి వాయిదా వేశారు. 1.30కు తిరిగి సమావేశమైనా అదే పరిస్థితి కొనసాగడంతో రెండు నిమిషాలకే సభ మంగళవారానికి వాయిదా పడింది.