కర్నూలు(జిల్లా పరిషత్) : ఎంసెట్ విద్యార్థులను వేసవి వడగాడ్పులను మించి ఆర్టీసీ సమ్మె గుబులు పుట్టిస్తోంది. సాధారణ రోజుల్లోనే ఎంసెట్ పరీక్ష రాసేందుకు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం చూశాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించని నేపథ్యంలో ప్రస్తుత ఆర్టీసీ సమ్మె ఆందోళన రేకెత్తిస్తుంది. సమ్మె ఉన్నా ప్రత్యేక బస్సులతో ఎంసెట్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం నాటి పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకునేందుకు విద్యార్థులు గురువారం నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. కొందరు విద్యార్థులు రాత్రికే కర్నూలు, నంద్యాలలోని బంధువుల ఇళ్లకు, లాడ్జిలకు చేరుకున్నారు. మరికొందరు శుక్రవారం ఉదయమే పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానంగా ఆలూరు, ఆస్పరి, హొళగుంద, కౌతాళం నుంచి కర్నూలుకు, చాగలమర్రి, శ్రీశైలం, ఆత్మకూరు తదితర ప్రాంతాల నుంచి నంద్యాలకు వెళ్లేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఆర్టీసీ ఆధ్వర్యంలో 154 ప్రత్యేక బస్సులు
ఎంసెట్ కోసం 154 ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.వి.రామం తెలిపారు. కర్నూలు, నంద్యాల పరీక్షల కేంద్రాలకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, గూడూరు, డోన్, బేతంచర్ల, ఆత్మకూరు, మహానంది, గడివేముల, బనగానపల్లి, కోవెలకుంట్ల, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు వేశామన్నారు. ఇప్పటికే రెగ్యులర్ సర్వీసుల్లో భాగంగా 312 బస్సులను వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నామన్నారు.
ప్రైవేటు కాలేజీల ఆధ్వర్యంలో...
ఎంసెట్ పరీక్షలకు నగర శివారులోని పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సౌకర్యాన్ని కల్పించాయి. నగరంలోని ఆయా ప్రధాన కూడళ్ల మీదుగా ఈ బస్సులు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చనున్నాయి.
పరీక్ష కేంద్రాలకు జి.పుల్లయ్య కళాశాల బస్సులు
నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ బస్సులు పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, వెంకటరమణకాలని, బళ్లారిచౌరస్తా, రాజవిహార్, సి.క్యాంపు నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్తాయన్నారు. పరీక్షల అనంతరం ఆయా పాయింట్ల వద్ద విద్యార్థులను వదిలేలా ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలకు, మెడికల్ విద్యార్థుల కోసం మధ్యాహ్నం 1 గంటకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఏవీఆర్, ఎస్వీఆర్ బస్సులు
నగరంలోని ఎంసెట్ పరీక్ష నిర్వహించే కేంద్రాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు నన్నూరులోని ఏవీఆర్, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటలకు స్థానిక బళ్లారిచౌరస్తా నుంచి కొత్తబస్టాండ్, శ్రీరామథియేటర్, రాజవిహార్ సెంటర్, కర్నూలు మెడికల్ కాలేజి, కలెక్టరేట్, సి.క్యాంపు మీదుగా ఆయా పరీక్ష కేంద్రాలకు రెండు బస్సులను ఉచితంగా తిప్పుతామన్నారు.
బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో..
నగర శివారులోని బృందావన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని నంద్యా ల చెక్‌పోస్టు, సంతోష్‌నగర్, పాతబస్టాండ్, ప్రకాష్‌నగర్, బస్టాండ్, బళ్లారిచౌరస్తా, మెడికల్ కాలేజి, కృష్ణానగర్‌ల నుంచి ఉదయం 8.15 గంటలకు బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు.
ఒక్క రోజు సమ్మె విరమించండి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఎంసెట్ పరీక్షను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఒక్కరోజు మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ ఆర్టీసీ యూనియన్ నేతలను కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్‌తో కలిసి కర్నూలు ఆర్టీసీ-2 డిపోలో యూనియన్‌ల నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం కర్నూలు, నంద్యాల్లో జరిగే ఎంసెట్ పరీక్షకు మారుమూల గ్రామాల నుండి సైతం విద్యార్థులు హాజరు కానున్నారని.. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారన్నారు. విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పే పరీక్ష అయినందున సమ్మె నుండి ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలని కోరారు. యూనియన్ నేతలు స్పందిస్తూ ఇది ఒక జిల్లాకు సంబంధించిన ఆందోళన కాదని, మొత్తం రాష్ట్రానికి సంబంధించినదన్నారు. రాష్ట్ర స్థాయిలో చర్చించి తగు నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.
ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు
Published Fri, May 8 2015 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement