కర్నూలు సిటీ:
ప్రత్యేక హోదా అంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్యాకేజీల కోసమే దొంగల్లా నాటకాలు ఆడుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో రాయలసీమ జల వనరులు, కరువు కాటకాలపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1870 నాటి నుంచి రాయలసీమలో కరువు ఉందని బ్రిటీష్ ప్రభుత్వం గెజిట్‌లో తెలిపిందన్నారు. నాడు వారు విదేశీయులైనా సీమ కరువు నివారణ కోసం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం చర్యలు తీసుకున్నారన్నారు. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని.. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నాయని ఆరోపించారు.
పెట్టుబడుల కోసం కొంత మంది రైతులు కిడ్నీలు..అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో 60 శాతం మందికి ఒక్క పూట కూడా తిండి దొరకనంత కరువు నెలకొందని, 45 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదన్నారు. కరువు ప్రాంతాన్ని వదిలేసి.. సీఎం చంద్రబాబు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు అమరావతి పేరుతోనే కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత లాభం కోసం పట్టిసీమను నిర్మిస్తున్నట్లు అనుమానం వస్తోందన్నారు. సీమ కరువుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలనే వచ్చే నెల 9న ఢిల్లీలో జల సాధన దీక్ష చేపట్టనున్నట్లు బెరైడ్డి తెలిపారు.
ప్రముఖ విద్యా సంస్థల అధినేత కె.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏటా వందల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నా వాటిని వినియోగించించుకునేలా పాలకులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాయల సీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ..బ్రిటీష్ ఇంజనీర్ సర్ మెకంజీ సూచించిన విధంగా తుంగ, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో దళిత సంఘం నాయకుడు బాలసుందరం, ప్రముఖ రిటైర్ హైడ్రాలాజీకల్ నిపుణుడు సుబ్బరాయుడు, ప్రైవేటు స్కూళ్ల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్యాకేజీల కోసమే ‘ప్రత్యేక’ నాటకాలు
Published Fri, Aug 14 2015 3:13 AM | Last Updated on Thu, Mar 28 2019 5:35 PM
Advertisement
Advertisement