కేజీబీవీల్లో బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి
Published Tue, Jan 28 2014 12:31 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కేజీబీవీ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాసరావు ఆదేశించారు. గుంటూరు పాతబస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో సోమవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల ప్రత్యేకాధికారులు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి డాక్టర్ తన్నీరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీబీవీల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి వ్యక్తిగత భద్రతపై ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. కేజీబీవీల్లో ఉదయం పూట ఉపాధ్యాయులు వచ్చిన తరువాత, మెయిన్ గేట్లు మూసివేసి తిరిగి సాయంత్రం తరగతులు ముగిసిన తరువాతే తెరవాలని, పనివేళల్లో విజిటర్స్‌ను లోపలికి అనుమతించరాదని సూచించారు.
విద్యాలయాల రిజిస్టర్‌లను సక్రమంగా నిర్వహిస్తూ, సిలబస్ సకాలంలో పూర్తిచేసి, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర జీసీడీవో ఎ.విజయలక్ష్మి, కేజీబీవీ సొసైటీ సీఎంవో కె.జయకర్, జీసీడీవో రమాదేవి, ఏఎంవో రామకృష్ణ ప్రసాద్, ఆర్వీం సెక్టోరల్ అధికారులు సుభానీ, రుహుల్లా, ఇమ్మానియేల్, గుంటూరు జిల్లాలోని 24, కృష్ణా జిల్లాలోని మూడు కేజీబీవీల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Advertisement
Advertisement