Kasturba Gandhi Girls Schools
-
కష్టాల కస్తూర్బా.. విద్యార్థులతో వెట్టిచాకిరి
అనాథ, పేద ఆడ పిల్లలకు ఉన్నత చదువులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సీఆర్టీలు, ఎస్ఓల ఆధిపత్య పోరులో విద్యార్థినులు బలవుతున్నారు. మెనూ కూడా అమలు కాకపోవడంతో ఆకలితో అల్లాడిపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. మంత్రి శంకరనారాయణ ఇటీవల సోమందేపల్లి కేజీబీవీని సందర్శించారు. ఎస్ఓ, సీఆర్టీల మధ్య నెలకొన్న విభేదాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని విద్యార్థినులు మంత్రి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. మంత్రి ఆదేశాలతో తర్వాతి రోజు కలెక్టర్ వెళ్లి విచారణ చేపట్టి ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. సాక్షి, అనంతపురం : బాలికల డ్రాపవుట్స్ తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల ఆడ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కేజీబీవీల నిర్వహణ అధ్వానంగా మారింది. జిల్లాలో 62 కేజీబీవీలుండగా.. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ సుమారు 13,450 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ చార్జి రూ. 1000 నుంచి రూ. 1400కు పెంచింది. అయినా కూడా విద్యార్థినులకు పౌష్టికాహారం అందడం లేదు. చాలా కేజీబీవీల్లో మెనూ అమలు కావడం లేదు. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్(ఎస్ఓ) చేయించేదే మెనూలా మారింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ స్థానంలో పామాయిల్ నిబంధనల మేరకు కేజీబీవీలకు సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ మేరకు జూన్ నెలలో సన్‌ఫ్లవర్ అయిల్ సరఫరా చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం పామాయిల్ సరఫరా చేశారు. సెప్టెంబరు కూడా పామాయిలే సరఫరా చేశారు. తీరా దసరా సెలవుల ముందు ఓరోజు ఉన్నఫళంగా ఉన్న పామాయిల్ ప్యాకెట్లను వెనక్కు పంపి సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేశారు. దీని వెనుక అసలు రహస్యం అధికారులు, ఎస్ఓలు, సరుకులు సరఫరా చేసే అధికారులకే తెలియాలి. అలాగే వేరుశనగ విత్తనాలు, కందిబేడలు తదితర సరుకులు కూడా నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. ఎస్ఓలు, సీఆర్టీల మధ్య కోల్డ్‌వార్ దాదాపు కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు(ఎస్ఓలు), కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు (సీఆర్టీ)ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. పరీక్ష పేపర్లు దిద్దడం, మార్కులు వేయడం, నోట్స్‌లు దిద్దడం తదితర విషయాలు సీఆర్టీలే చూసుకోవాలి. చాలాచోట్ల ఈ పనులన్నీ విద్యార్థినులతో చేయిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన ఎస్ఓలను... సీఆర్టీలు లక్ష్యం చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఎస్ఓలు కేజీబీవీల్లోనే ‘ప్రత్యేక వంటకాలు’ తయారు చేయించుకుని ఇళ్లకు పార్సిల్ తీసుకెళ్తున్నారు. దీంతో తామేమీ తక్కువ కాదన్నట్లు సీఆర్టీలు కూడా ఎగ్‌కర్రీ, చపా తి తదితర వంటలు చేయించుకుంటున్నారు. వీరు ప్రత్యేక వంటకాలు చేయించుకుని విద్యార్థినులకు మాత్రం తక్కువ పరిమాణంలో సరుకులు వేసి వంటకాలు చేయిస్తున్నారు. మెనూపై విద్యార్థులు ఎవరైనా ప్రశ్నిస్తే ‘‘ఇది మీ ఇళ్లు కాదు..పెట్టింది తినండి’’ అంటూ నోరు పారేసుకుంటున్నారు. విద్యార్థినులతో ఇళ్లలోనూ పనులు కొందరు ఎస్ఓలు కేజీబీవీ విద్యార్థులతో తమ ఇళ్ల లో పాచిపనులు చేయించుకుంటున్నారు. లేదంటే కేజీబీవీలో వండిన వంటకాలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు బాలికలను వినియోగించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే దుర్భాషలాడుతున్నారు. అక్కడికీ చెప్పినమాట వినకపోతే బలవంతంగా టీసీలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే పరిస్థితి దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది. తూతూమంత్రంగా తనిఖీలు ఎస్ఎస్ఏ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసినా తూతూమంత్రంగానే ఉంటున్నాయి. చుట్టపుచూపుగా వెళ్లి తనిఖీలు చేసినట్లు రికార్డుల్లో రాయడం తప్పితే... చర్యలు తీసుకుంది శూన్యం. ఇటీవల కేజీబీవీల్లో వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేద విద్యార్థినులు చదువుకుంటున్న కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నా కూతురితో రోజూ వెట్టిచాకిరీ చేయిస్తోంది ‘‘కణేకల్లు కేజీబీవీ ఎస్ఓ నా కూతురితో రోజూ వెట్టిచాకిరీ చేయిస్తోంది. టిఫిన్, భోజనం, సాయంత్రం భోజనం ఇంట్లో ఇచ్చిరావాలని చెబుతోంది. తన ఇంట్లో పనులు కూడా చేయాలని ఇబ్బంది పెడుతోంది. ప్రశ్నిస్తే టీసీ ఇచ్చిపంపుతానంటూ పెట్టింది. పైగా పేరెంట్స్‌కు విషయాలన్నీ చెబుతావా? అంటూ నా కుమార్తెను కొట్టి భోజనం కూడా పెట్టలేదు. ఆరోగ్య కారణాల వల్ల ఇక్కడ ఉండలేక పోతున్నా..నా టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నానంటూ నా కూతురితో బలవంతంగా లేఖ రాయించుకుని కేజీబీవీ నుంచి గెంటేసింది. నేను వెళ్లి అడిగితే నోటికొచ్చినట్లు దుర్భాషలాడింది.’’ ⇔ ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ‘మీకోసం’లో ఓ ఇంటర్ విద్యార్థిని తల్లి చేసిన ఫిర్యాదు ఇది ⇔ ‘‘రుచికరంగా వండడానికి ఇదేమైనా మీఇల్లు అనుకుంటున్నారా?. ఏది వండితే అదే తినాలి. లేదంటే పస్తులుండండి’’ ⇔ కురుగుంట కేజీబీవీలో నాణ్యమైన భోజనం పెట్టాలని కోరిన విద్యార్థినులపై ఎస్ఓ దురుసు వ్యాఖ్యలివి -
కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
కొత్తగూడెం/చర్ల: కస్తూర్బా విద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని లక్ష్మీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్‌లో కూడా కూర్చున్న వీరిద్దరూ నిద్రకు ఉపక్రమించి.. తెల్లవారే సరికి కనిపించకపోవడంతో విద్యాలయ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొయ్యూరు, సాయినగర్కాలనీలకు చెందిన గోటి గౌరి, బండారు సౌజన్య చర్లలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు విద్యార్థులను చదివించేందుకు సిబ్బంది నిద్ర లేపుతుండగా వీరిరువురూ కనిపించలేదు. ఈ విషయాన్ని సిబ్బంది విద్యాలయం ప్రత్యేకాధికారిణికి సమాచారం అందించారు. సిబ్బంది అంతటా వెదికినా ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలిపారు. విద్యాలయానికి మూడు వైపులా ప్రహరీ గోడ, గేట్లకు తాళాలు వేసి ఉండగా వెనుకవైపున ఉన్న ప్రహరీగోడ కూలిపోయింది. అక్కడి నుంచే విద్యార్థినులు వెళ్లిపోయి ఉంటారని అంతా అనుమానిస్తున్నారు. విద్యాలయంలో ముందు భాగం, హాలులో మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా విద్యార్థులు వెళ్లిన పుటేజీలు అందులో రికార్డు కాలేదు. ఎంఈఓ జుంకీలాల్, తహశీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీపీ కోందరామయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటమళ్ల హరిత విద్యాలయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సూచనల మేరకు విద్యాలయం ప్రత్యేకాధికారిణి చర్ల పోలీస్టేషన్ పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంబించారు. విద్యార్థినుల అదృశ్యానికి చదువుల ఒత్తిళ్లు కారణమా... సిబ్బంది మందలించారా... లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
ఎక్కడి పని అక్కడే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)ల నిర్మాణ పనులు ఎస్ఎస్ఏ ఇంజినీర్లకు తలనొప్పిగా మారాయి. ఓ వైపు పనులు నత్తనడకన సాగుతుండగా.. మరోవైపు పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో నిర్మాణ పనుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఈ నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 24 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. వీటిలో తొలి దశలో 12 నిర్మాణాలు పూర్తి చేశారు. రెండో విడతలలో భాగంగా 2012 సంవత్సరంలో 12 కేజీబీవీలకు భవనాలు మంజూరు కాగా.. నిబంధనల మేరకు పనులు మొదలుపెట్టారు. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు కేవలం మూడు భవనాలు మాత్రమే పూర్తికావడం గమనార్హం. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. ఒక్కో కేజీబీవీ భవనాన్ని రూ.1.25 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టరు చేసే పనికి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తారు. రెండో విడతలో భాగంగా షాబాద్, మొయినాబాద్, పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం, బంట్వారం, మోమిన్‌పేట్, మహేశ్వరం, చేవెళ్ల, నవాబ్‌పేట్, శంకర్పల్లి, యాచారం కేజీబీవీలకు గాను కేవలం షాబాద్, మొయినాబాద్, తాండూరు కేజీబీవీ పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి మొత్తం రూ.15 కోట్లకుగాను రూ.4.17 కోట్లు ఖర్చయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. పనులు పూర్తికాని వాటిలో బంట్వారం, నవాబ్‌పేట కేజీబీవీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చేపట్టలేమని చేతులెత్తేశారు. యాచారం కాంట్రాక్టరు సైతం పనులు నిలిపి వేయడంతో నిర్మాణ పనులు ఆందోళనలో పడ్డాయి. యంత్రాంగానికి కనీస సమాచారం ఇవ్వకుండా పనులు నిలిపి వేయడం.. వాటిని కొత్తవారికి ఇచ్చే క్రమంలో ఇంజినీర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో పాత కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి కాంట్రాక్టును రద్దు చేయాలని నిర్ణయించారు. నాలుగైదు రోజుల్లో ఈ తంతు పూర్తిచేసి కొత్తవారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనున్నారు. డిసెంబర్ డెడ్‌లైన్.. ప్రస్తుతం తొమ్మిదిచోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిలో మూడు చోట్ల కొత్తవారికి తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇటీవలి సమీక్షలో నిర్మాణ పనులపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నత్తనడకన సాగే పనులపై సీరియస్‌గా స్పందించిన ఆయన.. కాంట్రాక్టు రద్దు చేయాలని స్పష్టం చేశారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు వారికి నోటీసులిచ్చారు. డిసెంబర్ వరకు అన్ని నిర్మాణాలు పూర్తిచేయాలంటూ ఎస్ఎస్ఏ ఇంజినీర్లు.. కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. ఈసారైనా నిర్ధిష్టగడువులోగా పనులు పూర్తిచేయించి వినియోగంలోకి తెస్తారో లేదో చూడాలి. -
కేజీబీవీల్లో బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కేజీబీవీ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాసరావు ఆదేశించారు. గుంటూరు పాతబస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో సోమవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల ప్రత్యేకాధికారులు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి డాక్టర్ తన్నీరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీబీవీల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి వ్యక్తిగత భద్రతపై ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. కేజీబీవీల్లో ఉదయం పూట ఉపాధ్యాయులు వచ్చిన తరువాత, మెయిన్ గేట్లు మూసివేసి తిరిగి సాయంత్రం తరగతులు ముగిసిన తరువాతే తెరవాలని, పనివేళల్లో విజిటర్స్‌ను లోపలికి అనుమతించరాదని సూచించారు. విద్యాలయాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహిస్తూ, సిలబస్ సకాలంలో పూర్తిచేసి, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర జీసీడీవో ఎ.విజయలక్ష్మి, కేజీబీవీ సొసైటీ సీఎంవో కె.జయకర్, జీసీడీవో రమాదేవి, ఏఎంవో రామకృష్ణ ప్రసాద్, ఆర్వీం సెక్టోరల్ అధికారులు సుభానీ, రుహుల్లా, ఇమ్మానియేల్, గుంటూరు జిల్లాలోని 24, కృష్ణా జిల్లాలోని మూడు కేజీబీవీల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. -
ఆంధ్రప్రదేశ్‌లోనే కేజీబీవీలు అధికం
అర్వపల్లి, న్యూస్‌లైన్: అన్ని రాష్ట్రాల్లో కన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్వీఎం రాష్ట్ర కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి (సీఎంఓ) డాక్టర్ బండి సాయన్న చెప్పారు. అర్వపల్లి కేజీబీవీని మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 743 కేజీబీవీలు పని చేస్తున్నాయని తెలిపారు. బాలికలకు కేజీబీవీలలో ఉన్న వసతులు మరే వసతి గృహాల్లో ఉండవన్నారు. ఆర్వీఎం ఎక్కడా రాజీ పడకుండా కేజీబీవీలకు సౌకర్యా లు కల్పిస్తుందని చెప్పారు. అన్ని కేజీబీవీలకు పూర్తి కాలపు ఎస్ఓలను నియమించామన్నారు. ఇక నుంచి కేజీబీవీల్లో ప్రతి ఆదివారం మాంసాహార భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కేజీబీవీల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి రోజు భోజనంలో కోడిగుడ్లు పెట్టాలని ఎస్ఓలను ఆదేశించారు. కేజీబీవీలకు బెడ్షీట్లు 15 రోజుల్లో రానున్నాయని తెలిపారు. కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనాలలో ఎక్కడైనా సమస్యలు ఉంటె వెంటనే గుత్తేదార్లతో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఏ సమస్యలు ఉన్నా ఇక నుంచి బాలికలు 1800425, 3525 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ లింగయ్య, ఎమ్మార్జీ పగిళ్ల సైదులు, విజయలక్ష్మి, పాల్గొన్నారు. కస్తూరిబా పాఠశాల తనిఖీ తుంగతుర్తి : మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆర్వీఎం అధికారి డాక్టర్ బండి సాయన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుడడంతో విద్యార్థులకు సరైనా బాత్రూంలు, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాలను పరిశీలించారు. పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి జనవరి 1వ తేదీ వరకు ప్రారంభించాలని, లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కో ఆర్డినేటర్ జి. లింగయ్య తదితరులు ఉన్నారు.